ప్రతిభ..: జయం మనదే!

7 Jun, 2022 00:20 IST|Sakshi
కుటుంబ సభ్యులతో హరిణి లోగాన్‌ స్ఫూర్తిదాయక విజయం: హరిణి

అమెరికాలో స్పెల్లింగ్‌ బీ పోటీలకు పెద్ద చరిత్ర, ఘనత ఉన్నాయి. ఆ చరిత్రను భారత సంతతికి చెందిన పిల్లలు తమ ఘనతతో తిరగరాస్తున్నారు. గెలుపు జెండా ఎగరేస్తున్నారు... తాజాగా పద్నాలుగు సంవత్సరాల హరిణి లోగాన్‌ ‘2022 స్క్రిప్స్‌ నేషనల్‌ స్పెల్లింగ్‌ బీ’ పోటీ విజేతగా నిలిచింది...

ఒక పదం స్పెల్లింగ్‌ పలకడమే కాదు, దాని అర్థం కూడా చెప్పాలని ఈసారి కొత్త నిబంధన చేర్చారు. ఈ ప్రభావంతో చాలామంది ఫైనల్‌ వరకు చేరుకోలేకపోయారు. విక్రమ్‌రాజు, సహన శ్రీకాంత్, అభిలాష పటేల్, శివకుమార్‌... మొదలైన వారితోపాటు ఫైనల్లో పోటీ పడింది హరిణి. ఒక పదానికి హరిణి ఇచ్చిన నిర్వచనం తప్పేమీ కాదని న్యాయనిర్ణేతలు ప్రకటించడం ద్వారా ‘ఎలిమినేట్‌’ ప్రమాదం నుంచి తృటిలో బయటపడింది.

90 సెకండ్ల లైటినింగ్‌ రౌండ్‌ గతంలో లేనిది. ఈ రౌండ్‌లో 90 సెకన్‌లలో హరిణి 26 పదాలకు 21 పదాల స్పెల్లింగ్‌ కరెక్ట్‌గా చెప్పింది. తొలిసారిగా ప్రవేశపెట్టిన టై బ్రేకర్‌లో విజయం సాధించింది. విక్టరీ ట్రోఫీని అందుకొని 50 వేల డాలర్ల ప్రైజ్‌మనీని సొంతం చేసుకుంది.
‘కల నిజం అయినందుకు ఆనందంగా ఉంది. ఈ గెలుపు ఉత్సాహాన్ని ఇవ్వడమే కాదు ముందుకు వెళ్లడానికి శక్తిని ఇచ్చింది’ అంటుంది టెక్సాస్‌లోని సాన్‌ ఆంటోనియోకు చెందిన హరిణి.
అయితే ఆమె సంతోషం వెనుక ఎంతో కష్టం ఉంది. ‘స్పెల్లింగ్‌ బీ’ బరిలోకి దిగే క్రమంలో రోజుకు ఆరు నుంచి ఎనిమిదిగంటల పాటు కష్టపడేది.

‘పోటీ సంగతి ఎలా ఉన్నా, ప్రిపేర్‌ అవుతున్న క్రమంలో రకరకాల కొత్త పదాలు, వాటిద్వారా ఎన్నో విషయాలను తెలుసుకోగలిగాను’ అంటుంది హరిణి.
గత విజేతల విజయాలు హరిణిలో స్ఫూర్తి నింపాయి. ‘ఈసారి విన్నర్‌ ట్రోఫీని నేను అందుకోవాల్సిందే’ అనే పట్టుదల పెంచాయి.
పోటీదారుల ఒత్తిడి ఎలా ఉన్నా, ప్రేక్షకులు మాత్రం ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌ను చూసినంత ఉత్కంఠగా స్పెల్లింగ్‌ బీ పోటీని చూశారు. కోవిడ్‌ పుణ్యమా అని గత రెండు సంవత్సరాలు ఈ ఉత్సాహం మిస్‌ అయింది.

‘తాను ఎంతో కష్టపడింది అని ఆమె విజయం చెప్పకనే చెప్పింది’ అంటూ హరిణిని ప్రశంసిస్తున్నారు ‘వర్డ్‌ బై వర్డ్‌: ది సీక్రెట్‌ లైఫ్‌ ఆఫ్‌ డిక్షనరీస్‌’ రచయిత కొరి స్టాంపర్‌.
హరిణికి పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం. హైస్కూల్లో చదువుతున్నప్పుడే పుస్తకం రాసే ప్రయత్నం చేసింది.
విజయం కోసం తాను పడిన కష్టాన్నే అక్షరీకరిస్తే ఎంతోమందికి అది స్ఫూర్తి ఇచ్చే పుస్తకం అవుతుంది కదా!

మరిన్ని వార్తలు