Children's Day 2021 Special: పిట్ట కొంచెం... ఎల్లలుదాటిన ఘనత!!

14 Nov, 2021 15:04 IST|Sakshi

Nation Wide Famous Child Prodigies: పసితనం వీడని చిన్నారులు వివిధ రంగాల్లో సాధిస్తున్న ఘనతకు ఎవరైనా నోరెళ్లబెట్టాల్సిందే! ఏళ్లతరబడి సాధన చేసిన పెద్దలు సైతం సాధించలేని ఘనకార్యాలను కొందరు చిచ్చరపిడుగులు అలవోకగా ఇట్టే సాధిస్తూ, ప్రపంచాన్ని అవాక్కయ్యేలా చేస్తున్నారు. వివిధ రంగాల్లో విశేషప్రతిభతో రాణిస్తున్న కొందరు చిచ్చరపిడుగుల గురించి బాలల దినోత్సవం సందర్భంగా...

మిలియన్‌ డాలర్ల ‘స్వర’ స్వరఘనత: లిడియన్‌ నాదస్వరం
అత్యంత పిన్నవయసులోనే సంగీతంలో అంతర్జాతీయ స్థాయి ఘనత సాధించాడు లిడియన్‌ నాదస్వరం. తమిళ సంగీత దర్శకుడు వర్షన్‌ సతీష్‌ రెండో కొడుకైన లిడియన్‌ నాదస్వరం మాటలు వచ్చీరాని వయసులోనే సరిగమలతో చెలిమి ప్రారంభించాడు. రెండేళ్ల వయసులో లయ తప్పకుండా డ్రమ్స్‌ మోగించడం మొదలుపెట్టాడు. ఎనిమిదో ఏట తనంతట తానే పియానో వాయించడం నేర్చుకున్నాడు. లిడియన్‌ ఆసక్తి గమనించిన తండ్రి, అతడిని శిక్షణ కోసం మద్రాస్‌ మ్యూజికల్‌ అసోసియేషన్‌ డైరెక్టర్‌ అగస్టీన్‌ పాల్‌ వద్ద చేర్చాడు.

అగస్టీన్‌ వద్ద శిక్షణ తర్వాత చెన్నైలో ఎ.ఆర్‌.రెహమాన్‌ నడుపుతున్న కె.ఎం.మ్యూజిక్‌ కన్జర్వేటరీలో చేరి, నాలుగేళ్లు సంగీత మర్మాలన్నింటినీ ఆపోశన పట్టాడు. మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌ 2019లో తాను తొలిసారి దర్శకత్వం వహించిన చిత్రంలో లిడియన్‌కు సంగీత దర్శకుడిగా అవకాశం ఇచ్చాడు. అప్పటికి లిడియన్‌ వయసు పద్నాలుగేళ్లే! అతి పిన్నవయస్కుడైన సినీ సంగీత దర్శకుడిగా రికార్డులకెక్కిన లిడియన్‌ ఘనతను అంతర్జాతీయ మీడియా కూడా గుర్తించింది. అమెరికాకు చెందిన సీబీఎస్‌ చానల్‌ నిర్వహించిన పోటీలో లిడియన్‌ ఉత్తమ సంగీతకారుడిగా మిలియన్‌ డాలర్ల (రూ.7.44 కోట్లు) బహుమతిని గెలుచుకున్నాడు. సంగీత ప్రధానంగా గత ఏడాది నిర్మించిన బాలీవుడ్‌ చిత్రం ‘అట్‌కన్‌–చట్‌కన్‌’లో లిడియన్‌ ఒక కీలకపాత్రలో నటించడం విశేషం.

చదవండి: గబగబా చదివి పారేస్తే ఘబుక్కుని పెద్దాళయిపోతాంగా!!


శాస్త్రీయ సంగీతంలో ప్రపంచస్థాయి ప్రదర్శనలు: రాహుల్‌ వెల్లాల్‌

నాలుగేళ్ల వయసులోనే సరిగమల సాధన మొదలుపెట్టిన రాహుల్‌ వెల్లాల్‌ ఘనత అంతర్జాతీయ వేదికల వరకు చేరుకుంది. ప్రధానంగా గాత్రకచేరీలే చేస్తున్నా, వాద్యసంగీత సాధన కూడా కొనసాగిస్తున్నాడు ఈ బెంగళూరు కుర్రాడు. తొలుత కళావతి అవధూత్‌ వద్ద కర్ణాటక సంగీతంలో స్వరాభ్యాసం చేసిన రాహుల్, తర్వాత కుల్లూర్‌ జయచంద్రరావు దగ్గర మృదంగం నేర్చుకున్నాడు. ప్రస్తుతం లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ మ్యూజిక్‌లో పాశ్చాత్య సంగీతంలో పియానో వాద్యం నేర్చుకుంటున్నాడు. రాహుల్‌ వెల్లాల్‌ తన పదకొండేళ్ల వయసులోనే, 2018లో అబుదాబిలో తొలి అంతర్జాతీయ కచేరీ చేశాడు.

అబుదాబితో పాటు ఇప్పటి వరకు సింగపూర్, నైజీరియా, మలేసియా, హాంకాంగ్, దక్షిణాఫ్రికా తదితర దేశాల్లో పదుల సంఖ్యలో కచేరీలు చేశాడు. సంప్రదాయ సంగీతంలో రాహుల్‌ వెల్లాల్‌ సాగిస్తున్న కృషికి గుర్తింపుగా ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులు దక్కాయి. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా 2018లో ఎం.ఎస్‌.సుబ్బులక్ష్మి ఫెలోషిప్‌ అందుకున్నాడు. ‘టాప్‌–100 గ్లోబల్‌ చైల్డ్‌ ప్రాడిజీస్‌’లో ఒకరిగా, గత ఏడాది ఢిల్లీలో జరిగిన వేడుకలో గ్లోబల్‌ చైల్డ్‌ ప్రాడిజీ అవార్డు అందుకున్నాడు.

బాల నలభీముడు: నిహాల్‌ రాజ్‌
సాధారణంగా పది పన్నెండేళ్ల వయసులో ఉన్న పిల్లలేం చేస్తారు? తల్లులు ఓపికగా వండిపెడితే, చక్కగా తినిపెడతారు. కేరళలోని కొచ్చికి చెందిన నిహాల్‌రాజ్‌కు తినడమే కాదు, రుచులొలికే వంటలు వండటమన్నా భలే ఇష్టం. నిహాల్‌ వయసు ఇప్పుడు పదకొండేళ్లు. ఐదేళ్ల వయసులోనే గరిటె తిప్పడం మొదలుపెట్టాడు. తన పాక ప్రావీణ్యాన్ని ప్రపంచానికి చాటేందుకు యూట్యూబ్‌ చానల్‌ పెట్టి, పెద్దసంఖ్యలో సబ్‌స్క్రైబర్ల ఆదరణను సంపాదించుకున్నాడు. ‘యూట్యూబ్‌’లో ‘లిటిల్‌ షెఫ్‌ కిచ్చా’గా గుర్తింపు పొందిన ఈ బాల నలభీముడు అనతికాలంలోనే ప్రముఖ జాతీయ టీవీచానళ్ల దృష్టినీ ఆకర్షించాడు.

పలు చానళ్లలో వంటల కార్యక్రమాల్లో తన నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. సంప్రదాయ వంటకాలను తయారు చేయడమే కాదు, ఈ చిచ్చరపిడుగు ఎప్పటికప్పుడు కొత్తకొత్త వంటకాలనూ తయారు చేస్తుంటాడు. ఇతడు సృష్టించిన ‘మ్యాంగో మౌస్‌ ఐస్‌క్రీమ్‌’ బాగా పాపులరైంది. తన పాకప్రావీణ్యానికి గుర్తింపుగా గత ఏడాది ఢిల్లీలో జరిగిన వేడుకలో గ్లోబల్‌ చైల్డ్‌ ప్రాడిజీ అవార్డు కూడా అందుకున్నాడు.
 

గూగుల్‌ బాయ్‌: కౌటిల్య పండిట్‌
సివిల్స్‌లాంటి పోటీ పరీక్షలను సాధించిన వారిని సైతం నివ్వెరపరచే పరిజ్ఞానం కౌటిల్య పండిట్‌ సొంతం. ఏ విషయానికి సంబంధించిన ప్రశ్నలు అడిగినా టకటకా సమాధానాలు చెప్పేస్తూ, ఐదేళ్ల వయసులోనే ‘గూగుల్‌ బాయ్‌’గా గుర్తింపు పొందాడు ఈ హర్యానా చిచ్చరపిడుగు. ‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’ కార్యక్రమంలో అమితాబ్‌బచ్చన్‌ను సైతం అబ్బురపరచాడు. కేవలం తన తెలివితేటల ప్రదర్శనతోనే అంతర్జాతీయ టీవీ చానెళ్లనూ ఆకట్టుకున్నాడు. హర్యానా, పంజాబ్, రాజస్థాన్‌ ప్రభుత్వాల నుంచి ప్రత్యేక సత్కారాలు, బహుమతులు అందుకున్నాడు.

హర్యానా అసెంబ్లీ ద్వారా ప్రత్యేక సత్కారం పొందిన ఏకైక బాలుడిగా రికార్డు సృష్టించాడు. కౌటిల్య పండిట్‌ పాండిత్యానికి గుర్తింపుగా ప్రతిష్ఠాత్మకమైన కాశీ విద్వత్‌ పరిషద్‌ ‘బాల మనీషి’ బిరుదుతో సత్కరించింది. అబ్దుల్‌ కలాం రాష్ట్రపతిగా ఉండగా, ఈ చిచ్చరపిడుగును ప్రత్యేకంగా రాష్ట్రపతి భవన్‌కు పిలిపించుకుని, దాదాపు గంటసేపు రకరకాల శాస్త్ర అంశాలపై ఇతడితో మచ్చటించారు. ‘ఫోకస్‌ టీవీ’ ఎంపిక చేసిన ‘ఎలెవెన్‌ ఫోకస్‌ స్టార్స్‌’లో ఒకరిగా కౌటిల్య పండిట్‌ను ఎంపిక చేసింది. ఎందరో మంత్రులు, రాజకీయ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, ఆధ్యాత్మికవేత్తల చేతుల మీదుగా లెక్కలేనన్ని అవార్డులు పొందిన ఈ పద్నాలుగేళ్ల బాలమేధావి గత ఏడాది ఢిల్లీలో  గ్లోబల్‌‘చైల్డ్‌ ప్రాడిజీ అవార్డును కూడా అందుకున్నాడు.

రంగుల కళతో అంతర్జాతీయ గుర్తింపు: అద్వైత్‌ కోలార్కర్‌
ఏడాది నిండక ముందే కుంచెపట్టుకున్నాడు. ఊహ తెలిసీ తెలియని వయసుతో రంగులతోను, కుంచెతోను మొదలుపెట్టిన చెలిమి అద్వైత్‌ కోలార్కర్‌ను కళారంగంలో అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లింది. రంగులపై అద్వైత్‌ మమకారాన్ని గమనించిన తల్లిదండ్రులు అతడికి ఆటబొమ్మల బదులు రంగులు, కుంచెలు, కాన్వాస్‌లు కొనిచ్చారు. అప్పటి నుంచి రంగుల ప్రపంచమే అతడి లోకమైంది. ఆడుతూ పాడుతూ అలవోకగా కాన్వాస్‌లపై నైరూప్యచిత్రాలను చిత్రించేస్తాడు ఈ బాలకళాకారుడు. మిత్రుల సలహాతో అద్వైత్‌ తండ్రి అతడి కోసం ప్రత్యేకంగా ఒక వెబ్‌సైట్‌ను ప్రారంభించి, ఆన్‌లైన్‌లో అతడి చిత్రాలను అమ్మడం ప్రారంభించాడు.

ఆన్‌లైన్‌లో అతడి చిత్రాలు అనతి కాలంలోనే దేశదేశాలకు చేరడంతో, వివిధ దేశాల్లో జరిగే చిత్రకళా ప్రదర్శనలకు ఆహ్వానాలు రావడం మొదలైంది. అలా చిన్న వయసులోనే దేశదేశాలు తిరిగి చిత్రకళా ప్రదర్శనల్లో పాల్గొన్న అద్వైత్, అంతర్జాతీయ మీడియాకెక్కాడు. రెండేళ్ల వయసులోనే కెనడాలోని సెయింట్‌ జాన్‌ ఆర్ట్స్‌ సెంటర్‌లో సోలో ప్రదర్శన చేసిన అతి పిన్నవయస్కునిగా రికార్డు సృష్టించాడు. ఎనిమిదేళ్ల అద్వైత్‌ గత ఏడాది ఢిల్లీలో గ్లోబల్‌ చైల్డ్‌ ప్రాడిజీ అవార్డును అందుకున్నాడు. బీబీసీ ఇతడిపై ప్రత్యేకంగా ‘ఆర్ట్‌ ప్రాడిజీ’ కార్యక్రమాన్ని రూపొందించి, ప్రసారం చేయడం విశేషం.

చదరంగంలో చిచ్చరపిడుగు: పరీ సిన్హా
చదరంగంలో చిచ్చరపిడుగు ఈ చిన్నారి. బుడిబుడి నడకల వయసులోనే చదరంగంలో నిష్ణాతుల ఆట కట్టించి వార్తలకెక్కింది. బిహార్‌ చెస్‌ అసోసియేషన్‌ 2013లో నిర్వహించిన అండర్‌–7 పోటీల్లో పాల్గొని, విజేతగా నిలిచింది పరీ సిన్హా. పోటీలో పాల్గొనే నాటికి ఆమె ఇంకా బడిలో కూడా చేరలేదు. అప్పటికి ఆమె వయసు మూడేళ్లు మాత్రమే! ఆ తర్వాత బిహార్‌ రాష్ట్ర చెస్‌ ఓపెన్‌ చాంపియన్‌షిప్‌ పోటీల్లోనూ విజేతగా నిలిచి, అతి పిన్నవయస్కురాలైన చదరంగ క్రీడాకారిణిగా రికార్డులకెక్కింది. పరీ సిన్హా బాబాయి వీల్‌ప్రకాశ్‌ సిన్హా జాతీయస్థాయి చదరంగం ఆటగాడు. ఆయనే చిన్నారి పరీకి చదరంగాన్ని పరిచయం చేశాడు. అప్పటి నుంచి ఆమె చదరంగంలో మెలకువలను చకచకా నేర్చుకుంది. జాతీయ, అంతర్జాతీయ చెస్‌ టోర్నమెంట్లలో ఇప్పటికే తన సత్తా చాటుకుంది. చదరంగంలో ఆమె శుభేందు చక్రవర్తి వద్ద కోచింగ్‌ తీసుకుంటోంది.

చదవండి: చిలుకలు ఎగరాలి.. నెమళ్లు పురివిప్పాలి! హాయిగా ఆడుకోనిద్దాం!

బాల వ్యాపారవేత్త: 
తిలక్‌ మెహతా
దేశంలోనే అతి పిన్నవయస్కుడైన బాల వ్యాపారవేత్తగా గుర్తింపు పొందాడు తిలక్‌ మెహతా. నాలుగేళ్ల కిందట– అంటే, తన పదేళ్ల వయసులో తిలక్‌ మెహతా సెలవుల్లో తన మేనమామ ఇంటికి వెళ్లాడు. సెలవుల్లో చదువుకోవడానికి పుస్తకాలు తీసుకురావడం మరచిపోయాడు. ‘మామా! స్కూలు పుస్తకాలు తెచ్చుకోవడం మరచిపోయాను. రేపటికల్లా ఇక్కడకు ఇంటి నుంచి కొరియర్‌లో తెప్పించుకోవడానికి వీలవుతుందా?’ అని అడిగాడు. ‘ఇవాళ్టికివాళే కొరియర్‌లో చేరుకోవడం సాధ్యం కాదు. రేపటికైతే చేరుతాయి గాని, కొరియర్‌ చార్జీ నీ పుస్తకాల ఖరీదు కంటే ఎక్కువే అవుతుంది’ అని బదులిచ్చాడు.

మేనమామ సమాధానంతో తిలక్‌ ఆలోచనలో పడ్డాడు. ముంబై వాసులకు తక్కువ ఖర్చుతో కొరియర్‌ సేవలు ప్రారంభించగల అవకాశాలపై క్షుణ్ణంగా సమాచారాన్ని సేకరించాడు. చాలా లెక్కలు వేసుకున్నాడు. చివరకు ‘పేపర్‌ ఎన్‌ పార్సెల్‌’ యాప్‌ ప్రారంభించి, ముంబై డబ్బావాలాలతో కలసి కొరియర్‌ సర్వీస్‌ వ్యాపారం ప్రారంభించాడు. ఈ వ్యాపారానికి ముంబైవాసుల నుంచి అనూహ్యమైన స్పందన వచ్చింది. దీనివల్ల డబ్బావాలాల ఆదాయం కూడా కొంత పెరిగింది. వ్యాపారరంగంలో రాణిస్తున్న తిలక్‌ మెహతా గత ఏడాది ఢిల్లీలో గ్లోబల్‌ చైల్డ్‌ ప్రాడిజీ అవార్డు అందుకున్నాడు.

తబలా వాద్యంతో గిన్నిస్‌ రికార్డు: 
తృప్త్‌రాజ్‌ పాండ్యా
బొమ్మలతో ఆటలాడుకునే వయసులో తబలాతో సావాసం మొదలుపెట్టాడు తృప్త్‌రాజ్‌ పాండ్యా. చిన్నప్పుడు అతడి తల్లి ఆటబొమ్మలతో పాటు ఒక చిన్న ఢోలక్‌ను కూడా తెచ్చిచ్చింది. చిన్నారి తృప్త్‌రాజ్‌ మిగిలిన బొమ్మలను వదిలేసి, ఢోలక్‌ను వాయించడం మొదలుపెట్టాడు. అతడి వాద్యంలోని లయను గమనించి, ఈసారి తబలానే కొనిచ్చారు తల్లిదండ్రులు. రెండేళ్ల వయసులోనే ముంబైలోని సోమయ్య కాలేజీలో తొలి తబలా కచేరీ చేశాడు.

మూడేళ్ల వయసులో ముంబై ఆకాశవాణి కేంద్రం నుంచి లైవ్‌ ప్రోగ్రామ్‌ ఇచ్చాడు. తర్వాత ముంబై దూరదర్శన్‌ కేంద్రంలోనూ తన తబలా వాద్య విన్యాసాన్ని ప్రదర్శించాడు. దీంతో అతి పిన్న వయస్కుడైన తబలా వాద్య కారుడిగా గిన్నిస్‌ రికార్డు సాధించాడు. తృప్త్‌రాజ్‌ వాద్యాన్ని ఆలకించిన తబలా దిగ్గజం జాకిర్‌ హుస్సేన్‌ సహా హరిప్రసాద్‌ చౌరాసియా, ఉస్తాద్‌ ఇక్బాల్‌ అహ్మద్‌ఖాన్‌ వంటి విద్వాంసులు అతడిపై ప్రశంసల వర్షం కురిపించారు. పదిహేనేళ్ల తృప్త్‌రాజ్, దేశ విదేశాల్లో ఇప్పటికే వందలాది కచేరీలు చేశాడు.

చదవండి: వింత ఆచారం! అల్లుడికి కట్నంగా 21 విషపూరితమైన పాములు..

మరిన్ని వార్తలు