శిరీష భవిష్యత్తు గానమయంగా సాగిపోవాలి..

16 Mar, 2021 08:34 IST|Sakshi

ఇండియన్‌ ఐడెల్‌లో తెలుగువారి ప్రతిభ కొత్తది కాదు. ఇండియన్‌ ఐడెల్‌ 5ను తెలుగు గాయకుడు శ్రీరామచంద్ర గెలుచుకున్నాడు. కారుణ్య ఇండియన్‌ ఐడెల్‌ 2లో రన్నర్‌ అప్‌గా నిలిచాడు. తెలుగువారు జాతీయ స్థాయిలో సింగింగ్‌ టాలెంట్‌ చూపగలరని ఎప్పుడో నిరూపితం అయ్యింది. అయితే ఇప్పుడు జరుగుతున్న ఇండియన్‌ ఐడెల్‌ 12 లో ఇద్దరు విశాఖ అమ్మాయిలు ప్రతిభ చూపుతూ ఉండటం విశేషం. వారు షణ్ముఖ ప్రియ, శిరీష భాగవతుల. వీరిలో శిరీష భాగవతుల టాప్‌ 11 వరకూ వచ్చి రెండు రోజుల క్రితం ఎలిమినేట్‌ అయ్యింది. షణ్ముఖ ప్రియ టాప్‌ టెన్‌లోకి వెళ్లింది. ఇద్దరిదీ ఘనతే అనుకోవాలి.

విశాఖకు చెందిన శిరీష చిన్నప్పటి నుంచి తాతగారి దగ్గర సంగీతం నేర్చుకుంది. పాడాలని ఉంది విజేతగా నిలిచింది. ఇంజినీరింగ్‌ చేసి చెన్నైలో సంగీతం నేర్చుకుంటూ అక్కడ తమిళంలో పాటలు పాడుతోంది. శిరీష గాయని చిత్రకు వీరాభిమాని. ఆమె పాటలు ఎక్కువగా పాడుతుంది. ఇండియన్‌ ఐడెల్‌ ఆడిషన్స్‌లో కూడా శిరీష ‘సాథియా తూనే క్యా కియా’ (ఈనాడే ఏదో అయ్యింది), కెహెనా హై క్యా (కన్నానులే) పాడి చిత్రలాంటి గాయనిగా జడ్జ్‌ల నుంచి ప్రశంసలు అందుకుంది. ఒక ఎపిసోడ్‌ ‘జియ జలే జాన్‌ జలే’ పాటతో స్టాండింగ్‌ ఒవేషన్‌ అందుకుంది.

దాదాపు హేమాహేమీలుగా ఉన్న 16 మంది సింగర్స్‌తో మొదలైన ఈ షో టాప్‌ 11 వరకూ నిలవడం కూడా సామాన్యం కాదు. సెలబ్రిటీలు హాజరైన ఎపిసోడ్స్‌లో ముఖ్యంగా బప్పీలహరి, ప్యారేలాల్, ఉదిత్‌ నారాయణ్‌ వీరందరి సమక్షంలో పాడి శిరీష ప్రతిభ చాటుకుంది. షణ్ముఖ ప్రియతో కలిసి హీరో గోవిందా ఎపిసోడ్‌లో ‘చికుబుకు చికుబుకు రైలే’ హిందీ వెర్షన్‌ను పాడి క్లాప్స్‌ అందుకుంది. మెలొడీలే కాకుండా కామెడీ, డిస్కో అన్నీ పాడగలనని శిరీష ఈ డయాస్‌ నుంచి చాటి చెప్పింది. ఇప్పటికే రహమాన్‌ దృష్టిలో పడి ఆయన సంగీతం లో ‘విజిల్‌’లో పాడిన శిరీష ఇప్పుడు ఇండియన్‌ ఐడల్‌ తో వచ్చిన గుర్తింపుతో మరిన్ని మంచిపాటలు పాడే అవకాశం ఉంది. ఇండియన్‌ ఐడెల్‌కు సంగీత దర్శకులు విశాల్, హిమేష్‌ రేష్‌మియా, గాయని నేహా కక్కర్‌ జడ్జ్‌లుగా వ్యవహరిస్తున్నారు. శిరీష భవిష్యత్తు గానమయంగా సాగాలని కోరుకుందాం.

మరిన్ని వార్తలు