Diipa Khosla: రెడ్‌కార్పెట్‌పై బ్రెస్ట్‌ పంప్స్‌తో...

14 Jul, 2021 11:01 IST|Sakshi

ఇండియన్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌.. దీపా ఖోస్లా!

ముఖం అంతా మొటిమలు, నలుగురిలోకి వెళ్లి మాట్లాడాలంటే సిగ్గు, బిడియంగా ఫీల్‌ అయ్యే ఆ అమ్మాయే తొలి ఇండియన్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ఎదిగి కేన్స్‌ ఫిల్మ్‌ఫెస్టివల్‌ల్లో రెడ్‌కార్పెట్‌పై నడిచింది. తన ఫ్యాషన్‌తో మెబిలిన్‌ వంటి ప్రముఖ బ్రాండ్లకు అంబాసిడర్‌గా పనిచేయడమే గాక అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని బ్రిటీష్‌ హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌లో అనర్గళంగా మాట్లాడింది. ఇప్పుడు చెప్పుకున్నదంతా ఏదో సినిమా కథ కాదు.

Indian Influencer Diipa Khosla: భారతీయ కట్టుబొట్టుకు సరికొత్త  ఫ్యాషన్‌ను జోడించి అంతర్జాతీయ స్థాయిలో ఇండియన్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ఎదిగిన దీపా ఖోస్లా ప్రేరణాత్మక స్టోరీ. పదిలక్షలకు పైగా ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవర్స్‌తో దూసుకుపోతూ ఏడు అంతర్జాతీయ మ్యాగజీన్‌ కవర్లపై ఫోటోకు పోజు ఇవ్వడమేగాక, వోగ్, ఎల్లే, గ్రాజియా వంటి ప్రముఖ సంస్థల నుంచి వరుసగా మూడేళ్లు ‘ఇన్‌ఫ్లుయెన్సర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ టైటిల్‌ను గెలుచుకోవడం, బిల్‌బోర్డుపై తన ఫోటో రావడం విశేషం. 

ఢిల్లీలో నివసిస్తోన్న సంప్రదాయ పంజాబీ కుటుంబంలో పుట్టిన దీపా ఆరేళ్లపాటు ఢిల్లీలోనే ఉంది. తరువాత దీపా తల్లిదండ్రులు తమ మకాంను ముందు చెన్నైకి, తరువాత ఊటీకి మార్చడంతో తన బాల్యం అంతా అక్కడే గడిచింది. ఊటీలోని బ్రిటిష్‌ బోర్డింగ్‌ స్కూల్లో చదివిన దీపా తరువాత న్యాయ విద్యను అభ్యసించేందుకు స్కాలర్‌షిప్‌ రావడంతో.. నెదర్లాండ్స్‌ రాజధాని ఆమ్‌స్టర్‌ డామ్‌లో అంతర్జాతీయ మానవ హక్కుల చట్టం ప్రధాన సబ్జెక్టుగా లా డిగ్రీని పూర్తిచేసింది. ఆ తరువాత మాస్టర్స్‌ డిగ్రీ చేసేందుకు లండన్‌కు వెళ్లింది. పీజీ అయ్యాక లాయర్‌గా ప్రాక్టీస్‌ చేయడానికి మధ్యలో నాలుగు నెలల ఖాళీ  దొరికింది.

ఈ సమయంలో లండన్‌ ఫ్యాషన్‌ ఏజెన్సీలో చేరి ఇంటర్న్‌షిప్‌ చేసింది. ఫ్యాషన్‌పై ఆసక్తి పెరగడంతో.. యూరప్‌ ఫస్ట్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌ ఏజెన్సీ లో చేరింది. ఒక్కోటీ నేర్చుకుంటున్న క్రమంలో... అమెరికా, యూరప్‌ దేశాల నుంచి నుంచి వచ్చే ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ను దగ్గర నుంచి గమనించేది. ‘ఇన్నిదేశాల నుంచి ఇన్‌ఫ్లుయెన్సర్‌లు ఉన్నారు కానీ ఇండియా తరపున ఎవరూ లేరు. నేను ఆ లోటు భర్తీ చేయాలి’ అనుకుంది. లైంగిక వేధింపులు, వర్ణ వివక్షత వంటి సమస్యలు ఎదురైనప్పటికీ తనలోని నైపుణ్యాలతో కష్టపడి సత్తా చాటì , ఇండియన్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ఎదిగింది.  

రెడ్‌కార్పెట్‌పై బ్రెస్ట్‌ పంప్స్‌తో..
ఇండియన్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా రాణిస్తూ ఎస్టీ లాడర్, కెరాస్టేస్‌ బ్రాండ్లకేగాక మరెన్నో ప్రముఖ బ్రాండ్లకు అంబాసిడర్‌గా పనిచేసింది. కేన్స్, వెనిస్‌ చిత్రోత్సవాల్లో సెలబ్రెటీ హోదాల్లో పాల్గొంది. 2019లో పోస్ట్‌ ఫర్‌ చేంజ్‌ ఫౌండేషన్‌ను ప్రారంభించి...సోషల్‌ మీడియా ద్వారా సామాజిక మార్పుకోసం, మహిళా అభ్యున్నతి కోసం కృషిచేస్తోంది. స్త్రీ సాధికారత, జాత్యహంకార ధోరణికి వ్యతిరేకంగా యూఎన్, ఇతర ఎన్జీవోలతో కలసి పనిచేస్తోంది. ప్రస్తుతం జరుగుతోన్న కేన్స్‌ ఫెస్టివల్లో పాల్గొని సెన్సేషనల్‌గా నిలిచింది.

నలుపు, పసుపు రంగు గౌనులో మెరిసిన దీపా తన గౌనుకు బ్రెస్ట్‌ పంప్స్‌ను అమర్చుకుని రెడ్‌ కార్పెట్‌పై ఫోటోలకు పోజులిచ్చి తల్లిపాల ప్రాముఖ్యతను చెప్పకనే చెప్పింది. నెదర్లాండ్స్‌లో చదివే రోజుల్లో ఒలేగ్‌ బుల్లర్‌ను ప్రేమించిన దీపా తరువాత అతడినే పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఈ జంటకు ఒక పాప. 2015 నుంచి ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉంటూ..ఫ్యాషన్‌ ఇన్‌ఫ్లుయెన్సర్, బ్యూటీహ్యాకర్‌గా ఆకట్టుకుంటున్నారు. తన పేరుతో బ్లాగ్‌ నడుపుతూ ట్రావెల్‌ స్టోరీలు, ఫ్యాషన్,  లైఫ్‌స్టైల్‌ టిప్స్, సలహాలు అందిస్తున్నారు. 
 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు