Indian Navy: ఉమెన్‌–ఫ్రెండ్లీ ధీర... : అగ్నివీర

25 Aug, 2022 04:08 IST|Sakshi
భువనేశ్వర్‌ సమీపంలోని ‘ఐఎన్‌ఎస్‌ చిలికా’ శిక్షణా కేంద్రం

శిక్షణ కఠినంగా ఉండాలి. అదే సమయంలో అవసరాలు, సౌకర్యాల విషయంలో కరుణతో వ్యవహరించాలి. కళింగ గడ్డ మీద ఉన్న సువిశాల ‘ఐఎన్‌ఎస్‌ చిలికా’ శిక్షణా కేంద్రం ఫస్ట్‌ బ్యాచ్‌ అగ్నివీర్‌ ఉమెన్‌ ట్రైనీలను దృష్టిలో పెట్టుకొని ‘ఉమెన్‌–ఫ్రెండ్లీ’ విధానానికి  శ్రీకారం చుట్టింది...

అగ్నివీర్‌ చుట్టూ రగిలిన వివాదాల మాట ఎలా ఉన్నా సైన్యంలోని వివిధ విభాగాల్లో పని చేయాలనే ఆసక్తి, ఉత్సాహాన్ని ఆ వివాదాలు అంతగా ప్రభావితం చేయలేకపోయాయి. నేవీలో 3,000 ఉద్యోగాల కోసం లక్షలాది మంది పోటీలోకి దిగారు. వీరిలో 82,000 మంది మహిళలు ఉన్నారు.
భువనేశ్వర్‌కు సమీపంలోని ప్రసిద్ధ ‘ఐఎన్‌ఎస్‌ చిలికా’ శిక్షణా కేంద్రంలోకి నేవి అగ్నివీర్‌ ఫస్ట్‌ ఉమెన్‌ బ్యాచ్‌కు చెందిన 600 మంది మహిళలు అడుగుపెట్టబోతున్నారు.
దాంతో మహిళా శిక్షణార్థుల అవసరాలు, సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది ఐఎన్‌ఎస్‌.

సువిశాలమైన ఐఎన్‌ఎస్‌ శిక్షణాకేంద్రంలో మహిళల కోసం ప్రత్యేకమైన గదులు, డైనింగ్‌ ఏరియాను ఏర్పాటు చేస్తారు. అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని మరిన్ని టాయిలెట్‌లను నిర్మిస్తున్నారు. శానిటరీ పాడ్‌ వెండింగ్, డిస్పోజల్‌ యంత్రాలను, సెక్యూరిటీ కెమెరాలను ఏర్పాటు చేయబోతున్నారు. వర్కర్స్, స్విమ్మింగ్‌ ఇన్‌స్ట్రక్టర్స్‌గా మహిళలనే నియమిస్తారు.
ఉమెన్‌ ఆఫీసర్స్‌ ట్రైనీలకు సంబంధించి శిక్షణపరమైన పర్యవేక్షణ బాధ్యతలతో పాటు వారి వ్యక్తిగత ఇబ్బందులు, అసౌకర్యాలను ఎప్పటికప్పుడు తెలుసుకొని పరిష్కరిస్తారు.

‘ప్రైవసీతో సహా మహిళా శిక్షణార్థులకు సంబంధించి రకరకాల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వారికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నాం. సమస్యలు, సౌకర్యాలపై వారి అభిప్రాయాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ తగిన మార్పులు చేయనున్నాం’ అంటున్నారు నేవీ ఉన్నతాధికారి ఎం.ఏ.హంపిహోలి.
స్త్రీ, పురుషులకు సంబంధించి ట్రైనింగ్‌ కరికులమ్‌లో తేడా అనేది లేకపోయినా తప్పనిసరి అనిపించే ఫిజికల్‌ స్టాండర్డ్స్‌లో తేడాలు ఉంటాయి.
అగ్నిపథ్‌ తొలిదశలో పర్సనల్‌ బిలో ఆఫీసర్‌ ర్యాంక్‌(పిబివోఆర్‌) క్యాడర్‌లో మహిళలను రిక్రూట్‌ చేస్తున్న తొలి విభాగం నేవి.

‘సెయిలర్స్‌’గా మహిళలకు తొలిసారిగా అవకాశం కల్పించడం ఒక చారిత్రక అడుగు.
‘భవిష్యత్‌ అవసరాలు, స్త్రీ సాధికారతను దృష్టిలో పెట్టుకొని నావికాదళం ప్రగతిశీలమైన అడుగులు వేస్తుంది’ అంటుంది కమాండర్‌ గౌరీ మిశ్రా.
కొన్ని నెలలు వెనక్కి వెళితే...

నేవీకి చెందిన ఆల్‌–ఉమెన్‌ టీమ్‌ ‘నావిక సాగర్‌ పరిక్రమ’ పేరుతో ప్రపంచ నౌకాయాత్ర చేసి చరిత్ర సృష్టించింది.
‘ఇది మా వ్యక్తిగత సంతోషానికి, సాహసానికి సంబంధించిన విషయం మాత్రమే కాదు... ఎంతో మంది మహిళలకు స్ఫూర్తిని ఇచ్చి సాహసంతో ముందుకు నడిపే చారిత్రక విజయం’ అన్నారు ‘నావిక సాగర్‌ పరిక్రమ’లో భాగం అయిన అయిదు మంది మహిళా అధికారులు.
కొన్ని రోజులు వెనక్కి వెళితే...

ఉత్తర అరేబియా సముద్రంలో సర్వైవలెన్స్‌ మిషన్‌లో భాగం అయిన ‘ఆల్‌–ఉమెన్‌ క్రూ’ మరో సంచలనం.
తాజా విషయానికి వస్తే...
భవిష్యత్‌ పనితీరుకు శిక్షణ సమయం పునాదిలాంటిది. అది గట్టిగా ఉండాలంటే సౌకర్యాలు, అవసరాల విషయంలో తగిన శ్రద్ధ చూపాలి. ఇప్పుడు మహిళా ట్రైనీల విషయంలో ‘ఐన్‌ఎన్‌ఎస్‌ చిలికా’ చేస్తున్నది అదే.

మరిన్ని వార్తలు