కల్లోల ఇజ్రాయెల్‌లో ఇండియన్‌ సూపర్‌ ఉమెన్‌

19 Oct, 2023 00:43 IST|Sakshi
మీరా మోహన్, సబిత

న్యూస్‌ మేకర్‌

బతికి ఉంటే బలుసాకు తిని బతకవచ్చు... అనుకునే భయానక పరిస్థితుల్లో ఉండి కూడా, తమకు ఏమైనా ఫరవాలేదు, నిస్సహాయులైన వృద్ధదంపతులకు ఏమీ కాకూడదని వారిని కంటికి రెప్పలా కాపాడారు ఇజ్రాయెల్‌లో హోమ్‌ నర్స్‌లుగా పనిచేస్తున్న కేరళకు చెందిన సబిత, మీరా మోహన్‌లు...

దక్షిణ ఇజ్రాయెల్‌... గాజా సరిహద్దుకు రెండో కిలోమీటర్‌ల దూరంలో ఉన్న నిర్‌ ఓజ్‌ కిల్బట్జ్‌ పట్టణంలో ఒక ఇంట్లో... 85 సంవత్సరాల షౌలిక్, 76 సంవత్సరాల రహెల్‌ దంపతులకు నలుగురు పిల్లలు. పిల్లలు వేరు వేరు ప్రాంతాలలో ఉంటున్నారు. రహెల్‌ అనారోగ్యంతో బాధ పడుతోంది. ఆమెను చూసుకోవడానికి ఆరోజు ఆ ఇంట్లో సబిత, మీరా మోహన్‌ అనే ఇద్దరు హోమ్‌నర్స్‌లు ఉన్నారు.

ఉదయం ఆరున్నర ప్రాంతంలో సైరన్‌ మోత వినిపించింది. ప్రజలు బాంబ్‌ షెల్టర్‌లలో తల దాచుకోవాలని చెప్పే సైరన్‌ అది. ‘ఆ ఉదయం సైరన్‌ మోగేసరికి గుండెల్లో రైళ్లు పరుగెత్తాయి. సెకండ్ల వ్యవధిలో సేఫ్టీరూమ్‌లోకి వెళ్లాలి. ఇంతలో రహెల్‌ కుమార్తె నుంచి ఫోన్‌ వచ్చింది. బయట పరిస్థితి భయానకంగా ఉంది అని ఆమె చెప్పింది. మాకు ఏం చేయాలో తోచలేదు. ఇంటిముందు, వెనుక తలుపులకు తాళాలు వేసి అమ్మానాన్నలను తీసుకొని, పాస్‌పోర్ట్, డైపర్‌లు, యూరిన్‌ పాట్, మందులతో సెక్యూర్‌ రూమ్‌లోకి వెళ్లాలని ఆమె చెప్పింది.

షౌలిక్, అనారోగ్యంతో ఉన్న రహేల్‌ను నడిపించుకుంటూ షెల్టర్‌ రూమ్‌లోకి వెళ్లాం. ఈలోపే మిలిటెంట్‌లు ఇంట్లోకి ప్రవేశించారు. అద్దాలు బద్దలు కొట్టారు. వస్తువులు ధ్వంసం చేశారు. షెల్టర్‌రూమ్‌పై కాల్పులు జరుపుతున్నారు. ఐరన్‌ డోర్‌ వెనకే మా శరీరాలను గట్టిగా ఆనించి ఎన్నో గంటలపాటు నిల్చున్నాం. అదృష్టవశాత్తు ఐరన్‌ డోర్‌ ధ్వంసం కాలేదు. ధ్వంసం అయి ఉంటే ఎవరి ప్రాణాలు మిగిలేవి కావు’ అంటూ  ఆ భయానక ఘటనను గుర్తు తెచ్చుకుంది 39 సంవత్సరాల సబిత.

కేరళకు చెందిన సబిత, మీరా మోహన్‌ల సాహసం, మానవత్వం గురించి దిల్లీలోని ఇజ్రాయెల్‌ రాయబార కార్యాలయం ‘ఇండియన్‌ సూపర్‌ ఉమెన్‌’ అంటూ ప్రశంసించింది.

మరిన్ని వార్తలు