Harnaaz Sandhu: మిస్‌ యూనివర్స్‌ హర్నాజ్‌ గురించి ఈ విషయాలు తెలుసా?

14 Dec, 2021 00:59 IST|Sakshi
‘విశ్వ సుందరి’ హర్నాజ్‌ సంధు

Interesting Facts About Harnaaz Sandhu: ప్రపంచం ఎదుట భారతీయ సౌందర్యం మరోసారి మెరుపు నవ్వు నవ్వింది. ప్రపంచం ఎదుట భారతీయ సంస్కారం మరోసారి తన ఎరుకను ప్రదర్శించింది. ప్రపంచం ఎదుట భారతీయ స్త్రీ సౌందర్యకాంక్ష తన శిరస్సు మీదకు జయ కిరీటాన్ని ఆహ్వానించింది. చండీగఢ్‌కు చెందిన హర్నాజ్‌ సంధు ‘విశ్వ సుందరి’ కిరీటాన్ని గెలుచుకుంది.

21 ఏళ్ల హర్నాజ్‌ 2021లో 21 ఏళ్ల సుదీర్ఘ ఎదురు చూపుల తర్వాత మరోసారి ఈ కిరీటాన్ని దేశానికి తెచ్చింది. ‘చక్‌ దే ఫట్టే ఇండియా’ అని కేరింతలు కొట్టింది హర్నాజ్‌ కిరీటం గెలిచాక. అంటే ‘సాధించు. గెలుపు సాధించు ఇండియా’ అని అర్థం. నేడు ఇండియా గెలిచింది.

‘విశ్వసుందరి’  మిస్‌ ఇండియా హర్నాజ్‌ సంధు (మధ్యలో) ఇరువైపులా రన్నరప్స్‌ పరాగ్వేకు చెందిన మిస్‌ నాడియా, సౌతాఫ్రికాకు చెందిన మిస్‌ లలేలా

డిసెంబర్‌ 12న (మన తేదీ ప్రకారం 13 తెల్లవారుజామున) భారతీయురాలైన హర్నాజ్‌ సంధు తల మీద విశ్వసుందరి కిరీటం తళుక్కున మెరిసింది. ప్రపంచమంతా కరతాళధ్వనులు మోగిస్తుండగా దేశం అందమైన ఈ విజయంతో ఉత్సాహంగా నిద్ర లేచింది.1994లో సుస్మితా సేన్‌ మొదటిసారి ఈ టైటిల్‌ గెలిచి స్ఫూర్తి ఇచ్చాక 2000లో లారా దత్తా రెండోసారి గెలిచాక  మూడోసారి టైటిల్‌కై సాగుతున్న ఎదురుచూపులకు అడ్డుకట్ట వేస్తూ హర్నాజ్‌ ఈ సౌందర్యాత్మక విజయాన్ని నమోదు చేసింది. ఇజ్రాయిల్‌ రేవు పట్టణం ఐలత్‌లో తాత్కాలికంగా నిర్మించిన భారీ ప్రాంగణంలో సుప్రసిద్ధ వ్యాఖ్యాత స్టీవ్‌ హార్వే హోస్ట్‌గా జరిగిన ఈ విశ్వ పోటీలో 80 దేశాల పోటీదారులను దాటి హర్నాజ్‌ ఈ కిరీటాన్ని గెలుచుకుంది.

ఎర్రసముద్రం మురిసిపోయింది
ఎర్రసముద్రం ఒడ్డు మీద ఉన్న 50 వేల జనాభా కలిగిన ఐలత్‌ పట్టణంలో హర్నాజ్‌ విజయంతో భారత్‌ పేరు మార్మోగింది. ఎవరీ అందగత్తె అని ఎర్రసముద్రం తొంగి చూసి మురిసిపోయింది. ‘భారతీయ సౌందర్యానికి నేను బెస్ట్‌ వెర్షన్‌ని’ అని పోటీలకు వెళ్లబోతూ వ్యాఖ్యానించిన హెర్నాజ్‌ 80 దేశాల అందగత్తెలతో తలపడి ముందు టాప్‌ 16లో ఆ తర్వాత టాప్‌ 10లో ఆపైన టాప్‌ 5లో వెళ్లి టైటిల్‌ మీద ఆశలు రేపింది.

టాప్‌-3లోకి రాగానే ఉత్కంఠ నెలకొంది. చివరి ఇద్దరిలో పరాగ్వే దేశ పోటీదారైన నాడియా చేతులు పట్టుకుని అంతిమ ఫలితం కోసం నిలుచున్న హెర్నాజ్‌ ‘ఇండియా’ అన్న ప్రకటన వెలువడిన వెంటనే ఆనందబాష్పాలు రాల్చింది. సెకండ్‌ రన్నర్‌ అప్‌గా సౌత్‌ ఆఫ్రికాకు చెందిన లలేలా నిలిచింది.

సౌందర్యంతో పాటు చైతన్యం కూడా
అందాల పోటీలో భాగంగా ప్రశ్న–జవాబు ఘట్టంలో లాటరీ ద్వారా ‘గ్లోబల్‌ వార్మింగ్‌’ అంశం తన వంతుకు రాగా హర్నాజ్‌ చైతన్యవంతమైన జవాబు చెప్పింది. ‘ఒకనాడు మనకు మన జీవితం సాక్షాత్కరిస్తుంది. అది వీక్షించదగ్గదిగా ఉండాలని మనం అనుకుంటాం. కాని పర్యావరణానికి మనం చేస్తున్న అవమానకరమైన కీడు వల్ల ఆ జీవితం మనం ఆశించినట్టుగా ఉండదు. ప్రకృతి మరణిస్తుంది. ఇప్పటికైనా ఈ చేటును మనం నివారించగలం.

కనీసం అక్కర్లేని లైట్లను ఈ రాత్రి నుంచే ఆఫ్‌ చేయడం మొదలెడదాం’ అంది. అలాగే ‘నేటి యువతులు ఎదుర్కొంటున్న వొత్తిడిని మీరెలా చూస్తారు’ అనే ప్రశ్నకు ‘నేటి యువతులకు అన్ని శక్తులూ ఉన్నాయి. కాని వారికి వారి పైన నమ్మకం లేదు. ఇతరులతో పోల్చుకుని న్యూనత చెందుతున్నారు. మీరు మీలాగే ఉండటం మీ ప్రత్యేకత అని తెలుసుకోవాలి’ అంటూ సమాధానం చెప్పింది.

ప్రతి భారతీయుని గర్వం
హర్నాజ్‌కు విశ్వకిరీటం దక్కగానే తొలి భారతీయ విశ్వసుందరి సుస్మితాసేన్‌ తన సంతోషాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. ‘ప్రతి భారతీయుని గర్వం హర్నాజ్‌. సో ప్రౌడ్‌ ఆఫ్‌ యూ’ అని వ్యాఖ్యానించింది. ఇక లారాదత్తా అయితే ‘విశ్వసుందరుల క్లబ్‌లోకి ఆహ్వానం. ఈ విజయం కోసం 21 ఏళ్లుగా ఎదురు చూస్తున్నా’ అని ట్వీట్‌ చేసింది. నిన్న మొన్నటి వరకూ ఒకటి రెండు పంజాబీ సినిమాల్లో నటించింది సంధు. బహుశా అతి త్వరలో ఆమెను బాలీవుడ్‌ తెర మీద చూడొచ్చు.                    

మధ్యతరగతి విజయం
‘హర్నాజ్‌ మధ్యతరగతి అమ్మాయి. మధ్యతరగతి అమ్మాయిలు కలలు కని సాధించుకోవచ్చు అనడానికి ఉదాహరణ’ అంటుంది హర్నాజ్‌ తల్లి రవిందర్‌ సంధు. ఆమె గైనకాలజిస్ట్‌గా పని చేస్తున్నారు. హర్నాజ్‌ తండ్రి పేరు పి.ఎస్‌.సంధు. ఒక అన్నయ్య ఉన్నాడు. పేరు హరూన్‌. వీరి కుటుంబం చండీగడ్‌లోని మోహలీలో ఉంటుంది.

ఒకవైపు అందాలపోటీ జరుగుతుంటే హర్నాజ్‌ తల్లి దగ్గరలో ఉన్న గురుద్వార్‌లో రాత్రంతా ప్రార్థనలో కూచుంది. తెల్లవారుజామున హర్నాజ్‌ టైటిల్‌ గెలవడం చూసి సోదరుడు హరూన్‌ పరిగెత్తుకుంటూ వెళ్లి గురుద్వారాలోని తల్లికి ఈ విషయం తెలియచేశాడు.

‘నా కూతురు తిరిగి రావడంతోటే ఆమెకు ఇష్టమైన ‘మక్కికి రోటీ’, ‘సర్సన్‌ ద సాగ్‌’ చేసి పెడతాను’ అంది తల్లి ఉత్సాహంగా. హర్నాజ్‌ చిన్నప్పుడు చాలా సన్నగా ఉండేది. సాటి విద్యార్థుల గేలి ఎదుర్కొనేది. అయినా సరే టీనేజ్‌లోకి వచ్చాక అందాలపోటీ పట్ల ఆసక్తి పెంచుకుంది. 2017లో ‘మిస్‌ పంజాబ్‌’ టైటిల్‌ గెలుచుకుంది. 2019లో ‘మిస్‌ ఇండియా’లో సెమీ ఫైనలిస్ట్‌ దశకు చేరుకుంది. ‘అప్పుడు అర్థమైంది నాకు అందాల పోటీ అంటే కేవలం అందంగా కనిపించడం కాదు. దేశానికి ప్రాతినిధ్యం వహించడం అని. విశ్వ కిరీటం సాధించడానికి ఆ విధంగా నేను సిద్ధమయ్యాను.’ అంటుంది సంధు.

కుటుంబ సభ్యులతో హర్నాజ్‌

మరిన్ని వార్తలు