Zoya Agarwal: అబ్బురపరిచే సాహసికి... అరుదైన గౌరవం

21 Aug, 2022 04:05 IST|Sakshi

మ్యూజియం అంటే వస్తు,చిత్ర సమ్మేళనం కాదు. అదొక ఉజ్వల వెలుగు. అనేక రకాలుగా స్ఫూర్తిని ఇచ్చే శక్తి. అలాంటి ఒక మ్యూజియంలో కెప్టెన్‌ జోయా అగర్వాల్‌ సాహసాలకు చోటు దక్కింది... శాన్‌ఫ్రాన్సిస్కో(యూఎస్‌)లోని ఏవియేషయన్‌ మ్యూజియం వైమానికరంగ అద్భుతాలకు వేదిక. అక్కడ ప్రతి వస్తువు, ప్రతి చిత్రం, పుస్తకం...ప్రపంచ వైమానికరంగ వైభవానికి సంబంధించి ఎన్నో విషయాలను చెబుతుంది.

అలాంటి మ్యూజియంలో ఇప్పుడు మన దేశానికి చెందిన జోయా అగర్వాల్‌ సాహస చరిత్రకు చోటుదక్కింది. ఈ ప్రపంచ ప్రసిద్ధ మ్యూజియంలో చోటు సంపాదించిన తొలి భారతీయ మహిళా పైలట్‌గా చరిత్ర సృష్టించింది జోయా.

ఇప్పుడు ఆమె అద్భుత సాహసాన్ని చిత్రాల నుంచి వస్తువుల వరకు రకరకాల మాధ్యమాల ద్వారా తెలుసుకోవచ్చు. స్ఫూర్తి పొందవచ్చు.
దిల్లీలో జన్మించిన జోయాకు చిన్నప్పటి నుంచి సాహసాలు అంటే ఇష్టం. పైలట్‌ కావాలనేది ఆమె కల. అయితే తల్లిదండ్రులు భయపడ్డారు.
‘పైలట్‌ కావడానికి చాలా డబ్బులు కావాలి. అంత స్తోమత మనకు ఎక్కడ ఉంది తల్లీ’ అని కూడా అన్నారు.
అయితే అవేమీ తన మనసును మార్చలేకపోయాయి.ఏవియేషన్‌ కోర్స్‌ పూర్తయినరోజు తన ఆనందం ఎంతని చెప్పాలి!

మొదటి అడుగు పడింది.
ఒక అడుగు అంటూ పడాలేగానీ దారి కనిపించడం ఎంతసేపని!
తొలిసారిగా దుబాయ్‌కి విమానాన్ని నడిపినప్పుడు జోయా సంతోషం ఆకాశాన్ని అంటింది.
పైలట్‌ కావాలనుకొని అయింది. ఆ తరువాత కెప్టెన్‌ కూడా అయింది....ఇక చాలు అని జోయా అక్కడితో ఆగిపోయి ఉంటే ప్రపంచ వైమానికరంగ చరిత్రలో ఆమెకు అంటూ ఒక పుట ఉండేది కాదు. కోవిడ్‌ కోరలు చాచిన కల్లోల సమయంలో ‘వందే భారత్‌ మిషన్‌’లో భాగంగా విమానం ద్వారా విదేశాల్లో ఉన్న ఎంతోమంది భారతీయులను స్వదేశానికి క్షేమంగా తీసుకువచ్చి ‘శభాష్‌’ అనిపించుకుంది.

ఇక అతిపెద్ద సాహసం గత సంవత్సరం చేసింది.
నలుగురు మహిళా పైలట్‌లను కూర్చోబెట్టుకొని ఉత్తరధ్రువం మీదుగా 17 గంటల పాటు విమానం నడిపి చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకొని జోయాను ఐక్యరాజ్య సమితి భారత ప్రతినిధిగా నియమించడం అరుదైన గౌరవం.

‘అంకితభావం మూర్తీభవించిన సాహసి కెప్టెన్‌ జోయా అగర్వాల్‌. ఆమె విజయాలు, సాహసాలు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అమ్మాయిలకు స్ఫూర్తిని ఇస్తాయి. వారి కలను నెరవేర్చుకునేలా చేస్తాయి. మ్యూజియంలో ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన చరిత్ర, విజయాలు ఈ తరానికే కాదు, భవిష్యత్‌తరాలకు కూడా ఎంతో స్ఫూర్తిని ఇస్తాయి’ అంటున్నారు శాన్‌ఫ్రాన్సిస్కో ఎవియేషన్‌ మ్యూజియం అధికార ప్రతినిధి.

‘ఇది కలా నిజమా! అనిపిస్తుంది. ఈ గుర్తింపు నా దేశానికి, నాకు గర్వకారణం’ అంటుంది జోయా.
జోయా అగర్వాల్‌ ప్రతిభ, సాహసం కలగలిసిన పైలట్‌ మాత్రమే కాదు యువతరాన్ని కదిలించే మంచి వక్త కూడా.
‘రాత్రివేళ ఆరుబయట కూర్చొని ఆకాశాన్ని చూస్తున్న ఎనిమిది సంవత్సరాల బాలికను అడిగేతే, తాను కచ్చితంగా పైలట్‌ కావాలనుకుంటుంది’ అంటుంది జోయా అగర్వాల్‌.
అయితే అలాంటి బాలికలు తమ కలను నెరవేర్చుకోవడానికి జోయాలాంటి పైలట్‌ల సాహసాలు ఉపకరిస్తాయి. తిరుగులేని శక్తి ఇస్తాయి.    

మరిన్ని వార్తలు