అంతా ‘బేబీ’ బాక్సర్‌లే.. భారత్‌ మొదటి స్థానం

24 Feb, 2021 08:32 IST|Sakshi

భారత యువ మహిళా బాక్సింగ్‌ జట్టు తాజా విజయ దరహాసం వెనుక గల అసమాన శక్తి సామర్థ్యాల ఈ విశేషాన్ని బేబీరోజిసాన ఛానుతో మొదలుపెట్టడమే సబబు. యూత్‌ టోర్నిలో ఈ బేబీ బాక్సర్‌ బంగారు పతకాన్ని సాధించింది. జట్టులో మొత్తం పది మంది యువతులు ఉండగా మాంటెనెగ్రోలో జరిగిన ఈ యూత్‌ టోర్నీలో భారత్‌కు పది పతకాలు వచ్చాయి! ఐదు స్వర్ణాలు, మూడు రజితాలు, రెండు కాంస్యాలు. బంగారు పతకాల పట్టికలో కూడా వీరు భారత్‌ను మొదటి స్థానంలో నిలబెట్టారు. రెండు పతకాలతో ఉజ్‌బెకిస్థాన్, ఒక పతకంతో చెక్‌ రిపబ్లిక్‌ రెండు మూడు స్థానాల్లో నిలిచాయి. 

ఐరోపాలోని బాల్కన్‌ ప్రాంత దేశం అయిన మాంటెనెగ్రో ఆడ్రియాటిక్‌ సముద్రతీరం వెంబడి  ఎగుడుదిగుడు పర్వతాలతో నిండి ఉంటుంది. అక్కడి బుద్వా నగరంలో జరిగిన 30వ ఆడ్రియాటిక్‌ పెర్ల్‌ టోర్నమెంట్‌లోనే భారత్‌ మహిళలు ఈ ఘన విజయాన్ని సాధించుకుని వచ్చారు. అంతా ‘బేబీ’ బాక్సర్‌లే. బరిలో మాత్రం ప్రత్యర్థులను దీటుగా ఎదుర్కొన్నారు. ఆదివారం టోర్నీ ముగిసింది. యువ బాక్సర్‌లు పది పతకాలతో వస్తున్నారని తెలియగానే భారత్‌లోని ప్రొఫెషనల్‌ ఉమెన్‌ బాక్సర్‌ల ముఖాలు వెలిగిపోయాయి. బేబీ ఛాను శిక్షణ పొందింది ఇంఫాల్‌లోని మేరీ కోమ్‌ బాక్సింగ్‌ అకాడమీలోనే! ఆ శిక్షణ ఏ స్థాయిలో ఉందో ఆషియన్‌ జూనియర్‌ ఛాంపియన్‌ సబీనా బొబొకులోవా (ఉజ్బెకిస్తాన్‌) ను 3–2 తేడాతో ఆమె నాకౌట్‌ చేసినప్పుడు ప్రత్యర్థి జట్లు కనిపెట్టే ఉంటాయి.

మరొక బంగారు పతకం అరుధంతీ చౌదరి సాధించినది. మూడుసార్లు ‘ఖేలో ఇండియా’ గోల్డ్‌ మెడలిస్ట్‌ అయిన ఈ బాక్సింగ్‌ ఛాంపియన్‌ ఉక్రెయిన్‌ బాక్సర్‌ మార్యానా స్టోయికోను 5–0 తో ఓడించింది. మిగతా మూడు బంగారు పతకాలు అల్ఫియా పఠాన్, వింకా, సనమచ ఛాను సాధించినవి. బెస్ట్‌ ఉమెన్‌ బాక్సర్‌ ఆఫ్‌ టోర్నమెంట్‌ అవార్డు కూడా మన యువ జట్టుకే దక్కింది. ఆ అవార్డు విజేత వింకా! అబ్బాయిల్ని అనడం కాదు కానీ మన పురుషుల జట్టుకు రెండు మాత్రమే బంగారు పతకాలు సాధ్యం అయ్యాయి.

చదవండి: 'నాకు దేశభక్తి ఎక్కువ.. ఐపీఎల్‌ ఆడను'

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు