నాగేటిచాళ్లలో పుట్టిన విప్లవం

9 Jan, 2022 09:38 IST|Sakshi

 కాలరేఖలు

ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం, కాంగ్రెస్‌ స్థాపన–ఈ రెండు ఘట్టాల నడుమ స్వాతంత్య్రేచ్ఛతో సాగిన ఉద్యమాలలో గిరిజనోద్యమాలు ఎంత ఘనమైనవో, రైతాంగ ఉద్యమాలూ అంతటి విశిష్ఠమైనవే. ఈ రెండు పోరాటాలలో వినిపించేది  భూమి, సేద్యాలపై హక్కుల నినాదమే. భారతదేశ రైతాంగ పోరాటాలలో ముకుటాయమానమైనది బెంగాల్‌లో జరిగిన నీలిమందు విప్లవం. నీలిమందు సాగు ఐరోపా దిగుమతే. 18వ శతాబ్దంలోనే బెంగాల్‌ గడ్డ మీద నీలిమందు మొలకలు వేసింది. అనతికాలంలోనే విషవృక్షంలా విస్తరించింది.

1777లో లూయీ బొన్నౌ అనే ఫ్రెంచ్‌ జాతీయుడు ఆ సాగును భారత్‌కు తెచ్చాడు. అలా ఫ్రెంచ్‌ విప్లవానికి (1789)కి ముందే బెంగాల్‌లో రైతాంగ విప్లవానికి బీజాలు వేశాడు. హుగ్లీ తీరంలో చంద్రనగోర్‌ భూములలో మొదట ఆ సాగు చేయించినవాడు ఇతడే. ఆపై నవాబులు, జమీందార్లు తోడయ్యారు. యూరప్‌తో పాటు ప్రపంచమంతా దీనికి గిరాకీ ఉండేది. ఇది భూస్వామికి కొంగుబంగారం. కర్మాగారాలకు లాభాల పంట. రైతు నెత్తిన మాత్రం రుణభారం.

దేశం మీద కంపెనీ పెత్తనం మొదలవుతున్న తరుణంలోనే కర్షకుడికి కష్టాలు మొదలయ్యాయి. 1850 నుంచి 1899 వరకు 24 దుర్భిక్షాలు ఏర్పడ్డాయి. 1876–79 నాటి కరవులో కోటీ ముప్పయ్‌ లక్షలు, 1896–1902 నాటి కరవులో కోటీ తొంబై లక్షల మంది ప్రజలు చనిపోయారు. వీరిలో ఎక్కువ మంది రైతులే. ఈ ఆక్రోశమే, ‘నేను చావనైనా చస్తాను గానీ, నీలిమందు పంట మాత్రం వేయను’ అంటూ ఓ రైతు కమిషన్‌ ముందు చెప్పిన మాటలో ధ్వనిస్తుంది.

1859 వేసవికి వేడెక్కిన బెంగాల్‌ నీలిమందు రైతుల ఆగ్రహం ఈ విధంగా ఉండేది. ఆ రైతు వెతలను దీనబంధు మిశ్రా నాటకం (1859) నీల్‌ దర్పణ్‌ (నీలి అద్దం) కళ్లకు కట్టింది. ‘మా స్వర్ణ బెంగాల్‌ను నీలిమందు మర్కటాలు విధ్వంసం వైపు నెట్టివేస్తున్నాయి’ (హిందూ పేట్రియాట్‌ పత్రిక సంపాదకుడు హరీశ్‌చంద్ర ముఖర్జీ అకాల మరణం సమయంలో వెలువడిన పాట. ఆ పత్రిక నీలిమందు విప్లవంలో భాగం) అంటూ పాడారు.

రైతులు నీలిమందు కర్మాగారాలలో కూలీలుగా మారిపోయారు. సూటూ బూటూ వేసుకుని అజమాయిషీ చేసే ఇంగ్లిష్‌ దొరల ముందు వారు ఎంత దుర్భరస్థితిలో పనిచేసేవారో ఫ్రెంచ్‌ ఫొటోగ్రాఫర్‌ మెల్లీ తీసిన ఫొటోలు సాక్ష్యం చెబుతాయి.1860 ఏప్రిల్‌లో ఈ పంట పండించబోమంటూ నాడియా, పాబ్నా జిల్లాల రైతులు సమ్మె చేశారు. తిండిగింజలిచ్చే పంట మానుకుని, నీలిమందు వేస్తే కనీసం గిట్టుబాటయ్యేది కాదు.

పైగా అప్పులు, వెట్టిచాకిరి. ఒకవేళ నీలిమందు కాస్త బాగా పండినా రుణమైతే చెల్లించలేడు. అంతదారుణమైన వడ్డీ. దీనికి తోడు పన్నులు. నిజానికి నీలిమందు సాగు నుంచి రైతు తప్పించుకోలేని పరిస్థితి కల్పించారు. ఎవరైనా తెగించి తిండిగింజలు పండించబోతే ఆ పంటను ధ్వంసం చేసేవారు. వరిపొలాలలో పనిచేసుకుంటున్నవారిని పిడిగుద్దులతో తీసుకెళ్లి నీలిమందు పంటలలోకి దించేవారు. 

ఈ సాగు రెండురకాలు. ఒకటి భూస్వాములు, నీలిమందు కర్మాగారాల యజమానులు నేరుగా పండించుకోవడం (ఈ భూములు ఆంగ్లేయులకు ఎలా వచ్చాయి? స్థానిక భూస్వాముల నుంచి వందల ఎకరాలు లీజు పేరుతో తీసుకునేవారు). రెండు రైతులతో ఒప్పందాలు చేసుకుని, సాగుకు కొంత  డబ్బు ముందే ఇచ్చి చేయించేది. ‘ముందుగా చెల్లించే ఈ డబ్బును సుముఖతతో తీసుకున్న ఒక్క రైతును కూడా నేను ఎరుగను’ అని ఎఫ్‌. షుర్‌ అనే బెంగాలీ మిషనరీ చెప్పడం విశేషం. ఈ రెండో పద్ధతే రైతులను వెట్టివాళ్లను చేసింది. అసలు రైతును ఈ సాగులోకి దించే పద్ధతంతా దోపిడీ మయం. ‘రైతు కొడుకు కూడా సహజ రీతిలో నీలలిమందు పంట వేసేవాడు. ఎందుకంటే తన తండ్రి చేసిన రుణానికి బాధ్యుడు తనే కాబట్టి’ అన్న మనస్తత్వం ఏర్పడింది.

ఒక్క సంవత్సరంలోనే 1859–60 మధ్యనే ఒక్కసారిగా దావానలంలా తిరుగుబాటు వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు. ఆంగ్ల భూస్వాములు, నీలిమందు కర్మాగారాల అధిపతుల ఆదేశాలను ధిక్కరిస్తూ వేలాది మంది బెంగాల్‌ రైతులు ఉద్యమించారు. నాడియా జిల్లాలోని చౌగాచాలో దీనికి అంకురార్పణ జరిగింది. అక్కడి గోవిందపూర్, కృష్ణనగర్‌లలో బిష్ణుచరణ్‌ బిశ్వాస్, దిగంబర్‌ బిశ్వాస్‌ సోదరులు విప్లవం ఆరంభించారు.

పాబ్నా జిల్లాలో రఫీక్‌ మొండల్, కాదేర్‌ ముల్లా రైతులకు నాయకత్వం వహించారు. రావ్‌రతన్‌ అనే నారెయిల్‌ ప్రాంత జమీందారుతో పాటు, పలువురు జమీందారులు కూడా రైతులకే మద్దతుగా నిలిచారు. మేధావులు, మిషనరీలు, ముస్లింలు చేయూత నిచ్చారు. కవులూ, రచయితలూ, నాటకకర్తలూ, పత్రికా రచయితలూ నిర్వహించిన పాత్ర చరిత్రాత్మకమైనది. ఇక గ్రామీణ ప్రాంతాలన్నీ రైతులకు అండగా ఉన్నాయి.

చాలా చిత్రంగా ఇటు విన్నపాలూ, అటు దాడులూ రెండూ ఈ ఉద్యమంలో కనిపిస్తాయి. పరిస్థితిని అంచనా వేయడానికి బెంగాల్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ జేపీ గ్రాంట్‌ కుమర్, కాళీగంగా తీర ప్రాంతంలో పర్యటించినప్పుడు ‘నీలిమందు బలవంతపు సాగు ఆపించండి!’ అని వేడుకుంటూ వందలాది రైతులు చేతులెత్తి మొక్కుతూ కనిపించారు.

మళ్లీ నాడియా, పాబ్నా జిల్లాల్లో శూలాలు, కత్తులతో నీలిమందు భూస్వాముల మీద దాడులకు దిగిన రైతులు ఉన్నారు. ఆ రెండు ఘట్టలాలోనూ స్త్రీలు కూడా పాల్గొన్నారు. భూస్వాముల మీద దాడులలో మహిళలు కుండలు, పెనాలనే ఆయుధాలుగా చేసుకున్నారు. భూస్వాములకు అండగా వచ్చే పోలీసులను కూడా రైతులు వదిలిపెట్టే వారు కాదు. 

ఎట్టకేలకు 1860 మార్చిలో ఇండిగో కమిషన్‌ వేశారు. డబ్ల్యు  ఎస్‌ సెటన్‌కార్, ఆర్‌ టెంపుల్‌ (బ్రిటిష్‌ అధికారులు), రెవరెండ్‌ జే సేల్‌ (మిషనరీ), డబ్లు్య ఎఫ్‌ ఫెర్గుసన్‌ (యూరోపియన్‌ భూస్వాముల ప్రతినిధి), చంద్రమోహన్‌ ఛటర్జీ (స్థానిక భూస్వాముల ప్రతినిధి) ఇందులో సభ్యులు. 134 మందిని విచారించి అదే సంవత్సరం కమిషన్‌ నివేదిక ఇచ్చింది. 1862లో నీలిమందు బలవంతపు సాగును నిరోధిస్తూ చట్టం వచ్చింది. 

ఇక్కడితో ఆ ఉదంతాన్ని వదిలిపెడితే వాళ్లు ఆంగ్లేయులు ఎందుకవుతారు? 1870, 80 దశకాలలో తూర్పు బెంగాల్‌ ప్రాంతంలో, పాబ్నా జిల్లాలో భూస్వాములు పన్నులు విపరీతంగా పెంచారు. మళ్లీ కథ మొదటికి వచ్చింది. 1873లో అక్కడ అగ్రేరియన్‌ లీగ్‌ ఏర్పాటయింది. పెరిగిన పన్నులు, శిస్తులకు వ్యతిరేకంగా సమ్మెలు జరిగాయి. ఇక్కడ కూడా రైతులకే విజయం లభించింది. 1885లో బెంగాల్‌ టెనెన్సీ చట్టం వచ్చింది. భూమి మీద రైతుకు ఉన్న హక్కుకు బలం వచ్చింది. ఈ ఉద్యమానికి వందేమాతర గీతకర్త బంకించంద్ర ఛటర్జీ, ఇండియన్‌ అసోసియేషన్‌ తరఫున సురేంద్రనాథ్‌ బెనర్జీ, ఆర్‌సి దత్‌ (ఐసీఎస్‌ అధికారి, చరిత్రకారుడు) మద్దతుగా నిలిచారు. 
నీలిమందు ఉదంతం నిజంగా విప్లవం.

ఇందులో యూరోపియన్లూ, వారిని అంటకాగే భారతీయులూ, మిగిలిన వర్గాలు అనే రెండు శిబిరాలు కనిపిస్తాయి. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, కొందరు జమీందార్లు, గ్రామీణులు ఐక్యంగా పోరాడారు. కొన్నిచోట్ల రైతులు దాడులకు దిగినా, కొన్నిచోట్ల శాంతియుతంగానే పోరాటం సాగింది. ఇదే తరువాతి కాలాలలో వచ్చిన అహింసాయుత పంథాకు మూలమని చరిత్రకారులు భావించారు. సత్యాగ్రహం అనే ఆయుధం ఇలాగే వచ్చిందని చెబుతారు. 1857 ప్రథమ స్వాతంత్య్ర సమరం భారతీయులకు సాధించిపెట్టలేని విజయం నీలిమందు విప్లవం తెచ్చిందన్న అభిప్రాయం కాదనలేనిది.
-డా. గోపరాజు నారాయణరావు


 

మరిన్ని వార్తలు