స్వాతిముత్యం: ఆరోగ్యం ఆనందం

18 Sep, 2022 00:55 IST|Sakshi
స్వాతి పిరామల్‌; ఫ్రాన్స్‌ అత్యున్నత పురస్కారం అందుకుంటూ..

చాలామంది వ్యక్తిగత, వృత్తిగత జీవితాన్ని రెండు ప్రపంచాలు చేసుకుంటారు. సరిహద్దులు గీసుకుంటారు. స్వాతి పిరామల్‌కు మాత్రం అలాంటి సరిహద్దులు లేవు. తనకు వైద్యరంగం అంటే ఎంత ఇష్టమో, ఇష్టమైన వంటకాలను చేయడం అంటే కూడా అంతే ఇష్టం.

స్వాతి ఆధ్వర్యంలో జరిగే బోర్డ్‌ మీటింగ్‌లలో హాట్‌ హాట్‌ చర్చలే కాదు, ఆమె వండిన హాట్‌ హాట్‌ వంటకాలు కూడా దర్శనమిస్తాయి. ‘ఉరుకులు, పరుగులు వద్దు. కూల్‌గా, నవ్వుతూ పనిచేద్దాం’ అని తరచు చెప్పే శాస్త్రవేత్త, పారిశ్రామికవేత్త స్వాతి పిరామల్‌ తాజాగా ఫ్రాన్స్‌ అత్యున్నత పౌరపురస్కారం ‘ది షెవాలియే డి లా లీజియన్‌ దానర్‌ ఆర్‌ నైట్‌ ఆఫ్‌ ది లీజియన్‌ ఆఫ్‌ హానర్‌’ అందుకున్నారు.

అంతగా పరిచయం అక్కర్లేని పేరు స్వాతి పిరామల్‌. సంప్రదాయ గుజరాతీ కుటుంబానికి చెందిన స్వాతి తొలిసారి అడుగుపెట్టింది మాత్రం తనకు ఎంతమాత్రం పరిచయం లేని రంగంలోకి! ఆస్ట్రేలియన్‌ ఫార్మాస్యూటికల్‌ కంపెనీ నికోలస్‌ లేబోరేటరీస్‌ కొనుగోలు చేసినప్పుడు తనకు, భర్త అజయ్‌ పిరామల్‌కు బొత్తిగా ఏమీ తెలియదు. తన చేతిలో మాత్రం ఎంబీబీయస్‌ డిగ్రీ ఉంది.

నడుస్తూ నడుస్తూనే, ప్రయాణిస్తూనే ఎన్నో విషయాలు తెలుసుకున్నారు. రాత్రనకా, పగలనకా కష్టపడ్డారు. ఆ కష్టం వృథా పోలేదు. అనతి కాలంలోనే కంపెనీ అగ్రస్థానంలోకి వెళ్లింది. ఈ రంగానికి సంబంధించిన పనితీరు విషయానికి వస్తే ‘ఇలాగే’ అన్నట్లుగా ఉండేది. ‘ఇలా కూడా చేయవచ్చు’ అని కూల్‌గా నిరూపించింది స్వాతి పిరామల్‌.

‘వ్యక్తిగత, వృత్తిజీవితాలకు మధ్య ఉండే సరిహద్దు రేఖను స్వాతి చెరిపేశారు’ అనే మాట వినబడుతుంటుంది. అయితే ఈ కామెంట్‌ను ఆమె ప్రశంసగానే స్వీకరిస్తుంది. ఇంట్లో వంట చేస్తూనే, టీ తయారు చేస్తూనే క్లయింట్స్‌తో స్వాతి మాట్లాడే దృశ్యం సా«ధారణం. చాలా సందర్భాల్లో క్లయింట్స్‌ ఆమె ఆతిథ్యం స్వీకరిస్తూనే వ్యాపార విషయాలు మాట్లాడుతుంటారు.
ఈ దృశ్యాన్ని చూస్తుంటే స్వాతి తన బంధువులు, స్నేహితులతో కలిసి భోజనం చేస్తున్నట్లు అనిపిస్తుంది తప్ప క్లయింట్స్‌తో కలిసి బిజినెస్‌ విషయాలు చర్చిస్తున్నట్లుగా ఉండదు!

‘ఔషధాలను అమ్మడానికి మాత్రమే మా పని పరిమితమైనది కాదు. సమస్యలకు పరిష్కారాలు అన్వేషించడం, ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం ముందు జాగ్రత్తలు సూచించి, ఆచరించేలా చేయడం కూడా’ అంటుంది స్వాతి పిరామల్‌.
 ఇండియా అపెక్స్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ తొలి మహిళా ప్రెసిడెంట్‌గా చరిత్ర సృష్టించిన స్వాతి పిరామల్‌ సైన్స్, ఔషధరంగాల్లో సేవలు, భారత్‌–ఫ్రాన్స్‌ సంబంధాల బలోపేతానికి  చేస్తున్న కృషికి తాజాగా ఫ్రాన్స్‌ అత్యున్నత పౌర పురస్కారం అందుకుంది.

‘మీ ఖాతాలో ఇన్ని విజయాలు ఉన్నాయి కదా, మీరు ఏ విజయాన్ని చూసి ఎక్కువ గర్వపడతారు?’ అని అడిగితే – ‘ఏదీ లేదు’ అని గలగలమని నవ్వుతుంది స్వాతి.
మనం ఆశ్చర్యం నుంచి తేరుకునేలోపే ఇలా అంటుంది... ‘నా మనవరాలు తన రిపోర్ట్‌ కార్డ్‌తో నవ్వుతూ నా వైపు పరుగెత్తుకు వస్తున్న దృశ్యాన్ని చూస్తున్నప్పుడు, ఈ ప్రపంచంలో అత్యున్నత స్థానంలో ఉన్నట్లు గర్వపడతాను’.

ముంబై కేంద్రంగా పనిచేస్తున్న పిరామల్‌ గ్రూప్‌ వైస్‌–చైర్‌పర్సన్‌ స్వాతి పిరామల్‌ ఎన్నో విజయాలు దక్కించుకున్న పారిశ్రామికవేత్త మాత్రమే కాదు. ‘సమాజానికి తిరిగి ఇవ్వాలి’ అనే సిద్ధాంతాన్ని బలంగా నమ్ముతున్న వ్యక్తి.
వ్యాపార రంగంలోకి అడుగుపెట్టక ముందు మెడికల్‌ స్కూల్‌ ఫ్రెండ్స్‌తో కలిసి ఉచిత వైద్యశిబిరాలు నిర్వహించేది. ఆరోగ్య విషయాలపై వీధి నాటికలు తయారు చేసి ఫ్రెండ్స్‌తో కలిసి వాటిలో నటించేది. ప్రస్తుతం ‘పిరామల్‌ ఫౌండేషన్‌’ తరపున సామాజికసేవా కార్యక్రమాలు చేపడుతోంది.
‘ప్రజల ఆరోగ్యం, ఆవిష్కరణలు, కొత్త ఔషధాలపైనే నా ప్రధాన దృష్టి’ అని చెబుతుంది స్వాతి పిరామల్‌.
 

మరిన్ని వార్తలు