రాణిగారి కన్నా ఏం తక్కువ

6 Dec, 2020 02:30 IST|Sakshi
బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌, సుధామూర్తి కూతురు అక్షత

సుధామూర్తి నవ్వుకునే ఉంటారు కూతురు అక్షతను క్వీన్‌తో పోటీకి తెచ్చింది మరి బ్రిటన్‌ మీడియా! ఎలిజబెత్‌ రాణి గారి కంటే.. వెయ్యికోట్లు ఎక్కువేనట అక్షత సంపద! నిజమే కావచ్చు కానీ.. ఇప్పటికీ ఆమె.. తల్లిని పాకెట్‌ మనీ అడిగే కూతురిలానే జీవిస్తున్నారన్నదీ నిజం. నిరాడంబరంగా.. సంపన్నతను ప్రదర్శించని రాణిగా! తల్లి పెంపకంలోని గొప్పతనం అది.

ఇన్ఫోసిస్‌ దంపతులు సుధ, నారాయణమూర్తిల గుర్తింపు ఎన్నేళ్లు గడిచినా, వాళ్ల కంపెనీ ఎన్ని కోట్లు గడిచినా ఎప్పటికీ మారనిదీ, ఒకేవిధమైనదీ! ‘సంపన్నులైన నిరాడంబరులు’ అనేదే ఆ గుర్తింపు. వారిద్దరి నిరాడంబరత్వం గురించి మాట్లాడవలసి వచ్చినప్పుడు తమ ఇద్దరు పిల్లల్ని వాళ్లెలా పెంచారన్నదే సరైన కొలమానం అవుతుంది. మూర్తి దంపతులకు మొదట కుమార్తె. తర్వాత కొడుకు. కుమార్తె అక్షత బ్రిటన్‌లో స్థిరపడ్డారు. కొడుకు రోహన్‌ ఇండియాలోనే ‘హార్వర్డ్‌ సొసైటీ ఆఫ్‌ ఫెలోస్‌’కి టెక్నికల్‌ ఆఫీసర్‌గా ఉన్నారు. ఇన్ఫోసిస్‌ చైర్‌పర్సన్‌ అయిన డెబ్బై ఏళ్ల సుధామూర్తి సోషల్‌ వర్కర్‌.

కన్నడ, మరాఠీ, ఇంగ్లిష్‌ భాషలలో పుస్తకాలు రాశారు. ఒకప్పుడు ఆమె ఇంజినీరింగ్‌ టీచర్‌. నారాయణమూర్తి ఇన్ఫోసిస్‌కి ప్రస్తుతం ఎమెరిటస్‌ చైర్మన్‌. పదవీ విరమణానంతర బాధ్యతల్ని నిర్వహించి వెళుతుంటారు. కోట్లల్లో ఆస్తులు ఉన్నా, సింపుల్‌గా ఉంటారు. ఉండకూడదని కాదు. ఈ దంపతుల ఆసక్తులు, అభిరుచులు.. ఆస్తుల సంపాదనకు పూర్తి భిన్నమైనవి. అందుకే ఎప్పుడు వీళ్ల ప్రస్తావన వచ్చినా ‘నిరాడంబరత్వం’ వీరి సుసంపన్నతగా కనిపిస్తుంది. అందుకే వీళ్లమ్మాయి అక్షత ఇప్పుడు బ్రిటన్‌ మహారాణి ఎలిజబెత్‌ కన్నా ధనికురాలన్న గుర్తింపు పొందడం పెద్ద విశేషం అయింది.
∙∙
అక్షత (40) పదకొండేళ్ల క్రితం రిషీ సునక్‌ను వివాహమాడి బ్రిటన్‌ వెళ్లిపోయారు. కాలిఫోర్నియాలోని స్టాన్‌ఫోర్డ్‌ బిజినెస్‌ స్కూల్లో వాళ్లిద్దరూ క్లాస్‌మేట్స్‌. ఆ పరిచయం పెళ్లి వరకు వెళ్లింది. రిషి బ్రిటన్‌లోనే పుట్టారు. 2014లో ప్రజా రాజకీయాల్లోకి వెళ్లారు. ప్రస్తుతం యు.కె.లో అధికారంలో ఉన్న కన్సర్వేటివ్‌ పార్టీ ఎంపీ ఆయన. ఈ ఏడాది ఫిబ్రవరిలో ‘ఛాన్స్‌లర్‌ ఆఫ్‌ ఎక్స్‌చెకర్‌’ అయ్యారు. అంటే ఆర్థికమంత్రి. ఇద్దరు కూతుళ్లు. కృష్ణ, అనౌష్క. ఆర్థికమంత్రి అయినవారు కుటుంబ వివరాలతోపాటు ఆస్తుల లెక్కల్నీ, వాటి విలువను వెల్లడించాలి. బ్రిటన్‌ పార్లమెంటుకు కూడా ఆ ఆనవాయితీ ఉంది.

ఇటీవల రుషీ తన ఆర్థిక పత్రాలను సమర్పించినప్పుడు యు.కె.లో ఆయన భార్య అక్షత నిర్వహిస్తున్న సొంత వెంచర్‌ క్యాపిటల్‌ సంస్థ ‘క్యాటమరాన్‌ వెంచర్స్‌’ ఆస్తులు, ఇన్ఫోసిస్‌ లో ఆమెకు ఉన్న షేర్‌లు కలుపుకుని ఆమె సంపద విలువ 480 మిలియన్‌ పౌండ్లు ఉన్నట్లు బహిర్గతం అయింది. అదేమీ దాచి ఉంచిన సంగతి కానప్పటికీ ‘ది గార్డియన్‌’ పత్రిక సంపన్నత విషయంలో అక్షత క్వీన్‌ ఎలిజబెత్‌ను దాటిపోయారని రాయడంలో ప్రపంచ ప్రజల ఆసక్తికి అక్షత ఒక కేంద్రబిందువు అయ్యారు. బహుశా ఈ కేంద్రబిందువును చూసి సుధామూర్తి దంపతులు మురిసిపోయే ఉంటారు. క్వీన్‌ ఎలిజబెత్‌ దగ్గర ప్రస్తుతం ఉన్నది 350 మిలియన్‌ పౌండ్లయితే, అక్షత దగ్గరున్నవి 450 పౌండ్‌లు. మన కరెన్సీలోమనమ్మాయి దగ్గర రాణి గారి దగ్గర ఉన్న డబ్బు కంటే సుమారు వెయ్యి కోట్ల రూపాయలు ఎక్కువ ఉన్నట్లు. అక్షతకు ఇంకా అమెజాన్‌ ఇండియాలో, బ్రిటన్‌లోని ఆరు కంపెనీల్లో వాటాలు ఉన్నాయి.
∙∙
‘రాణిగారి గారి కన్నా అక్షత సంపన్నురాలు’ అనే మాట వినేందుకు గొప్పగా ఉన్నా ఇంకా తల్లిదండ్రులను పాకెట్‌ మనీ అడిగే అమ్మాయిలానే సాధారణంగా ఉంటారు అక్షత! ‘డబ్బుకు మనం సొంతదారులం కాదు. సంరక్షకులం మాత్రమే. నువ్వు విజయం సాధించినప్పుడు ఆ విజయంలో సమాజం నీకిచ్చిన సహకారం కూడా ఉంటుంది కనుక ఆ సహకారాన్ని తిరిగి నువ్వు సమాజానికి ఇచ్చేయాలి’ అని తను టాటా ఉద్యోగిగా ఉన్నప్పుడు జేఆర్డీ టాటా చెప్పిన మాటను సుధామూర్తి గుర్తుంచుకుని పాటించారు. తన పిల్లలకూ నేర్పించారు. ఆమె జీవితంలోని రెండు సందర్భాలు కూడా అక్షతను, రోహన్‌ను నిరాడంబరంగా పెంచేందుకు ప్రేరణ అయ్యాయి.

తెరిపి లేకుండా ఏకధారగా వర్షం కురుస్తుంటే ఇల్లు తడిసి, కప్పు కారిపోతున్నా.. ‘వానా వానా వల్లప్ప’ అని పాడుకుంటూ సంతోషంతో నృత్యం చేసిన ఒక నిరుపేద కుటుంబం, తమిళనాడు స్వామిమలై సమీపంలోని ఒక ఆలయంలో అంధుడైన ఒక పూజారి తను ఇచ్చిన ఐదు వందల నోటును తడిమి చూసుకుని ‘అంత డబ్బు తనకు అక్కర్లేదు’ అని తిరిగి ఇచ్చేస్తూ, ఐదు పావలా బిళ్లలను మాత్రమే అడిగి తీసుకోవడం సుధామూర్తిని ఆశ్చర్యంలో ముంచెత్తిన సందర్భాలు ఆ రెండూ. కొడుకు బడికి వెళ్తున్నప్పుడు చాలాకాలం పాటు ఆమె ఇచ్చిన పాకెట్‌ మనీ 5 రూపాయలు! ‘అయిదా!’ అని రోహన్‌ మూతి బిగిస్తే, ‘ఇది కూడా లేని వాళ్లు మన చుట్టూ ఎంతోమంది ఉన్నారు’ అని సుధామూర్తి చెప్పేవారట. తగ్గట్లే ఇద్దరు పిల్లలూ ఎంత ఆస్తిపరులైనా, అమ్మానాన్న పిల్లల్లానే ఉన్నారు. రాణిగారి కంటే ధనికురాలిగా ఊహించని కొత్త గుర్తింపు పొందిన అక్షత.. తల్లి పెంపకంలో చిన్నప్పటి నుంచీ సంపన్నతను ప్రదర్శించని రాణిగానే పెరిగారు.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు