Corona Tragedy: ఓ రహదారి పాఠం..

8 Jun, 2021 13:04 IST|Sakshi

కరోనా మహమ్మారి కారణంగా ఎంతోమంది తమ ఆదాయ వనరులను కోల్పోయారు. ముప్పై నాలుగేళ్ల అంబికకు కూడా 14 ఏళ్లుగా తన గాత్రం ద్వారా వచ్చే ఆదాయం ఆగిపోయింది. కుటుంబం గడిచే పరిస్థితులు కుంటుపడ్డాయి. దీంతో అంబిక బైక్‌ సర్వీసును నమ్ముకుంది. అదే తన ఆదాయ వనరుగా మార్చుకుంది. 

తిరువనంతపురం: అంబిక తండ్రి కేరళలోని ప్రసిద్ధ సంగీత దర్శకుల వద్ద తబలా ప్లేయర్‌గా చేసేవాడు. ఆమె సోదరుడు కీబోర్డ్‌ ప్లేయర్‌. అంబిక తన ఇంటి సంగీత వారసత్వాన్ని అందిపుచ్చుకుని నేపథ్యగాయనిగా పేరుతెచ్చుకుంది. ఈవెంట్స్‌లో పాడేది. సొంత ఆర్కెస్ట్రా కూడా ఉంది. కానీ, కరోనా మహమ్మారి కారణంగా వచ్చిన లాక్డౌన్‌ తో ఈవెంట్స్‌ లేవు. వచ్చే ఆదాయమూ ఆగిపోయింది. కుటుంబం గడవడం కష్టంగా మారింది.

కష్టకాలాన్ని దాటడానికి..
అంబిక భర్త రెండేళ్ల క్రితం అనారోగ్యం తో కన్నుమూశాడు. తన ఇద్దరు కూతుళ్లు, తల్లి, సోదరుడితో కలిసి ఉంటున్నది అంబిక. కుటుంబ పోషణకు రకరకాల ఆదాయమార్గాలపై దృష్టి పెట్టింది. ‘ఇల్లు గడవాలంటే ఏదో ఒక పని చేయాలి. కూర్చొని తినగలిగే స్థాయి మాకు లేదు’ అని చెప్పే అంబిక స్థానిక కార్పొరేషన్‌ కార్యాలయంలో బైక్‌ టాక్సీ సేవలో చేరింది. కరోనా సోకినవారికి సహాయం చేస్తూ నాలుగు నెలలపాటు సూపర్‌వైజర్‌గా పనిచేసింది. కానీ, ఇది కూడా ఆగిపోయినప్పుడు రాపిడో  ఉద్యోగానికి అప్లై చేసుకుంది.

ఈ జాబ్‌ తనకు ఎంత అవసరమో చెప్పే అంబిక ఈ కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌లతో ముడిపడి ఉన్న ఈ ఉద్యోగాన్ని ఎంచుకుంది. అంబిక ఇప్పుడు రోజూ సాయంత్రం 6 నుంచి 10 గంటల మధ్య తన ద్విచక్రవాహనంపై చెన్నై రహదారుల్లో ప్రయాణిస్తుంది. ‘కొన్నిసార్లు రెస్టారెంట్ల నుంచి ఫుడ్‌ తీసుకోవడానికి గంటకు పైగా ఎదురుచూడాల్సి ఉంటుంది. సహనం నశిస్తుంది. కానీ, తప్పదు. ఇది చాలా కష్టకాలం. నేను కొన్ని కంపెనీల వారిని సంప్రదించాను. బీకామ్‌ డిగ్రీ చేసినా 6–7 వేల రూపాయలకన్నా ఎక్కువ జీతం వచ్చే ఉద్యోగం లేదు. ఆ కంపెనీలు ఉంటాయో లేదో అనుమానమే. అందుకే, నిలకడగా వచ్చే ఈ ఆదాయమే బెటర్‌ అనుకున్నాను. రోజూ 6 కు తగ్గకుండా ఫుడ్‌ డెలివరీలు ఇస్తాను. రోజూ 250 రూపాయలు వస్తాయి’ అని వివరిస్తుంది అంబిక. 

చేసే పనిలో గౌరవం
డాక్టర్‌ సూచించిన రోగనిరోధక శక్తిని పెంచే మాత్రలు వాడుతూ, కోవిడ్‌ జాగ్రత్తలు తీసుకుంటూ ప్రతీ ఫుడ్‌ డెలివరీ చేస్తుంది అంబిక. ‘ఈ సమయంలో ప్రజలు కొంత దయగా ఉన్నారు. ఎంతోకొంత టిప్‌ కూడా ఇస్తుంటారు. లాక్‌డౌన్‌ కారణంగా ట్రాఫిక్‌లేని రోడ్ల మీద ప్రయాణించడం మాత్రం ఉద్వేగాన్ని కలిగిస్తుంది. ఆగిన ప్రపంచ రహదారులు కొత్త పాఠాలు నేర్చుకోమని చెబుతున్నట్టుగా అనిపిస్తుంది. చేసే ప్రతి పనికి గౌరవం ఉంటుందని నమ్ముతాను. ఈ పనిలోనూ నాకు గౌరవం లభిస్తుంది’ అంటుంది అంబిక. 

మొదట అంబిక చేసే ఫుడ్‌ డెలివరీ బైక్‌ ప్రయాణానికి ఆమె సోదరుడు కొంత ఆందోళన చెందాడు. కానీ, ఇప్పుడు ఆమెకు మద్దతునిస్తున్నాడు. అంబిక భవిష్యత్తు అంతా ఎనిమిది, ఆరేళ్లు ఉన్న తన ఇద్దరు కూతుళ్ల చుట్టూ తిరుగుతోంది. కేరళలోని వారసత్వ ఇంటిని అమ్మేసి, చెన్నైలో కొనుక్కొని స్థిరపడాలని ఆలోచన చేస్తోంది. పిల్లలకు మంచి భవిష్యత్తు కల్పించాలంటే తగినంత డబ్బు పొదుపు చేయాలనుకుంటుంది. కష్టకాలమైనా ధైర్యంగా ముందడుగు వేసే అంబికలాంటి వాళ్లు ఎప్పుడూ తోటివారికి ఆదర్శంగా నిలుస్తూనే ఉంటారు. 
  

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు