'ఉద్యోగం తెచ్చుకోక ఆ కొండలెక్కడం ఏంటి'.. కట్‌చేస్తే

12 Dec, 2021 08:21 IST|Sakshi

ఎవరూ చేయని పనులను ఎంచుకోవడం ఇష్టం.
నలుగురూ వెళ్లేదారిలో కాకుండా
తనకోసం తను కొత్త దారి వేసుకోవడం ఇష్టం.
కన్న కల కోసం కఠోరశ్రమకైనా 
వెనకాడకుండా ముందుకు సాగడం ఇష్టం.
మన త్రివర్ణ పతాకాన్ని ప్రపంచ దేశాల పర్వతశిఖరాలపై
ఎగురవేసి తీరాలన్నది మరీ మరీ ఇష్టం.
తెలంగాణలోని భువనగిరి మండలం ఎర్రబెల్లి గ్రామంలో 
ఓ సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన పడమటి అన్విత
ఇటీవల రష్యాలోని ఎల్బ్రస్‌ పర్వతంపై
మన జాతీయ పతాకాన్ని ఎగురవేసి వార్తల్లో నిలిచింది. 
ఈ సందర్భంగా ‘సాక్షి’తో అన్విత పంచుకున్న విశేషాలు.. 

ఉస్మానియా యూనివర్శిటీ నుంచి ఎంబీఏ పూర్తి చేసిన అన్విత  పర్వతారోహణలో బేసిక్‌ కోర్సులనూ పూర్తి చేసింది. ఇప్పటి వరకు ఐదు పర్వతాలను అధిరోహించిన 23 ఏళ్ల అన్విత ప్రస్తుతం భువనగిరి రాక్‌ క్లైంబింగ్‌లో సహాయ శిక్షకురాలిగా ఉంది. తనకు తానుగా ఏర్పర్చుకున్న లక్ష్యంతో ఇతర దేశాల పర్వతాలపై భారతీయజెండాను ఎగురవేయడం కోసం కఠోర శ్రమను సైతం ఆనందంగా స్వీకరిస్తూ పర్వత శిఖరాలను అవలీలగా అధిరోహిస్తోంది. 

పేరు: పడమటి అన్విత 
విద్యార్హత: ఎంబీఏ 
ఇప్పటి వరకు అధిరోహించిన పర్వతాలు:
2015లో రినాక్‌ పర్వతం( 4500 మీటర్లు)
2019లో బీసీ రాయ్‌ పర్వతం (6000 మీటర్లు)
2021 లో కిలిమంజారో (5849 మీటర్లు)
2021లో కడే పర్వతం (6000 మీటర్లు)
2021 లో ఎల్బ్రూస్‌ (5642 మీటర్లు) 

పర్వతారోహణ ఆలోచన ఎందుకు కలిగింది?
అన్విత: ఇంటర్మీడియట్‌ చదువుతుండగా ఓ రోజు పత్రికలలో రాక్‌క్లైంబింగ్‌ ట్రెయినింగ్‌ గురించి చదివాను. నాకూ పర్వతారోహకురాలిగా గుర్తింపు తెచ్చుకోవాలి.. అనే ఆలోచన కలిగింది. అందుకు నా శక్తి సరిపోతుందా అని పరీక్షించుకోవడానికి రాక్‌ కై్ౖలంబింగ్‌ కోసం భువనగిరి ఖిలా వద్దకు వెళ్లాను. అక్కడ శిక్షణ పొందుతున్న విద్యార్థులను చూశాక నేను కూడా అందులో ఎలాగైనా చేరాలనుకున్నాను. మా అమ్మనాన్నలతో ‘కొండలు ఎక్కేందుకు శిక్షణ తీసుకుంటా’ అన్నాను. ముందు వద్దన్నారు. ‘చదువు పూర్తి చేసి, ఉద్యోగం తెచ్చుకోక ఎందుకు ఆ కొండలెక్కడం, అదేమైనా చిన్నపనా’ అన్నారు. తర్వాత, నా పట్టుదల చూసి ‘సరే’ అన్నారు. 7 రోజుల్లోనే బేసిక్‌ కోర్సు పూర్తిచేశాను. ఆ తర్వాత డార్జిలింగ్‌లో 40 రోజుల శిక్షణ చదువుకు ఇబ్బంది కలుగకూడదని సెలవు రోజుల్లో  తీసుకున్నాను. 2018 సెప్టెంబర్‌లో మరోసారి అడ్వాన్స్‌ కోర్సు నేర్చుకున్నాను.

పర్వతారోహణ ద్వారా సాధించాలనుకున్న లక్ష్యం ఏమిటి?
అన్విత: పర్వాతారోహణలో ఎలాగైనా శిఖరం అంచుకు చేరాలన్న పట్టుదల ఉంటుంది. అది ఏ పనినైనా సాధించగలననే ధైర్యాన్ని ఇస్తుంది. దీంతోపాటు ఎవరు చేయని వాటిని నేను చేయాలనుకున్నాను. ప్రపంచంలో ఉన్న ఏడు ప్రధాన పర్వతాలతోపాటు, ఇంతవరకు ఎవరూ ఎంపిక చేసుకోని పర్వతాలను అధిరోహించాలన్నది నా లక్ష్యం. అందులో ప్రధానంగా ఉత్తర అమెరికాలో ఉన్న దెనాలి పర్వతాన్ని ఎక్కాలనేది నా కల. ఈ పర్వతాన్ని భారతీయులు ఎవరూ అధిరోహించలేదు. ఒక దేశంలో ఎల్తైన పర్వతం ఆ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. అలా అన్ని దేశాల్లోని ఎల్తైన పర్వతాలపై మన దేశ జాతీయ జెండాను ఎగురవేయాలి. దాని కోసమే కృషి చేస్తున్నాను.  దేశదేశాల ఎల్తైన పర్వతాల జాబితాను రూపొందించుకున్నాను. అందులో భాగంగానే ఇటీవల రష్యాలోని మౌంట్‌ ఎల్బ్రస్‌ పై 10 మీటర్ల జాతీయ జెండాను ఎగుర వేసిన తొలి భారతీయ యువతిగా పేరొందాను. మైనస్‌ 40 డిగ్రీల ప్రతికూల ఉష్ణోగ్రతలో కూడా పర్వతాలు అధిరోహించడం నాకు ఎంతో ఇష్టంగా ఉంటుంది. పర్వతారోహణ సమయంలో తగిలే గాయాలు కాలంతోపాటు  తగ్గిపోతాయి. కానీ, ఆ ఆనందం జీవితాంతం ఉంటుంది.

ఇప్పటి వరకు ఎన్ని పర్వతాలు అధిరోహించారు? 
అన్విత: ఐదు పర్వతాలు అధిరోహించాను. మొదట 17 ఏళ్ల (2015లో) వయసులో మన దేశంలోని సిక్కింలోని రెనాక్, 2019లో బీసీ రాయ్, ఈ యేడాది లద్డాక్‌లోని కడే, ఆఫ్రికాలోని కిలిమంజారో, రష్యాలోని ఎల్బ్రస్‌ పర్వతాలను అధిరోహించాను. 

దేశ విదేశాల్లో పర్వతారోహణ అంటే ఆర్థిక వనరులు కూడా అవసరం కదా..? 
అన్విత: పర్వతారోహణ శిక్షణ కోసం ఆరేళ్లుగా మా అమ్మనాన్నలే లక్షల రూపాయలు  ఖర్చు చేశారు. రష్యాలోని ఎల్బ్రస్, కిలిమంజారో పర్వతాల అధిరోహణకు స్థానిక నేతలతో పాటు రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్, జిల్లా కలెక్టర్‌ ప్రోత్సాహం మరువలేనిది. 
– యంబ నర్సింహులు, యాదాద్రి, సాక్షి 

కుటుంబ నేపథ్యం
మాది సాధారణ రైతు కుటుంబం. భువనగిరి మండలం ఎర్రంబెల్లి గ్రామానికి చెందిన మా తల్లిదండ్రులు పడమటి చంద్రకళ, మధుసూదన్‌రెడ్డి. నాన్న వ్యవసాయం చేస్తారు. అమ్మ భువనగిరిలో అంగన్‌వాడీ టీచర్‌. కఠినమైన పర్వతారోహణ గురించి ముందు భయపడినా, నా పట్టుదలను గుర్తించి అమ్మనాన్నలు ప్రోత్సహించారు. గ్రామం నుంచి భువనగిరికి వచ్చి చదువుకోవడానికి బస్‌ సౌకర్యం లేక ఇబ్బందులు పడ్డాం. అందుకని నేను, అక్క మా చదువుల కోసం భువనగిరిలో ఉంటున్నాం.
– అన్విత

మరిన్ని వార్తలు