దివ్యమైన ప్రతిభ

23 Mar, 2023 05:11 IST|Sakshi

సత్యభామ.. శ్రీ కృష్ణుడు..  వేంకటేశ్వరుడు.. పద్మావతి.. దివ్యమైన పాత్రలన్నింటినీ ఆమె ఆహార్యంతో అందంగా రూపుకడుతుంది.వైకల్యం ఆమె అభిలాషను అడ్డుకోలేకపో యింది. అడుగు కదపలేదు అనుకున్నవారి అంచనాలను ఆవలకు నెట్టి పట్టుదలతో అవరోధాల మెట్లను అధిరోహించింది. రంగస్థల నటిగా గుర్తింపుతో పాటు స్వరమాధురిగానూ పేరొందింది.

కళారంగంలో రాణిస్తూనే దివ్యాంగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ సేవా పెన్నిధిగానూ ప్రశంసలు అందుకుంటోంది.ఆమెప్రతిభకు గుర్తింపుగా మూడుసార్లు రాష్ట్రపతి పురస్కారం వరించింది.ఖమ్మం జిల్లావాసి అయిన డాక్టర్‌ పొట్టబత్తిని పద్మావతి కృషి  ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది.

హైదరాబాద్‌లోని తుర్కయాంజాల్‌ మున్సిపాలిటీలోని మునుగనూరులో ఉంటున్నారు డాక్టర్‌ పద్మావతి. ఆమెకు ఏడాది వయస్సులో పో లియో సోకడంతో రెండు కాళ్ళు చచ్చుబడి పో యాయి. తన పరిస్థితిని చూసి కుటుంబ సభ్యులు ఆమె భవిష్యత్తుపై ఆందోళనకు గురయ్యేవారు. అయితే పద్మావతి ఐదేళ్ల వయస్సులో సెయింట్‌ మేరీస్‌ పో లియో పునరావాసం పర్యవేక్షకురాలు ఆస్ట్రేలియాకు చెందిన క్లారా హీటన్ కు పరిచయం అయ్యారు.

క్లారా దత్తత తీసుకోవడంతో పద్మావతి జీవితం కొత్త మలుపు తిరిగింది. క్లారా పర్యవేక్షణలో పద్మావతికి పలు మార్లు శస్త్ర చికిత్స జరిగింది. పాదాలు, నడుము.. భాగాలు శస్త్ర చికిత్సతో సరి చేశారు. అప్పటి వరకు మంచానికే పరిమితమైన ఆమె క్యాలిపర్సు, కర్రలు సహాయంతో క్రమంగా అడుగులు వేయడం మొదలు పెట్టింది. కాలు కదల్చలేని స్థితిలో మంచం మీద ఉండి చదువులో ప్రతిభ కనబరుస్తూ ఎదిగిన తీరు పద్మావతి మాటల్లో మన కళ్ల ముందు కదలాడుతుంది.

సేవాభిలాష
గానం, నాటక రంగంలో ఉన్న ఆసక్తితో పద్మావతి క్యాలిపర్సు సహాయంతోనే ప్రతిభ కనబరుస్తూ వచ్చారు. సత్యభామ, శ్రీకృష్ణుడు, వేంకటేశ్వరుడు తదితర పాత్రలను సమర్ధంగా పో షించి దేశ వ్యాప్తంగా ప్రదర్శనలు ఇచ్చి, ఎన్నో అవార్డులను పొందారు. వేగేశ్న ఫౌండేషన్‌ ద్వారా సంగీతంలో శిక్షణపొందడంతో పాటు, డిగ్రీ పూర్తి చేసి, ఆ సంస్థలోనే సంగీత ఉపాధ్యాయురాలుగా  దివ్యాంగులకు శిక్షణ ఇస్తున్నారు.

దివ్యాంగులకు సాయపడాలనే సంకల్పంతో మునుగనూరులో పద్మావతి ఇ న్ స్టిట్యూట్‌ ఫర్‌ ద (డిజ్‌) ఏబుల్డ్‌ సంస్థను స్థాపించారు. ఈ సంస్థ ద్వారా దివ్యాంగులకు కంప్యూటర్, నృత్యం, సంగీతం, టైలరింగ్‌.. వంటి వృత్తి విద్యా కోర్స్‌లలో శిక్షణ ఇప్పించి, ఉపాధి కల్పిస్తున్నారు.  

ప్రశంసలు.. పురస్కారాలు 
పద్మావతి ప్రతిభకు ఎన్నో పురస్కారాలు ఆమెను వరించాయి. మూడుసార్లు రాష్ట్రపతి అవార్డులు అందుకున్నారు. ఓ వైపు కళలు, మరోవైపు సామాజిక సేవారంగంలో ప్రతిభ చూపుతున్న ఆమెను రాష్ట్ర ప్రభుత్వం గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది.

సెన్సార్‌ బోర్డు సభ్యురాలుగా, నంది అవార్డు జ్యూరీ కమిటీ మెంబర్‌గా సేవలందించిన పద్మావతి 2017లో రాష్ట్ర ప్రభుత్వం రోల్‌ మోడల్‌ అవార్డును అందుకున్నారు.. కళాకారిణిగా ప్రతిభ చూపినందుకు 2009లో రాష్ట్రపతి అవార్డు లభించింది. వైకల్యంతో బాధపడుతున్నా పలు రంగాలలో రాణించినందుకు గాను 2011లో రాష్ట్రపతి చేతులు మీదుగా స్త్రీ శక్తి పురస్కారాన్ని అందుకున్నారు ఆమె. దివ్యాంగులకు చేస్తున్న సేవను గుర్తించి 2022లో రాష్ట్రపతి సర్వశ్రేష్ట దివ్యాంగ న్  అవార్డుతో సత్కరించారు. 

దివ్యాంగులకు సేవచేయాలనే సదాశయంతో నడుపుతున్న ఇన్‌స్టిట్యూట్‌కు చేయూతనందిస్తే మరిన్నో ప్రయోజన కరమైన పనులను చేయగలననే ఆశాభావాన్ని పద్మావతి వ్యక్తపరుస్తు న్నారు. తన గమనమే ప్రశ్నార్ధకం అవుతుందనుకున్నవారి మాటలను పక్కనపెట్టి, పట్టదలతో ప్రయత్నించి, గెలుస్తున్న ఆమె జీవితం ఎందరికో ఆదర్శమవుతుంది.

– శ్రీరాం యాదయ్య, హయత్‌నగర్, హైదరాబాద్, సాక్షి

మరిన్ని వార్తలు