జ్ఞానదుర్గమ్మలు

23 Oct, 2020 02:45 IST|Sakshi

దుర్గాశక్తికి ప్రతిరూపం సరస్వతీదేవి. సరస్వతీదేవి స్వరూపాలు.. ఈ తొమ్మిదిమంది ‘నీట్‌’ టాపర్‌లు. ఆకాంక్ష.. స్నికిత.. అమ్రిష చైతన్య.. ఆయేష.. సాయి త్రిష మానస.. లులు.. ఇషిత.. ప్రతికూలతలను జయించి.. విజయం సాధించిన జ్ఞానదుర్గమ్మలు.

ఈ ఏడాది సెప్టెంబరు 13, 14 తేదీలలో ‘నీట్‌’ పరీక్ష రాసిన 13 లక్షల 60 వేల మంది అభ్యర్థుల అందరి లక్ష్యం ఒక్కటే. మంచి కాలేజ్‌లో మెడిసిన్‌లో సీటు సాధించడం. లక్ష్యం ఒక్కటే కానీ, లక్ష్యాన్ని చేరుకునేందుకు చేసిన సాధనలో ఒక్కొక్కరిదీ ఒక్కొక్క అనుభవం. ఎవరి పరిస్థితులు వారివి. అననుకూలతలు, అవరోధాలు, అవాంతరాలను దాటుకుని పరీక్ష రాసే తేదీ వరకు వచ్చినవారే అంతా. చివరి నిముషంలో పరీక్ష హాలును చేరలేక ఒక ఏడాదిని కోల్పోయిన వారూ ఉన్నారు. ఈసారి పరీక్ష రాసినవాళ్లలో సగానికన్నా ఎక్కువ సంఖ్యలోనే అమ్మాయిలు ఉన్నారు. 8 లక్షల 80 వేల మంది! సాధారణంగా అబ్బాయిలతో పోల్చి చూస్తే ‘నీట్‌’ (నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రెస్ట్‌ టెస్ట్‌) ప్రిపరేషన్‌కు అమ్మాయిలే ఎక్కువ కష్టపడవలసి వస్తుంది.

వాళ్లకున్నన్ని అనుకూలతలు వీళ్లకు ఉండవు. నీట్‌లో టాపర్‌ నే చూడండి, ఢిల్లీ అమ్మాయి ఆకాంక్ష రోజుకు నూట నలభై కి.మీ. దూరం కోచింగ్‌కి వెళ్లొచ్చింది! ఆమె తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడే కూతురి మెడిసిన్‌ కోచింగ్‌ కోసం భారత సైన్యంలోని తన ఉద్యోగానికి స్వచ్ఛంద పదవీ విరమణ చేసి, గ్రామం నుంచి ఢిల్లీకి కుటుంబాన్ని మార్చారు ఆమె తండ్రి. ఆకాంక్షతో పాటు బాలికల్లో తొమ్మిది తొలి స్థానాల్లో ర్యాంకు సాధించిన స్నికిత, అమ్రిష, చైతన్య, ఆయేష, సాయి త్రిష, మానస, లులు, ఇషిత కూడా ప్రిపరేషన్‌లో ఏదో ఒక ప్రతికూలతను ఎదుర్కొని విజయం సాధించిన జ్ఞాన దుర్గమ్మలే.
 

ఆకాంక్షా సింగ్‌ తర్వాతి స్థానం తుమ్మల స్నికితది. ఆమె ఆలిండియా ర్యాంకు 3. వీళ్లది వరంగల్‌. ఆకాంక్ష పేరెంట్స్‌లానే స్నికిత పేరెంట్స్‌ కూడా కూతురి కాలేజ్‌కి దగ్గరగా ఇల్లు చూసుకున్నారు. స్నికితకు కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఎంత చదివినా గుర్తుండేవి కావు. ఒత్తిడి పెరిగేది. ఆ ఒత్తిడిని తట్టుకోడానికి పాటలు వినేది. అమ్మమ్మకు ఫోన్‌ చేసి మాట్లాడేది. అమ్మాయిల్లో మూడో స్థానంలో నిలిచిన అమ్రిష ఖైతాన్‌ ర్యాంకు 5. తండ్రి, తల్లి, తాతయ్య, అన్నయ్య ఇంట్లో అంతా డాక్టర్‌లే. ‘నువ్వూ డాక్టర్‌ కావాలి’ అని బంధువుల నుంచి ఆమ్రిషకు ఒత్తిడి ఉండేది. వాళ్ల ఒత్తిడి ‘ఫస్ట్‌ అటెంప్ట్‌లోనే వచ్చేయాలి అమ్మాయ్‌’ అని! అయితే ఆ మాటను తను ఒత్తిడిగా కాక, ఒక ఛాలెంజ్‌గా తీసుకున్నాను అంటుంది అమ్రిష.
 

ఆలిండియా 6వ ర్యాంకు పొంది, అమ్మాయిల్లో నాలుగో స్థానం పొందిన ఏపీ విద్యార్థిని చైతన్య సింధు ఇంట్లో కూడా అంతా డాక్టర్‌లే. బయాలజీ కోసం ఎక్కువ కష్టపడవలసి వచ్చింది తను. ఇంటర్‌ చదువుతున్నప్పుడు ఇంటి మీద బెంగ ఉండేది. అంతా ఉండేది విజయవాడే అయినా, తను ఉండటం హాస్టల్‌లో. ఆ బెంగ పోగొట్టడానికి పేరెంట్స్‌ వచ్చిపోతుండేవారు. సింధు తర్వాత ఐదో స్థానం ఆయేషాది. 12వ ర్యాంకు. కేరళ అమ్మాయి. తండ్రి యు.ఎ.ఇ.లో సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌. గత ఏడాది ఫస్ట్‌ అటెంప్ట్‌లో ఆయేషా సీటు సంపాదించ లేకపోయింది. ఈసారి ఎలాగైనా సాధించాలనే పట్టుతో ఒత్తిడికి లోనయింది. 14వ ర్యాంకు సాధించిన సాయి త్రిషకు అమ్మాయిల్లో ఆరో స్థానం. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరి, న్యూరోసర్జన్‌ అవాలని ఆమె లక్ష్యం.

ఎయిమ్స్‌లో సీటు వచ్చేంత ర్యాంకును తెచ్చుకోగలనా అని కొంత ఆందోళనకు గురైంది. టీచర్స్, పేరెంట్స్‌ కాన్ఫిడెన్స్‌ ఇచ్చారు. అమ్మాయిల్లో త్రిష తర్వాత ఏడో స్థానం మానసది. ఆమె ర్యాంకు 16. రోజుకు 12 గంటలు ప్రిపేర్‌ అయినా, అది సరిపోదేమోనని ఆమె సందేహం. 8, 9 స్థానాల్లో లులు (కేరళ), ఇషిత (పంజాబ్‌) ఉన్నారు. లులు కు 22వ ర్యాంకు, ఇషితకు 24 ర్యాంకు. ఆయేషాలానే లులుకు కూడా ఇది సెకండ్‌ అటెంప్ట్‌. ఇంకో అటెంప్ట్‌ చేయకూడదన్న పట్టుతో కూర్చొని చదివింది. ఇషితకు ఫస్ట్‌ అంటెప్ట్‌లోనే  కొట్టేయాలనే పట్టు. ‘సీటు వస్తుందంటావా.. వస్తుందంటావా’ అని తల్లిని సతాయిస్తుండేది. ‘అమ్మ నా గైడింగ్‌ ఏంజెల్‌’ అంటుంది ఇషిత. 
  

మరిన్ని వార్తలు