భయాన్ని పోగొట్టి.. ఆడుతూ.. పాడుతూ.. లెక్కలు

9 Feb, 2023 20:52 IST|Sakshi

మ్యాథ్స్‌ అంటే స్టూడెంట్స్‌కు ఎప్పుడూ భయమే. వారిలో భయాన్ని పోగొట్టి ఆట, పాటలతో మ్యాథ్స్‌ నేర్పిస్తుంది తెలంగాణలోని సిద్ధిపేట జిల్లా సిరసనగండ్ల జిల్లా పరిషత్‌ పాఠశాల టీచర్‌ రూపారాణి. విద్యార్థుల్లో భయాన్ని పోగొట్టి, లెక్కలు అంటే మక్కువ చూపే విధంగా బోధిస్తున్న ఈ టీచర్‌ ప్రయత్నాన్ని అందరూ మెచ్చుకోవాల్సిందే!

మ్యాథ్స్‌ అంటే కొందరి విద్యార్థుల్లో చెప్పలేనంత భయం ఉంటుంది. కొందరికైతే అదొక ఫోబియా. అదే గేమ్స్‌ అంటే ఎంతో ఇష్టం చూపిస్తారు. విద్యార్థుల్లో ఉన్న భయాన్ని పోగొట్టి వారిలో లెక్కలపై మక్కువ చూపే విధంగా ఈ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఓ కొత్త ఆలోచన చేసింది. ఆ ఆలోచనను వెంటనే ఆచరణలో పెట్టింది.

ఫలితం ఇప్పుడా టీచర్‌ దగ్గర లెక్కల పాఠాలు నేర్చుకున్న పిల్లలకు అంకెలు, సంఖ్యలు, ఆల్‌జీబ్రాలు, కొలతలు, వేగాలు అన్ని మంచినీళ్ల ప్రాయంగా అర్ధమవసాగాయి. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులే కానీ ఇప్పుడు వీరు కార్పొరేట్‌కు ఏ మాత్రం తీసిపోరని నిరూపిస్తున్నారు. రూపారాణి ఇటీవల కేరళ రాష్ట్రం త్రిశూర్‌లో జరిగిన జాతీయ స్థాయి సైన్స్, మ్యాథ్స్‌ ఎగ్జిబిషన్‌లో ప్రతిభ కనబర్చి, టీచర్‌ కేటగిరిలో ప్రత్యేక బహుమతిని సాధించారు.

చార్‌పత్తర్‌తో..
విద్యార్థులు ఆడుకునే చార్‌ పత్తర్‌ ఆటతో గ్రాఫింగ్‌ పాయింట్‌లు ఎలా పెట్టవచ్చో చూపుతున్నారు. ఒక బాక్స్‌లో నాలుగు సమాన బాక్స్‌లు చేసి మధ్యలో నాలుగు రాళ్లు పెట్టి, వాటిని విద్యార్థులు తీసుకునే విధానం ద్వారా గ్రాఫింగ్‌ పాయింటింగ్‌ నేర్పిస్తున్నారు.

డయల్‌ యువర్‌ ఫార్ములాతో ఫార్ములాలను కనుక్కోవడం, మ్యాజిక్‌ ఫార్ములాతో సమస్యలు ఎలా సాధన చేయవచ్చో, సంఖ్య రేఖపై ఆటల ద్వారా కూడికలు, తీసివేత గుణాంకాలను  చేయడం, ఎలక్ట్రికల్‌ లైట్స్‌తో ప్రాపర్టీ ఆఫ్‌ సర్కిల్స్‌.. ఇలా విద్యార్థులకు ఆటలతో అర్థమయ్యే రీతిలో విద్యాబోధన చేస్తున్నారు.

పాటలతో ఎక్కాలు
బతుకమ్మ పాటలతో ఎక్కాలను సులభంగా నేర్చుకునే విధంగా, యానిమేటెడ్‌ డిజిటిల్స్‌ ద్వారా విద్యార్థులకు దృశ్య రూపకంగా సులభంగా అర్థమయ్యేలా చేస్తున్నారు. దీంతో విద్యార్థులు మ్యాథ్స్‌ అంటే భయం పోయి మక్కువ చూపుతున్నారు.

నాన్న స్పూర్తితోనే!
మా నాన్న రాజమౌళి ప్రభుత్వం ఉపాధ్యాయుడిగా రిటైర్‌ అయ్యారు. టూర్‌లకు వెళ్లిన సమయంలో విద్యార్థుల కోసం బొమ్మలను తీసుకువచ్చి, వాటి ద్వారా విద్యా బోధన చేశారు. దీంతో విద్యార్థులూ చదువు పట్ల మక్కువ చూపించేవారు. అలా నాన్న స్ఫూర్తితో నేనూ ఏదైనా చేయాలనుకుని ఆలోచించాను. విద్యార్థులకు ఆటల ద్వారా మ్యాథ్స్‌ను బోధిస్తున్నారు. మానాన్న స్పూర్తితోనే విద్యార్థులకు ఆటలు పాటల ద్వారా మాథ్స్‌ చెప్పుతున్నాను. దీంతో విద్యార్థుల పాస్‌ పర్సంటెజ్‌ బాగా పెరుగుతుంది. సిరసనగండ్ల జెడ్పీ స్కూల్‌లో మ్యాథ్స్‌ టీచర్‌గా ఉన్న నేను ఇటీవల డిప్యూటేషన్‌ పై మూట్రాజ్‌పల్లిలో విధులు నిర్వర్తిస్తున్నాను. ఇక్కడా ఇదే పద్ధతిలో మ్యాథ్స్‌ బోధిస్తున్నాను. 
– పెందోట రూపారాణి 

జాతీయ స్థాయిలో ప్రతిభ
విద్యార్థులకు ఆటలతో మ్యాథ్స్‌ బోధించే విధానాన్ని జాయ్‌ ఫూల్‌ లెర్నింగ్‌ మ్యాథ్స్‌ బై గేమ్స్‌ యూజింగ్‌ ఇన్నోవేటివ్‌ ఐడియాస్‌ పేరుతో ఎగ్జిబిట్‌లను రూపొందించారు. జిల్లా, రాష్ట్రస్థాయిలో ప్రతిభను కనబర్చారు. కేరళ రాష్ట్రం త్రిశూల్‌లో జరిగిన జాతీయ స్థాయిలో ఈ ఎగ్జిబిట్‌లను ప్రదర్శించారు. విశ్వేశ్వరయ్య ఇండ్రస్టియల్‌ టెక్నాలజీ మ్యూజియం తరుపున ప్రత్యేక బహుమతిని అందుకున్నారు.
– గజవెల్లి షణ్ముఖరాజు, సాక్షి, సిద్దిపేట ఫొటోలు: సతీష్‌ కుమార్‌

మరిన్ని వార్తలు