వెరీ గుడ్‌ డూడులర్స్‌

24 Aug, 2022 05:40 IST|Sakshi

రోజూ గూగుల్‌లో ఆకట్టుకునే డూడుల్స్‌ చూస్తుంటాం. అయితే యూత్‌కు అవి ‘ఆహా’లు మాత్రమే కాదు అనేక రకాలుగా ఇన్‌స్పిరేషన్‌లు. డూడులింగ్‌లో తమదైన శైలిని సృష్టించుకుంటున్నారు. విశేషం ఏమిటంటే డూడులింగ్‌ అనేది వారి దృష్టిలో కళాప్రక్రియ మాత్రమే కాదు. ధ్యానం కూడా!   

ఏదో ఒక అవసరానికి యూత్‌ వేళ్లు గూగుల్‌పైన ఉంటూనే ఉంటాయి. ఈ క్రమంలోనే వారిని ‘డూడుల్స్‌’ కట్టిపారేసాయి. క్రియేటివిటీని తట్టి లేపాయి. కోల్‌కతాకు చెందిన శ్రేయ కుందు రోజువారి జీవితానికి సంబంధించిన సంఘటనల్లో నుంచి డూడుల్స్‌ రూపొందిస్తుంటుంది. ‘శ్రేయాడూడుల్స్‌’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఎకౌంట్‌ ఓపెన్‌ చేసింది. ఇప్పుడు శ్రేయాకు వందల సంఖ్యలో ఫాలోవర్స్‌ ఉన్నారు. ‘ఊహించని ఆదరణ ఇది’ అంటుంది శ్రేయ.

ఫన్నీ బ్లాగ్స్, పుస్తకాలు చదవడం, సిట్‌కామ్‌లు వీక్షించడం అంటే ఇష్టపడే శ్రేయ భవిష్యత్‌ లక్ష్యం... డూడులర్‌గా అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకోవడం. భోపాల్‌కు చెందిన తేజస్విని కంప్యూటర్‌ సైన్స్‌ స్టూడెంట్‌. ఎప్పటికప్పుడు గూగుల్‌ డూడుల్స్‌ ఫాలో కావడం అంటే ఎంత ఇష్టమో, తనదైన శైలిలో గీయడం అంటే కూడా అంతే ఇష్టం. ‘సరదాగా పరిచయం అయిన డూడుల్‌ ఇప్పుడు నన్ను నేను సరిచేసుకోవడానికి ఉపకరిస్తుంది. టెన్షన్‌గా అనిపించినప్పుడు, నిరుత్సాహంలో ఉన్నప్పుడు, పరీక్షల సమయంలో ఒత్తిడిగా అనిపించినప్పుడు డూడుల్స్‌ గీస్తుంటాను. ఎంతో రిలాక్స్‌డ్‌గా అనిపిస్తుంది’ అంటుంది తేజస్విని.

సామాజిక మాధ్యమాల్లో పాపులర్‌ అయిన కొందరు డూడులర్స్‌ గురించి...
సాధ్య తన డూడులింగ్‌ స్కిల్స్‌తో నెటిజనులను ఆకట్టుకుంది. వాటర్‌ కలర్స్, కాలిగ్రఫీ తన ప్రత్యేకత. ‘కాలిగ్రఫీలో డూడుల్స్‌ను చూడడం కొత్తగా, ఆకర్షణీయంగా ఉంది’ అంటూ ఆమెపై ప్రశంసల వర్షం కురిసింది. భావోద్వేగాలు, ఇన్‌స్పైరింగ్‌ పాయింట్స్‌ను ఆధారంగా చేసుకొని డూడుల్స్‌ గీస్తుంటుంది సాధ్య. ఆహా అనిపించడానికే కాదు ఆలోచింపజేయడానికి కూడా డూడుల్‌ ఉపయోగపడాలి అనేది ఆమె అభిప్రాయం. ‘వెన్‌ లైన్స్‌ మెట్‌ సర్కిల్స్‌’ అంటున్న సంజమ్‌ బగ్గా డూడుల్స్‌కు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. తన ప్యాషన్‌ను బిజినెస్‌ వెంచర్‌గా మార్చి విజయం సాధిస్తుంది సంజమ్‌. అనఘ దండేకర్‌ డూడుల్స్‌కు ప్రత్యేక ఆకర్షణ ఫ్యాన్సీ ఫాంట్స్, కలర్స్‌.

‘సబ్జెక్ట్‌తో పాటు ఫామ్‌ కూడా బాగుండాలి’ అనేది ఆమె థియరీ. అబ్‌స్ట్రాక్ట్‌ ఫామ్‌ను, డూడుల్‌కు జోడించి ‘డూడుల్‌ డబ్బా’ పేరుతో తన ప్రత్యేకతను చాటుకుంటుంది ఖుష్బు.
ఫైన్‌ ఆర్ట్స్‌ బ్యాక్‌గ్రౌండ్‌ నుంచి వచ్చిన టాంజిల సామాజిక సందేశానికి డూడుల్‌ ను వాహికగా చేసుకుంది. తన దృష్టిలో డూడులింగ్‌ అనేది ఆర్ట్‌ ఫామ్‌ మాత్రమే కాదు అంతకంటే ఎక్కువ. డూడులింగ్‌ తనకు ధ్యానం లాంటిది. చిత్ర అయ్యర్‌కు బాల్యం నుంచి చిత్రకళతో అనుబంధం ఉంది. కాస్త ఆలస్యంగానే ‘డూడుల్‌ మేకింగ్‌’లోకి వచ్చింది. ‘గడ్డు కాలంలో నాకు డూడులింగ్‌ ఎంతగానో ఉపయోగపడింది. ఒకానొక దశలో డిప్రెషన్‌ బారినపడ్డప్పుడు అందులో నుంచి బయటికి రావడానికి బలమైన శక్తిని ఇచ్చింది’ అంటుంది చిత్ర. ఆసక్తి నుంచి సరదాగా మొదలైన డూడులింగ్‌ ఇప్పుడు అనేక రూపాల్లో యూత్‌కు దర్శనమవుతుంది. ఎన్నో రకాలుగా ఉపయోగపడుతూ మరింత దగ్గరవుతుంది. ఆత్మీయనేస్తం అవుతుంది.

మరిన్ని వార్తలు