Pheasant Island: వింత దీవి.. ఆరు నెలలకోసారి దేశం మారుతుంది

4 Dec, 2022 13:52 IST|Sakshi

ఇదో వింతదీవి. ప్రతి ఆరునెలలకు చెరో దేశంలో ఉంటుంది. మనుషులెవరూ ఉండని ఈ చిన్నదీవి పేరు ఫీజంట్‌ దీవి. దీని విస్తీర్ణం 2.17 ఎకరాలు మాత్రమే! స్పెయిన్‌–ఫ్రాన్స్‌ సరిహద్దుల నడుమ బిడసోవా నదిలో ఉన్న ఈ దీవి ఏడాదిలో ఒక ఆరునెలలు స్పెయిన్‌ అధీనంలోను, మరో ఆరునెలలు ఫ్రాన్స్‌ అధీనంలోను ఉంటుంది. ఒక దీవి రెండు దేశాల అధీనంలో చెరో ఆరునెలలు కొనసాగడం ప్రపంచంలో మరెక్కడా లేదు.

ఫీజంట్‌ దీవి ఇలా కొనసాగడం వెనుక చాలా చరిత్రే ఉంది. మనుషులే లేని ఈ దీవిపై ఆధిపత్యం కోసం స్పెయిన్‌–ఫ్రాన్స్‌ దేశాల మధ్య పదిహేడో శతాబ్దిలో హోరాహోరీ పోరాటమే జరిగింది. రెండు దేశాల మధ్య ముప్పయ్యేళ్ల పాటు యుద్ధం కొనసాగింది. యుద్ధకాలంలో పరిష్కారం కోసం పదకొండేళ్ల వ్యవధిలో ఇరవైనాలుగు చర్చా సమావేశాలు జరిగాయి.

చివరకు ఈ దీవి ఆధిపత్యాన్ని చెరో ఆరునెలలూ పంచుకునేలా ఉభయ దేశాలూ 1659లో ఒక ఒప్పందానికి వచ్చాయి. అప్పటి నుంచి ఈ ఫీజంట్‌ దీవి ఒక ఆరునెలలు స్పెయిన్‌ అధీనంలోను, మరో ఆరునెలలు ఫ్రాన్స్‌ అధీనంలోను కొనసాగుతోంది. ఈ దీవి ఏటా ఫిబ్రవరి 1 నుంచి జూలై 31 వరకు స్పెయిన్‌ అధీనంలోను, ఆగస్టు 1 నుంచి జనవరి 31 వరకు ఫ్రాన్స్‌ అధీనంలోను ఉంటుంది.  

చదవండి: జపాన్‌లోనే అత్యంత ప్రమాదకర ఆలయం

చెట్టు నుంచి పుట్టిన శిశువు.. సరస్సు లోతును కనిపెట్టలేదట

మరిన్ని వార్తలు