Miniature Garden: టీ కప్పులో వనాలు పెంచండిలా!

17 May, 2022 16:45 IST|Sakshi

టీకప్పులో వనాలు

వేసవి అనగానే పచ్చదనంతో నిండిన చల్లదనాన్ని ఆస్వాదించాలనుకుంటాం. అపార్ట్‌మెంట్‌ సంస్కృతి వచ్చాక అందుకు తగినట్టు ఇండోర్‌ ప్లాంట్స్‌కి ఎక్కువ ప్రాముఖ్యం పెరిగింది. ఒకే విధంగా ఉండే ప్లాంట్స్‌ కళను కొంచెం భిన్నంగా మార్చాలనుకునేవారికి కప్పులో మొక్కల పెంపకం బెస్ట్‌ ఐడియా అవుతుంది.

ఇంటి అలంకరణలో కొత్తదనం నింపుతుంది. వినడానికి కొంచెం విడ్డూరంగా ఉన్నా ఇది నిజం. టీ కప్పుతో ఇంటి అలంకరణ మినియేచర్‌ గార్డెన్‌గానూ అలరారుతోందిప్పుడు. 

రీ సైక్లింగ్‌ కప్స్‌: రకరకాల డిజైన్లలోని పింగాణీ కప్పులు చూడగానే ఆకట్టుకుంటాయి. వాడి వాడి కొన్ని డిజైన్స్‌ కళ మారుతాయి. మరికొన్ని కప్పులు  విరిగిపోతాయి. అప్పుడు వీటిని పడేయకుండా గ్లూతో అతికించి, మట్టి పోసి, మొక్కలను పెట్టొచ్చు. తక్కువ ఎండ తగిలే చోట ఈ కప్పు ప్లాంట్‌ను సెట్‌ చేస్తే చూడటానికి ఆకర్షణీయంగానూ ఉంటుంది. గది అలంకరణలో కొత్త మార్పూ చోటుచేసుకుంటుంది. 

ఫ్రేమ్‌ కప్‌ ప్లాంట్‌: రీస్లైకింగ్‌ కప్స్‌ని ఒక ఫ్రేమ్‌కి సెట్‌ చేసి గోడకు హ్యాంగ్‌ చేయొచ్చు. లేదంటే ఆ కప్పుల్లో చిన్న చిన్న మొక్కలను అలంకరించి, అప్పుడప్పుడు నీళ్లు స్ప్రే చేస్తే.. పచ్చదనంతో నిండిన వాల్‌ మనసును ఆహ్లాదపరుస్తుంది. 

మినియేచర్‌ గార్డెన్‌: పెద్ద పెద్ద వనాల్ని ఇలా చిన్న చిన్నకప్పుల్లో సృష్టించడమే మినియేచర్‌ గార్డెన్‌. ఈ క్రియేషన్‌ కోసం ఆర్ట్‌ లవర్స్‌ ప్రత్యేక క్లాసులు కూడా తీసుకుంటుంటారు. 

టేబుల్‌ డెకొరేషన్‌ కప్స్‌: డైనింగ్‌ టేబుల్‌ని అందంగా అలంకరించడానికి çపువ్వులతో నిండిన ఫ్లవర్‌వేజ్‌ని ఉంచుతారు. కొత్త ట్రెండ్‌.. కప్‌ ప్లాంట్‌ని టేబుల్‌ అలంకరణకు వాడచ్చు. డైనింగ్‌ టేబుల్‌పైనే కాదు సెంటర్‌ టేబుల్స్, రీడింగ్‌ టేబుల్స్‌పై కూడా టీ కప్‌–సాసర్‌ ప్లాంట్స్‌ చూడముచ్చటగా ఉంటాయి. 

ఆర్టిఫిషియల్‌ ప్లాంట్స్‌: టీ కప్పుల్లో మొక్కలను పెంచేంత ఓపికలేని వారు ఆర్టిఫీషియల్‌ లేదా కాగితం పూల తయారీతోనూ అలంకరించవచ్చు. పర్యావరణహితంగా ఆలోచించేవారు నిరుపయోగంగా ఉన్న  ప్లాస్టిక్‌ వస్తువులకు రీసైక్లింగ్‌ పద్ధతిలో కొత్త మెరుగులు దిద్దవచ్చు. ఇది పిల్లలకు వేసవి క్లాస్‌గానూ ఉపయోగపడుతుంది.  

Upma Bonda Recipe In Telugu: ఉప్మా మిగిలిపోయిందా.. ఇలా రుచికరమైన బోండాలు చేసుకోండి!

మరిన్ని వార్తలు