Best Cushion Cover Ideas: పండగ వేళ పట్టుకుషన్‌

12 Aug, 2022 18:32 IST|Sakshi

ఇంటి కళ పెరగడంలో గోడల రంగులు, ఫర్నిచర్‌ మాత్రమే కాదు చిన్న చిన్న వస్తువులు కూడా ముఖ్య పాత్ర పోషిస్తాయి. వాటిలో ప్రధానంగా చెప్పుకోదగినవి కుషన్స్‌. ఇల్లు క్యాజువల్‌గా ఉండాలా, లేక పండగ వేళ కళ రెట్టింపు అవ్వాలా అంటే.. సింపుల్‌ చిట్కా అందమైన కుషన్స్‌తో సోఫా లేదా చెయిర్స్‌ను అలంకరించడం. 

కుషన్స్‌ కోసం అదనంగా ఖర్చు పెట్టాలా అని ఆలోచించనక్కర్లేదు. ఇంట్లో ఇప్పటికే ఉన్న పాత కుషన్స్‌కి కొత్త కవర్స్‌ వేసేస్తే సరి. ఈ కవర్స్‌ని కూడా ఎవరికి వారు స్వయంగా డిజైన్‌ చేసుకోవచ్చు కూడా. 

బ్రొకేడ్‌ సిల్క్‌ కవర్స్‌
జరీతో ఉన్న ఏ క్లాత్‌తోనైనా కుషన్‌ కవర్స్‌ని కుట్టొచ్చు లేదా బడ్జెట్‌ను బట్టి కొనుగోలు చేయవచ్చు. ఇవి పండగ వేళ ప్రత్యేకమైన శోభను తీసుకువస్తాయి. 

అమ్మ చీర చెంగే కవర్‌
అమ్మ పాత చీరలను కుషన్‌ కవర్లుగా మార్చేయవచ్చు. కొన్ని చీరలు కొని కట్టకుండా పక్కన పెట్టేస్తుంటాం. లేదంటే, ఎవరైనా కానుకగా ఇచ్చిన చీరలు నచ్చక, అవి అల్మరాలో అడుగుకు చేరి ఉంటాయి. వీటిలో జరీ అంచు ఉన్న చీరలను కుషన్‌ కవర్స్‌గా మార్చుకుంటే ఉపయోగంగానూ, కళగానూ ఉంటాయి. అంతే కాదు, అమ్మ ప్రేమ కుషన్‌ కవర్లపై మరింత ఆకర్షణీయంగా అమరిపోతుంది.

పెయింటింగ్‌ కవర్‌
ఇది కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. కానీ, ప్రయత్నిస్తే సాధించలేనిదేమీ లేదు కాబట్టి ఏదైనా ఫ్యాబ్రిక్‌ పెయింట్‌ను ప్లెయిన్‌ కుషన్‌ కవర్‌మీద వేసి అలంకరించుకోవచ్చు. దీనితో మీ అభిరుచికీ ప్రశంసల వర్షం కురుస్తుంది. 

కలంకారీ కవర్‌
కొన్నింటిని ఏ విధంగానూ మార్చేయాలనిపించదు. వాటిల్లో కలంకారీ ఆర్ట్‌ ఒకటి. కలంకారీ ప్రింట్‌ చీరలు ఉంటే వాటిని కుషన్‌ కవర్‌గా మార్చేసుకోవచ్చు. 

అల్లికల కవర్‌
క్రోషెట్, ప్యాచ్‌ వర్క్‌ కుషన్‌ కవర్స్‌ కూడా ఎంబ్రాయిడరీ పనితనానికి పెట్టింది పేరు. వీటిని మీరుగా తయారుచేయలేకపోయినా ఎప్పుడైనా ఎగ్జిబిషన్స్‌కు వెళ్లిన ప్పుడు కొనుగోలు చేస్తే, వాటిని ప్రత్యేక సందర్భాలప్పుడు అలకంరించి లివింగ్‌ రూమ్‌కు కొత్త అందం తీసుకురావచ్చు. 

రౌండ్‌ కుషన్‌ కవర్స్‌..
ఫ్లోర్‌ మీద వేసుకుని, కూచునే కుషన్స్‌ ఇప్పుడు మార్కెట్లో లభిస్తున్నాయి. వీటి కవర్లు మల్టీ కలర్‌తో ఉంటే గది అందం రెట్టింపు కాకుండా ఉండదు. ఇవి లివింగ్, డైనింగ్‌ హాల్‌కి అనువుగానూ, అట్రాక్షన్‌గానూ ఉంటాయి.  

మరిన్ని వార్తలు