చందమామ రావే... చక్కని పుస్తకం తేవే!

2 Apr, 2021 01:48 IST|Sakshi

 నేడు ఇంటర్నేషనల్‌ చిల్డ్రన్స్‌ బుక్స్‌డే

పిల్లలు టీవీలకే అతుక్కుపోతున్నారు, కంప్యూటర్‌గేమ్స్‌లోనే మునిగిపోతున్నారు...ఇవి నిజాలు అయితే కావచ్చుగానీ సంపూర్ణ నిజాలు మాత్రం కాదు. ఎందుకంటే పుస్తకం మళ్లీ పిల్లల దగ్గరికి నడిచొస్తుంది. పిల్లలు పుస్తకం దగ్గరికి పరుగెత్తుకుంటూ వెళుతున్నారు. మధ్యప్రదేశ్‌లోని సాగర్‌ జిల్లాలో చంద్ర శ్రీవాస్తవ అనే టీచర్‌ ఉన్నారు. శ్రీవాస్తవ స్కూటర్‌ చప్పుడు ఏ పల్లెలో వినిపించినా పిల్లలు పరుగెత్తుకుంటూ వస్తారు. ఎందుకుంటే ఆ స్కూటర్‌ ఎన్నో పుస్తకాలను మోసుకు వస్తుంది. పిల్లలు వాటిని చదివి  తిరిగి భద్రంగా ఇచ్చేస్తారు.

దక్షిణ కశ్మీర్‌ లో దేవిపుర అనే గ్రామంలో పాడుబడిన బస్‌స్టాండ్‌ ఉంది. అక్కడ పనిచేసే ఆర్మీజవాన్‌లు దాన్ని పిల్లల లైబ్రరీగా మార్చారు. ఎటు చూసినా చెట్టు మీద వాలిన సీతకోకచిలకల్లా పిల్లలు! తాము పుస్తకాలు చదువుకోవడమే కాదు తమకు నచ్చిన పుస్తకాల గురించి ఆసక్తిగా స్నేహితులకు చెబుతుంటారు. ‘పిల్లల కాలక్షేపం కోసం ఇది ఏర్పాటు చేయలేదు. పుస్తకాలు చదివే మంచి అలవాటు ను వారిలో పెంపొదించాలని చేశాం. ఇందుకు మేము ఊహించిన దానికంటే ఎక్కువ స్పందన వస్తోంది’ అని సంబరపడుతున్నారు సైనికులు.

ఉత్తరాఖండ్‌లో నానకమట్ట అనే చిన్న ఊళ్లో పిల్లలే పూనుకొని గ్రంథాలయం ఏర్పాటు చేసుకున్నారు.  ఈ విషయం తెలిసి స్వచ్ఛంద సంస్థలు పుస్తకాల రూపంలో వారికి సహాయం అందిస్తున్నాయి. ఆరుబయట పచ్చటి గడ్డిలో పిల్లలు పుస్తకాలు చదువుకుంటున్న దృశ్యం చూస్తే ఆహా! అనిపిస్తుంది. ఢిల్లీ పోలిస్‌ లైబ్రరీ వారు మురికివాడల్లోని పేదపిల్లలకు కథలు, స్ఫూర్తిదాయకమైన జీవితచరిత్ర పుస్తకాలు అందిస్తున్నారు. పిల్లలు వాటిని పోటీపడి మరీ చదువుతున్నారు.

‘పిల్లల్లో మంచివిలువలు రూపుదిద్దుకోవడానికి పుస్తకాలు దోహదం చేస్తాయి’ అంటున్నారు నిర్వాహకులు. ఒడిశాలోని ఒక ఫారెస్ట్‌పార్క్‌లో పిల్లల కోసం ప్రత్యేక గ్రంథాలయం ఏర్పాటు చేశారు. పిల్లలు ఇక్కడికి రాగానే ఎగిరి గంతేస్తారు. రంగురంగుల బొమ్మల పుస్తకాలు చదివి సంతోషిస్తారు. ఇక మన హైదరాబాద్‌లో ఆక్స్‌ఫర్డ్‌ స్కూల్‌ వాళ్లు స్కూల్‌ బస్సులను పిల్లల గ్రంథాలయాలుగా మార్చి ముఖ్యమైన ప్రాంతాల్లో తిప్పుతున్నారు.

‘పాఠ్యపుస్తకాలకే వాళ్లకు టైమ్‌ సరిపోవడం లేదు. ఇక బయట పుస్తకాలేం చదువుతారు’ అని మనకు మనమే చెప్పుకోవడం కాకుండా పిల్లలకు పుస్తకం రుచి ఒక్కసారి చూపిస్తే అది ఎంత మంచి ఫలితం ఇస్తుందో చరిత్ర నిరూపించింది. నిరూపిస్తూనే ఉంటుంది. మనదే ఆలస్యం!
చదవండి: సముద్ర సదస్సుకు నైన్త్‌ క్లాస్‌ యష్మి..

మరిన్ని వార్తలు