International Tea Day: కూల్‌గా ఉంటే హాట్‌గా, హాట్‌గా ఉంటే కూల్‌గా!

21 May, 2022 10:00 IST|Sakshi

మీరు కూల్‌గా ఉంటే.. హాట్‌గా హాట్‌గా ఉంటే  కూల్‌గా  క్షణాల్లో మార్చేస్తుంది. అంతేనా వాన కురిసినా.. ఫ్రెండ్స్‌తో గాసిప్‌ టైం అయినా..తలనొప్పి వచ్చినా...  పరీక్షలకు ప్రిపేర్‌ కావాలన్నా.. అంతెందుకు పొద్దున లేవగానే మన బుర్రలో వచ్చే ఏకైక థాట్‌ టీ. ఫ్రెష్‌గా వేడి వేడి టీ  పడందే రోజు మొదలుకాదు చాలా మందికి. టీ అంటే కేవలం ఒక రిఫ్రెష్‌ డ్రింకే మాత్రమేనా. కానే కాదు..అదొక సెంటిమెంట్‌..ఎమోషన్‌. ప్రతి సంవత్సరం మే 21న అంతర్జాతీయ టీ దినోత్సవాన్ని జరుపుకుంటారు. అసలు మే నెలలోనే  ఈ డేను  ఎందుకు జరుపుకుంటారు?  దీని వెనకాల హిస్టరీ  ఏంటి?


 
మే 21న అంతర్జాతీయ టీ దినోత్సవంగా ప్రపంచవ్యాప్తంగా నిర్వహించాలని టీ బోర్డ్ ఆఫ్ ఇండియా సూచన మేరకు భారత ప్రభుత్వం యూఎన్‌ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్‌కి ప్రతిపాదించింది.అలా తొలి ఇంటర్నేషనల్‌ టీ దినోత్సవాన్ని 2005లో ఢిల్లీలో నిర్వహించారు.ఎందుకంటే చాలా దేశాలలో ఈ నెలలోనే టీ ఉత్పత్తి సీజన్ ప్రారంభమవుతుంది. తేయాకు కార్మికుల సురక్షిత పని పరిస్థితులు, సరైన వ్యాపార నిర్వహణతోపాటు తేయాకు ఉత్పత్తిని మెరుగుపరిచే పరిస్థితులపై అవగాహన కల్పించడమే దీని  ప్రధాన ఉద్దేశం.

ఈ నేపథ్యంలోనే ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ప్రతి  ఏడాది మే 21న అంతర్జాతీయ టీ దినోత్సవాన్ని పాటించడం ఆనవాయితీగా వస్తోంది. అంతర్జాతీయ టీ దినోత్సవం అనేది సాంస్కృతిక వారసత్వం, ఆరోగ్య ప్రయోజనాలు, టీ ఆర్థిక ప్రాధాన్యతను సెలబ్రేట్‌ చేసుకోవడం, తేయాకుఉత్పత్తిని రక్షించి, దాని ప్రయోజనాలను ముందు తరాలకు అందించేలా   'ఫీల్డ్ నుండి కప్పు వరకు'   అనే నినాదంతో  ఈ డేను నిర్వహిస్తారు.

ఇండియాతోపాటు ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వినియోగించే వాటిల్లో టీ కూడా ఒకటి. 2007లో టీ బోర్డ్ ఆఫ్ ఇండియా నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం, భారత దేశంలో ఉత్పత్తి చేయబడిన మొత్తం టీలో 80 శాతం  ఇండయన్సే వినియోగిస్తున్నారు. ఇక్కడ 5వేల సంవత్సరాలకు పైగా టీ  మూలాలు విస్తరించి ఉన్నాయట.   టీ అంటే ఒక  భావోద్వేగం. సంతోషమైనా, ఉత్సాహమైనా, అలసిపోయినా  సందర్భం ఏదైనా   బెస్ట్‌ ఫ్రెండ్‌ టీ.  దానికి చిట పట చినుకుల్లో  పకోడీ తోడైతే ఆహా  ఆ రంగు రుచి వాసనలతో మరో ప్రపంచంలో విహరిస్తాం.  లక్షల మందికి ఉపాధినందిస్తున్న  ఈ తేనీటిని సందర్భాన్ని బట్టి ప్రాంతాన్ని బట్టి  దీనిని అనేక విధాలుగా తయారు చేయవచ్చు. వీటిలో కొన్ని కాశ్మీరీ కహ్వా, అల్లం టీ, తులసి టీ, సులైమాని టీ, రోంగా టీ, మసాలా టీ, లెమన్‌గ్రాస్ టీ, గ్రీన్ టీ. బెల్లం, మిరియాల టీ,  అబ్బో.. ఈ లిస్ట్‌ చాలా పెద్దది. 

మన బాడీ డిటాక్స్ చేసుకోవడానికి కూడా రకరకాల టీలు ఉపయోగపడతాయి. యాంటీ ఆక్సిడెంట్లు , యాంటీ ఇన్‌ఫ్లమేటరీ పదార్థాల సంపూర్ణ మిశ్రం టీ.  హల్దీ టీ రోగనిరోధక శక్తిని పెంచి,  కాలేయాన్ని శుభ్రపరిస్తే.. తేనె నిమ్మకాయ అల్లం దట్టించిన టీ గొంతు నొప్పి , జలుబుకు చక్కటి చిట్కా.  అలాగే హనీ లెమన్ జింజర్ టీ, ఆమ్లా అల్లం టీ ద్వారా విటమిన్‌ సీ దొరుకుతుంది. దీంతో బరువు తగ్గించుకోవచ్చు. డిటాక్స్ డైట్‌లో అల్లం అజ్వైన్ లెమన్ టీ, జింజర్ అజ్వైన్ లెమన్ టీ చేర్చుకుంటే బరువు తగ్గే ప్రక్రియ వేగవంత మవుతుందని నిపుణులు కూడా నమ్ముతున్నారు.  

మరోవైపు సాహసికుడు,టీ ప్రేమికుడు, ఆండ్రూ హ్యూస్ చరిత్రలో అత్యధిక టీ పార్టీని నిర్వహించిన ఘనత సాధించారు. బ్లాక్ , గ్రీన్ టీ, పిప్పరమెంటు, చమోమిలే వంటి టీలను ఆయన అందించారట. నేపాల్‌లోని మౌంట్ ఎవరెస్ట్ క్యాంప్ 2, మే 5, 2021న 6,496 మీటర్ల ఎత్తులో, ఆండ్రూ 15 మంది అధిరోహకుల బృందంతో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు.  మరి మీరు కూడా  మంచి టీ పార్టీతో మీ స్నేహితులతో ఇంటర్నేషనల్‌ టీ డేని ఎంజాయ్‌ చేయండి.

మరిన్ని వార్తలు