Yoga: డిప్రెషన్‌కు ఔషధ యోగం!

19 Jun, 2021 12:37 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

యోగా ఎంత మంచిదో ఇప్పటికీ మనకందరికీ తెలుసు. అంతేకాదు... పరిశోధనలూ, అధ్యయనాలూ జరుగుతున్న కొద్దీ మన యోగా తాలూకు ప్రాముఖ్యం కొత్త కొత్త విషయాలతో మాటిమాటికీ ప్రపంచానికి తెలియవస్తూనే ఉంది. ఇప్పుడు మళ్లీ మరోసారి కొత్తగా పాశ్చాత్యుల పరిశోధనల్లో సైతం యోగా గురించి మరో అంశం తాజాగా వెలుగుచూసింది. 

గర్భం ధరించిన యువతుల్లో అనేక హార్మోన్ల మార్పుల వల్ల భావోద్వేగాల మార్పులు (మూడ్‌ స్వింగ్స్‌) సాధారణం. అయితే ప్రతి ఐదుగురు గర్భవతులను పరిశీలిస్తే... వారిలో ఒకరికి ఈ మార్పులు చాలా తీవ్రంగా కనిపిస్తుంటాయి. ఇటీవల మిషిగాన్‌ యూనివర్సిటీ పరిశోధకుల అధ్యయనంతో ఈ మూడ్‌ స్వింగ్స్‌కు ఒక ఆరోగ్యకరమైన పరిష్కారం కనిపిస్తోంది. గర్భవతుల్లో ఒత్తిడిని ఎంత ఎక్కువగా తగ్గించగలిగితే... మూడ్‌ స్వింగ్స్‌ తీవ్రత అంతగా తగ్గుతుందని పరిశోధక బృందం తెలుసుకున్నారు. మూడ్‌ స్వింగ్స్‌ కారణంగా కలిగే డిప్రెషన్‌  లక్షణాల (డిప్రెసివ్‌ సింప్టమ్స్‌) ను నివారించేందుకు ఒత్తిడిని తొలగించేలా స్ట్రెస్‌ బస్టర్‌ షెడ్యూల్‌ను రూపొందించారు.

ఈ అధ్యయన బృందానికి నేతృత్వం వహిస్తున్న మారియా ముజిక్‌ మాట్లాడుతూ ‘‘భారతీయుల యోగా మంచి స్ట్రెస్‌ బస్టర్‌ అని మనం గతంలోనే విని ఉన్నాం. అయితే అప్పట్లో దీన్ని పూర్తి తార్కాణాలతో నిరూపించేలా పరిశోధన ఫలితాలేమీ లేవు. దాంతో వాటి ఫలితాలు ఎలా ఉంటాయన్న విషయాలను రికార్డు చేసే పనిలో పడ్డాం. ఈ పనిలో మాకోవిషయం తెలియవచ్చింది. గర్భవతులు అనుసరించదగిన ఆరోగ్యకరమైన, సురక్షితమైన యోగా ప్రక్రియలతో అటు తల్లికి, ఇటు బిడ్డకు మేలు జరుగుతుందని మా అధ్యయనంలో తేలింది’’ అన్నారు.


కొత్తగా తల్లి కాబోయే యువతుల్లో హార్మోన్ల మార్పుల వల్ల మానసిక సమస్యలు రావడం చాలా సాధారణం. అయితే వీటికి చికిత్స చేయకుండా అలాగే వదిలేయడం వల్ల తల్లికీ, బిడ్డకూ హాని చేకూరడానికి అవకాశాలు ఎక్కువ. పైగా ఇలాంటి మహిళల్లో తల్లీ, బిడ్డా బరువు కోల్పోవడం, ప్రీ ఎక్లాంప్సియా, నెలలు నిండకముందే కాన్పు కావడం వంటి దుష్పరిణామాలు సంభవించవచ్చు. అయితే గర్భవతులు పాటించదగిన సురక్షితమైన యోగా ప్రక్రియలు ఇలాంటి దుష్పరిణామాలను నివారించడమే గాక... తల్లికీ, బిడ్డకూ మధ్య మంచి ప్రేమానురాగాలను కూడా మరింత ఇనుమడింపజేస్తాయని మారియా ముజిక్‌ పేర్కొన్నారు.


ఈ అధ్యయనంలో 1226 మంది గర్భిణులు రోజూ 90 నిమిషాలపాటు యోగా చేయడం వల్ల కడుపులోని పిండం మరింత ఆరోగ్యంగా పెరుగుతున్నట్లు తెలిసింది. యోగా చేసే తల్లులు ఈ మార్పులను సులభంగా గుర్తిస్తున్నట్లుగా కూడా తేలింది. అయితే గర్భవతులు అనుసరించాల్సిన యోగా ప్రక్రియలను కేవలం నిపుణులైన యోగా టీచర్ల సమక్షంలోనే ఆచరించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

చదవండి: ఆమెకు సముద్రమే అన్నం ముద్ద

మరిన్ని వార్తలు