International Yoga Day 2021: ధ్యానం... ఒక యోగం

21 Jun, 2021 07:43 IST|Sakshi

ఈ ప్రపంచాన్ని నడిపించే అనంతమైన శక్తి ఒకటుంది. దానిని తెలుసుకుని, ఆ శక్తిని చేరుకోవడానికి మార్గమే ధ్యానం. ఆ ధ్యానం యోగంలో భాగం. ధ్యానం అంటే మనసులోకి చేసే ప్రయాణం. ఆ ప్రయాణం ఎందుకో, ఎలా చేయాలో తెలుసుకున్నవారు మానసికంగానూ, శారీరకంగానూ దృఢంగా ఉండగలరు.

ఆది పరాశక్తి నుంచి త్రిమూర్తుల వరకు మహర్షుల నుంచి మహాయోగుల వరకు ప్రతి ఒక్కరూ ధ్యానయోగులే. మనమందరం ధ్యానించేది ఆ దేవుళ్లనే కదా, మరి ఆ దేవుళ్లు ధ్యానించేది ఎవరిని అన్న సందేహం కలగటం సహజం. దేవతలకన్నా బలమైన, మహత్తరమైన మహాశక్తి మరోటి ఉంది. ఆ శక్తే మనసు. ఆ మనసు బలంగా ఉన్నప్పుడే ఏ పనైనా చేయగలం.

అసలు మనం ఏ పని చేయాలన్నా మనస్సు సహకరించనిదే ముందుకు పోలేం. మనస్సును అదుపు చేయడానికి,  జయించడానికి ముఖ్య సాధనం ధ్యానం. నీరు ఏ పాత్రలో ఉంచితే ఆ పాత్ర ఆకారాన్ని బట్టే  మనస్సు కూడా ఏ వస్తువుపై లగ్నమైతే ఆ వస్తువు రూపాన్ని సంతరించుకుంటుంది. దివ్యత్వాన్ని ధ్యానించే మనస్సు నిర్విరామ భక్తిభావంతో దానినే ధారణ చేస్తుంది. అంతరాయం లేని విద్యుత్‌ సరఫరాతో విద్యుద్దీపంలో తీగె వెలిగినట్టే, ధ్యానంతో మనసు తేజోమయమవుతుంది. 
– డి.వి.ఆర్‌.

మౌనంగా ధ్యానం చెయ్యి. ఈ బాహ్య ప్రపంచపు విషయాలేవీ నీకు అంతరాయం కలిగించకుండా చూసుకో. నీ మనస్సు అత్యున్నత స్థితిలో ఉన్నప్పుడు, దాని గురించి నీకు చింత ఉండదు. మౌనంలో శక్తిని సమీకరించుకుని శక్తిజనక కేంద్రంగా మారు.
– స్వామి వివేకానంద

మరిన్ని వార్తలు