Doctor Preeti Reddy: తనను తాను చెక్కుకున్న శిల్పం!

19 Nov, 2022 14:02 IST|Sakshi

‘విద్య... వైద్యం అందరికీ అందుబాటులో ఉండాలి’ డాక్టర్‌ ప్రీతి తనకు తానుగా నిర్దేశించుకున్న లక్ష్యం ఇది. ఆమె లక్ష్యసాధనకు భరోసాగా నిలిచింది అత్తిల్లు.
ఉచితంగా పురుడు పోసి డెలివరీ కిట్‌ ఇస్తోంది. ఆడపిల్లను కన్న... తల్లికి ప్రోత్సాహకం ఇస్తోంది. యోగసాధన... నాట్యసాధనతో... తనను తాను పరిపూర్ణం చేసుకుంటోంది.


ఒక డాక్టర్‌ యోగసాధన చేస్తే యోగాసనం వల్ల దేహం ఏ రకంగా ప్రభావితమవుతుందో అధ్యయనం చేయగలుగుతారు. అలాగే ఓ డాక్టర్‌ శాస్త్రీయ నాట్యసాధన చేస్తే ఒక్కో నాట్య భంగిమ ఏరకంగా ఆరోగ్యకారకమో అవగాహన చేసుకోగలుగుతారు. ఈ రెండూ సాధన చేస్తున్నారు డాక్టర్‌ ప్రీతీరెడ్డి. వైద్యం చేసే డాక్టర్‌ ఎప్పుడూ ప్రశాంతంగా, ప్రసన్నంగా ఉండాలి, అలాగే నిత్యచైతన్యంతో ఉత్సాహంగానూ ఉండాలి. అప్పుడే పేషెంట్‌లు ఆ డాక్టర్‌ దగ్గర వైద్యం చేయించుకోవడానికి ఇష్టపడతారు. పేషెంట్‌ మనసు చూరగొనడమే డాక్టర్‌ అంతిమలక్ష్యం కావాలి. అందుకే డాక్టర్‌లకు యోగసాధన చాలా అవసరం అంటారామె. ఇక భరతనాట్యం ప్రాక్టీస్‌ గురించి చెబుతూ తన బాల్యాన్ని గుర్తు చేసుకున్నారు.


సినీగీతాల భరతనాట్యం!

‘‘మాది కర్నాటకలోని హుబ్లి. అమ్మ సైంటిస్ట్, నాన్న డాక్టర్‌. ఇద్దరికీ పూనాలో ఉద్యోగం. నా ఎల్‌కేజీ నుంచి పీజీ వరకు పూనాలోనే. మా అమ్మకు భరతనాట్యం ఇష్టం. నాను చిన్నప్పటి నుంచి శిక్షణ ఇప్పించింది. ప్రాక్టీస్‌తోపాటు నాక్కూడా ఇష్టం పెరిగింది. కానీ మా పేరెంట్స్‌కి సమాజానికి ఉపయోగపడే సర్వీస్‌లనే వృత్తిగా ఎంచుకోవడం ఇష్టం. వారి జీవితలక్ష్యం అలాగే ఉండేది. శాస్త్రవేత్తగా పరిశోధనలు చేసినా, డాక్టర్‌గా వైద్యం చేసినా సమాజానికి సర్వీస్‌ ఇచ్చే రంగాలే. నాక్కూడా డాక్టర్‌ కావాలనే కోరిక స్థిరపడింది. కళాసాధనను అభిరుచిగా అయినా కొనసాగించాలనే ఆకాంక్ష అమ్మకి. నా డాన్స్‌ ప్రాక్టీస్‌ మీద ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టేది. ఆమె ఆరోగ్యం దెబ్బతిని ట్రీట్‌మెంట్‌లో ఉన్నప్పుడు కూడా నా డాన్స్‌కు అంతరాయం రానిచ్చేది కాదు.

నాకు పద్నాగేళ్లున్నప్పుడు అమ్మ ఈ లోకం వదిలి వెళ్లిపోయింది. అమ్మకు ఇష్టమైన కళ కాబట్టి భరతనాట్యం కొనసాగించాను. సంప్రదాయ భరతనాట్యంలో ప్రయోగాలు కూడా చేస్తున్నాను. తెలుగు సినిమా పాటలను భరతనాట్యంలో కంపోజ్‌ చేయడం నాకు అత్యంత సంతృప్తినిచ్చిన ప్రయోగం. నభూతో అని చెప్పగలను. మా యూనివర్సిటీకి అతిథిగా మెగాస్టార్‌ చిరంజీవి గారొచ్చినప్పుడు ప్రదర్శన ఇచ్చాను. ఆయన పాటల్లో బాగా ఆదరణ పొందిన 29 పాటలను ఎంచుకుని చేసిన ఫ్యూజన్‌ అది. ఆ రోజు అక్టోబర్‌ 29. అందుకే 29 పాటల థీమ్‌ తీసుకున్నాను. 20 నిమిషాల్లో పూర్తయ్యేటట్లు పాటల పల్లవులను మాత్రమే తీసుకున్నాను. ఆ నాట్యసమ్మేళనాన్ని చిరంజీవిగారికి అంకితం చేశాను. ఆ పెర్‌ఫ్మార్మెన్స్‌ చిరంజీవి గారు స్టాండింగ్‌ ఒవేషన్‌ ఇచ్చారు. నాకది గొప్ప ప్రశంస. 


అమ్మాయి పుడితే బహుమతి!

డాక్టర్‌గా వైద్యం చేయడానికి మాత్రమే పరిమితం కాకూడదని, ఇంకా ఎక్కువగా ఏదైనా చేయాలనిపించింది. భగవంతుని దయ వలన వెసులుబాటు కూడా వచ్చింది. నా ఆలోచనలు, ఆశయాలను మా గ్రూప్‌లోని టీచింగ్‌ హాస్పిటళ్లలో ఒక్కటోక్కటిగా చేరుస్తూ వచ్చాను. అలా వచ్చినవే... ఫ్రీ ట్రీట్‌మెంట్, అమ్మాయి పుడితే ఐదువేలు నగదు బహుమతి. కరోనా సమయంలో మేము ఉచితంగా వైద్యం చేశాం. డెంటల్‌ హాస్పిటల్‌లో రోజుకు 250 మందికి ఉచిత వైద్యంతోపాటు 750 బెడ్‌లున్న టీచింగ్‌ హాస్పిటళ్లలో కూడా వైద్యం ఉచితమే. అలాగే తల్లీబిడ్డలకు అవసరమయ్యే వస్తువులతో కిట్‌ ఇవ్వడం కూడా. విద్యాసంస్థల డైరెక్టర్‌గా ఒక మహిళ ఉన్నప్పుడు నిర్ణయాలు కూడా ఉమెన్‌ ఫ్రెండ్లీగా ఉంటాయనడానికి నిదర్శనం నేనే. ప్రతి విజయం వెనుక ఓ మహిళ ఉంటుందనే నానుడి నూటికి నూరుశాతం నిజం. నా సక్సెస్‌లో తొలి అడుగులు వేయించింది మా అమ్మ. తెలుగింటి కోడలిగా హైదరాబాద్‌కి వచ్చిన తర్వాత అత్తమ్మ నాకు అమ్మయింది. నన్ను, నా బిడ్డలను తన బిడ్డల్లాగా చూసుకుంటూ నాకు ప్రతి విషయంలోనూ కొండంత అండగా ఉన్నారు. కెరీర్‌ పరంగా నన్ను నేను మలుచుకోవడానికి తగిన భరోసా ఇచ్చారు’’ అన్నారు డాక్టర్‌ ప్రీతి.

సమాజానికి తిరిగి ఇవ్వాలి!
గ్రీన్‌ ఇండియా మూవ్‌మెంట్‌లో కూడా చురుగ్గా ఉంటారు డాక్టర్‌ ప్రీతి. పచ్చటి భారతావని కోసం మొక్కలు నాటడం సంతృప్తినిస్తుందన్నారు. వైద్యరంగానికి ఆమె అందిస్తున్న విశిష్టసేవలకు గాను డాక్టర్‌ ప్రీతి ‘బెస్ట్‌ సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ ఇన్‌ తెలంగాణ, ఉమెన్‌ ఎంపవర్‌మెంట్‌ ఎంట్రప్రెన్యూర్‌ అవార్డు’ అందుకున్నారు. ‘ప్రతి ఒక్కరూ తమవంతుగా సమాజానికి తిరిగి ఇవ్వాలి, అప్పుడే ఆరోగ్యకరమైన, సంతోషకరమైన భారతదేశాన్ని చూడగలం’ అన్నారామె.
–వాకా మంజులారెడ్డి
ఫొటోలు : మోహనాచారి


వైద్యయోగం!

యోగసాధన దేహాన్ని, మైండ్‌ని కూడా శక్తిమంతం చేస్తుంది. సింపథిటిక్‌ నెర్వస్‌ సిస్టమ్‌తోపాటు పారాసింపథిటిక్‌ నెర్వస్‌ సిస్టమ్‌ మీద ప్రభావాన్ని చూపిస్తుంది. మైండ్‌కి రిలాక్సేషన్‌నిస్తూ కామ్‌గా ఉంచుతుంది. పని ఒత్తిడితో వచ్చే పర్యవసానాలను నియంత్రిస్తుంది. ఇది మా డాక్టర్లకు మరీ ముఖ్యం. వైద్యం చేసే వృత్తిలోకి రావడమే ఒక యోగం. ఈ వృత్తికి నూటికి నూరుశాతం న్యాయం చేయడానికి ఉపయోగపడే దివ్యౌషధం యోగసాధన అని నా నమ్మకం. నేను యోగసాధన చేస్తాను. యోగ ఆవశ్యకతను తెలియచేస్తుంటాను. మా అమ్మానాన్నల ఆశయాలకు, అత్తమామల అభిరుచికి తగినట్లుగా నన్ను నేను మలుచుకోవడంలో నాకు యోగ చాలా దోహదం చేసింది.
– డాక్టర్‌ ప్రీతీరెడ్డి, డైరెక్టర్, మల్లారెడ్డి యూనివర్సిటీ, హైదరాబాద్‌

మరిన్ని వార్తలు