Meenakshi Vashist: దీపం వెలిగింది

6 Oct, 2021 08:15 IST|Sakshi

మీనాక్షి వశిష్ట్‌ సాఫ్ట్‌వేర్‌రంగంలో కీలకమైన బాధ్యతలు నిర్వహించింది. ఓ దశాబ్దం గడిచేటప్పటికి ఆ ఉద్యోగంలో అసంతృప్తి మొదలైంది. ఇంకా ఏదో చేయాలి... ఏం చేయాలి? స్పష్టంగా ఒక రూపం రాలేదు, కానీ ఆమె మాత్రం 2010లో ఉద్యోగం మానేసింది. కొత్తగా ఏం చేద్దామా అని ఆలోచించింది. నాలుగ్గోడల మధ్య కూర్చుని ఎంత ఆలోచించినా కొత్త ఆలోచనలేవీ రావడం లేదు. ఇప్పటి వరకు తనకు బాగా తెలిసిన విషయాల చుట్టూనే తిరుగుతోంది మెదడు. కొత్తగా ఏదైనా చూస్తే, కొత్త విషయాలను ఒంట పట్టించుకుంటే అప్పుడు కొత్త ఆలోచనలు రావచ్చు అనుకుంది. అప్పుడు దేశ పర్యటనకు బయలుదేరిందామె.

మనదేశంలోని నగరాలు, పట్టణాలతోపాటు గ్రామాలు, కుగ్రామాలను కూడా చుట్టేసింది.అక్కడి మనుషులతో మాట్లాడింది.అడవుల్లో ఉన్న గ్రామాలను కూడా దగ్గరగా చూసింది. దాదాపుగా ఇరవై కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. ఉత్తరాఖండ్, చమోలి జిల్లాలో ఒక మహిళ జీవనశైలి మీనాక్షిలో కొత్త ఆలోచనకు బీజం వేసింది. ఆమె నివసిస్తున్న ఇంటికి కరెంటు లేదు. ప్రభుత్వం సోలార్‌ ప్యానెల్‌ ఇచ్చింది. కానీ దానిని వాళ్లు సరిగ్గా ఉపయోగించలేకపోతున్నారు. ఆ ఇంట్లో ఒక ట్రాన్సిస్టర్‌ ఉంది. బయటి ప్రపంచంతో ఆ గ్రామాన్ని కలుపుతున్న ఒకే ఒక బంధం అది. అలాంటి గ్రామాలు మరెన్నో ఆమెకు తారసపడ్డాయి. కొన్ని గ్రామాల్లో కరెంటు లైన్‌ ఉంది, కానీ నాణ్యమైన కరెంటు సరఫరా కావడం లేదు. పవర్‌ ప్రాజెక్టుల్లో తయారవుతున్న విద్యుత్‌ మొత్తం వినియోగంలోకి రాకపోవడం లేదు. పెద్ద మొత్తంలో వృథా అవుతోంది. దొంగతనానికి గురవుతోంది. అందువల్ల శివారు గ్రామాలకు సరిగ్గా అందడం లేదు.

అప్పటికి మీనాక్షికి ఏమి చేయాలో స్పష్టంగా ఒక రూపం రాలేదు కానీ, ఎలక్ట్రిసిటీ యుటిలిటీస్‌ రంగంలో కొంత శూన్యత ఉందని, పని చేయడానికి అవకాశం ఉందని మాత్రం అర్థమైంది. గతంలో తనతో పని చేసిన సహోద్యోగులను సంప్రదించింది. వారందరి సహకారంతో మీనాక్షి పది యూనివర్సిటీల్లోని ఇంజనీరింగ్‌ విద్యార్థులను ఒక గొడుగు కిందకు తీసుకువచ్చింది. వారందరి ప్రయోగంతో ఎవన్‌లాట్‌ అనే పరికరం రూపొందింది. అది చూడడానికి పవర్‌ హెచ్చుతగ్గులను క్రమబద్దీకరించే స్టెబిలైజర్‌లాగా ఉంటుంది. ఈ ఎవన్‌లాట్‌ పరికరం ద్వారా పవర్‌ గ్రిడ్‌ నుంచి విడుదలయ్యే విద్యుత్తు ప్రసారంలో లీకేజ్, మాల్‌ ఫంక్షన్, ఫిల్‌ఫరేజ్‌లను అరికట్టవచ్చు. ఈ ప్రయోగం 2018 నాటికి విజయవంతమైంది.

తొలి పైలట్‌ ప్రాజెక్టులో భాగంగా 2019లో ఢిల్లీ నేషనల్‌ క్యాపిటల్‌ రీజియన్‌లో ప్రయోగాత్మకంగా నిరూపణ అయింది. ఆ తర్వాత మరో రెండు పైలట్‌ ప్రాజెక్టుల ద్వారా మంచి ఫలితాలతో ఆమోదయోగ్యమైంది. మొత్తంగా చెప్పాలంటే వృథా అవుతున్న విద్యుత్తును పొదుపు చేయవచ్చన్నమాట. ఆ మిగులు విద్యుత్తు... శివారు గ్రామాలకు చేరుతోంది. కొత్తగా కరెంట్‌ లైన్‌లను విస్తరించడమూ సాధ్యమవుతోంది. తమిళనాడుకు చెందిన మీనాక్షి వశిష్ట్‌ తన ప్రయోగాలకు గుర్‌గావ్‌ను క్షేత్రంగా మార్చుకుంది. ప్రయోగాలు లేకపోతే జీవితం నిస్సారంగా ఉంటుందని నమ్మే మీనాక్షి అప్పటికే ఎలక్ట్రికల్‌ మార్కెట్‌లో ఉన్న దిగ్గజ కంపెనీలకు దీటుగా తాను స్థాపించుకున్న టెక్‌ అన్‌కార్క్‌డ్‌ కంపెనీ సీఈవోగా విజయవంతంగా దూసుకుపోతోంది. 

మరిన్ని వార్తలు