21 ఏళ్లైనా అంతుచిక్కని జర్నలిస్ట్‌ డెత్‌ మిస్టరీ.. హత్యే అని తెలిసినా..!

18 Dec, 2022 14:50 IST|Sakshi

మిస్టరీ

దుష్టులు నిర్మించుకున్న దుర్భేద్యమైన కోటలను కూలగొట్టాలని విఫలయత్నం చేశాడో వీరుడు. కథల్లోనో, సినిమాల్లోనో అయితే.. ఆ వీరుడే గెలిచేవాడు. కానీ ఈ రియల్‌ స్టోరీ.. అతడి మరణాన్నే మిస్టరీగా మలచింది.

1991 ఆగస్టు 10, మధ్యాహ్నం వెస్ట్‌ వర్జీనియాలోని మార్టిన్స్‌బర్గ్‌ సమీపంలోని షెరటన్‌ హోటల్‌ ముందు ఒక్కసారిగా జనం గుమిగూడారు. హోటల్‌ కస్టమర్స్, సిబ్బంది, యాజమాన్యం.. అంతా అక్కడున్నారు. వేగంగా వచ్చి ఆగిన పోలీస్‌ వ్యాన్‌లోంచి పోలీసులు ఒక్క ఉదుటన దుమికి.. ‘ఏ రూమ్‌?’ అన్నారు. సిబ్బందిలో ఒకరు 517 అని చెప్పగానే.. పోలీస్‌ బూట్లు అటుగా పరుగుతీశాయి.

రూమ్‌ నంబర్‌ 517లోని బాత్‌టబ్‌లో ఇన్వెస్టిగేటివ్‌ రిపోర్టర్‌ డానీ కాసోలారో(44) నిర్జీవంగా పడి ఉన్నాడు. అతడి రెండు చేతుల మణికట్లు లోతుగా తెగున్నాయి. ఓ పక్కన రేజర్‌ బ్లేడ్, మరోపక్కన సూసైడ్‌ నోట్‌ కనిపించాయి. నోట్‌ ఓపెన్‌ చేస్తే.. ‘నన్ను ప్రేమించేవారంతా నన్ను క్షమించండి. ముఖ్యంగా నా కొడుకు నన్ను అర్థం చేసుకుంటాడనుకుంటున్నా.. దేవుడు నన్ను ఆహ్వానిస్తున్నాడు’ అని రాసుంది.

డానీ.. 1977లో మాజీ మిస్‌ వర్జీనియా అయిన టెరిల్‌ పేస్‌ను వివాహం చేసుకున్నాడు. ఈ జంటకు ట్రే అనే కొడుకున్నాడు. పదేళ్ల తర్వాత వాళ్లు విడాకులు తీసుకోవడంతో కొడుకు ట్రే బాధ్యతను డానీకే అప్పగించింది కోర్టు. 1970 నుంచి జర్నలిస్ట్‌గా ఉన్న డానీ.. కమ్యూనిస్ట్‌ చైనా నల్లమందును యూఎస్‌లోకి అక్రమంగా రవాణా చేయడం.. వంటి ఎన్నో సమస్యలను వెలుగులోకి తెచ్చి.. ఇన్వెస్టిగేటివ్‌ రిపోర్టర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

డానీ రూమ్‌ మొత్తం క్షుణ్ణంగా వెతికిన పోలీసులకు.. క్రెడిట్‌ కార్డులు, డబ్బులున్న అతని వాలెట్‌ బెడ్‌ మీద సురక్షితంగా కనిపించింది. బలవంతంగా ఎవరైనా రూమ్‌లోకి వచ్చారా? అంటే.. అలాంటి ఆనవాళ్లేమీ లేవు. దాంతో డానీ మరణాన్ని ఆత్మహత్యగా నిర్ధారించేశారు పోలీసులు. రెండు రోజుల తర్వాత సమాచారం అందుకున్న డానీ ఫ్యామిలీ.. అది కచ్చితంగా హత్యేనని మొరపెట్టుకున్నారు. ‘మృతదేహం దొరికిన రోజే ఎందుకు మాకు సమాచారం ఇవ్వలేదు’ అని నిలదీశారు.

దానికి అధికారుల నుంచి ఎలాంటి సమాధానం లేదు. రిపోర్టర్‌గా డానీ జరిపిన వందలాది విచార ణ  పత్రాలు, ఇతర ముఖ్యమైన ఫైల్స్‌.. వేటినీ కుటుంబానికి అందించలేదు. ‘అవన్నీ ఎక్కడా?’ అని ఆరా తీసిన డానీ సోదరుడు టోనీకి.. మృతదేహం దొరికిన హోటల్‌ రూమ్‌లో అవేం దొరకలేదనే సమాధానం వచ్చింది. రక్తపరీక్షల కోసం సూది గుచ్చితేనే భయపడే డానీ.. చేతులను కోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడంటే నమ్మలేమంటూ.. అతడి కుటుంబం పోరాటం మొదలుపెట్టింది.

డానీ మరణానికి కొద్ది రోజుల ముందు.. అతను చాలా మంది స్నేహితులతో.. ‘నేను చాలా పెద్ద కేసుని దర్యాప్తు చేస్తున్నా. త్వరలోనే వెలుగులోకి తెస్తా’ అని చెప్పాడట. నిజానికి ఆగస్ట్‌ 1990లో ఇన్‌స్లా అనే కార్పొరేట్‌ – గవర్నమెంట్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీదారులైన బిల్‌ హామిల్ట¯న్‌Œ , నాన్సీలను ఇంటర్వ్యూ చేయడంతోనే ఆ సాఫ్ట్‌వేర్‌ మీద డానీ పరిశోధన మొదలైందట.

వారు ప్రారంభించిన ‘ప్రామిస్‌’ అనే శక్తిమంతమైన ప్రాసిక్యూషన్‌ సాఫ్ట్‌వేర్‌ ప్రాజెక్ట్‌లో.. చాలా పెద్ద మోసం ఉందని.. తెరవెనుక పెద్ద స్కామ్‌ నడుస్తుందని అనుమానించిన డానీ.. ఆ దిశగా విచారణ మొదలుపెట్టాడు. అప్పటికే ఇన్‌స్లా కంపెనీ సాఫ్ట్‌వేర్‌ను దుర్వినియోగం చేస్తున్నారని.. కొందరు న్యాయశాఖ అధికారులు దీన్ని ఆధీనంలో ఉంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారని.. ఇందులో ప్రభుత్వపెద్దల కుట్ర కూడా ఉందని.. ఆ లింకులు ఇతర దేశాలకూ పాకుతున్నాయని వస్తున్న పుకార్లను కూపీలాగడం మొలుపెట్టాడు డానీ. ఎందరో గూఢచారుల్ని కలసి.. ఎన్నో ఆధారాలను సంపాదించాడు. ఆ క్రమంలోనే ఎన్నో బెదిరింపు కాల్స్‌నూ ఎదుర్కొన్నాడు.

ఆ విషయం తన సోదరుడు టోనీకి చెబుతూ.. ‘ఒకవేళ నేను చనిపోతే, అది ప్రమాదవశాత్తు జరిగిన మరణమని నమ్మవద్ద’ని చెప్పాడట. తను విచారిస్తున్న కుంభకోణానికి ‘ది ఆక్టోపస్‌’ అని పేరు కూడా పెట్టాడట. 

పోలీస్‌ విచారణపై నమ్మకం లేని కుటుంబ సభ్యులు.. హోటల్‌ సిబ్బందిని ఆరా తీయగా మరో నిజం బయటపడింది. డానీ చనిపోయిన రోజు.. పోలీసులు రాకముందే ఎవరో.. ప్రొఫెషనల్‌ క్లీనింగ్‌ వర్కర్స్‌తో డానీ రూమ్‌ని శుభ్రం చేయించారని తేలింది. ఆ క్లీనింగ్‌ వర్కర్లలో ఒకరు మాట్లాడుతూ.. ‘ఆ రోజు రక్తంతో తడిచిన రెండు టవల్స్‌ని మృతదేహం దగ్గర్లో చూశాం. వాటిని అప్పుడే చెత్తలో వేసేశాం. మాకంటే ముందే ఎవరో ఆ రూమ్‌లో నేల మీద పడిన రక్తాన్ని ఆ టవల్స్‌తో తుడిచినట్లు అనిపించింది’ అని చెప్పాడు. అయితే అతడు బహిరంగ సాక్ష్యానికి అంగీకరించలేదు.

ఇక ఆగస్టు 9 సాయంత్రం ఐదున్నరకు.. డానీ తన పక్క గదిలో దిగిన లూనీని పలకరించాడట. ఒక ముఖ్యమైన కేసుకు సంబంధించి ఒక వ్యక్తిని కలవబోతున్నానని చెప్పాడట. తొమ్మిదింటికి లూనీని మళ్లీ కలసిన డానీ.. ఒక ఫోన్‌ కాల్‌ మాట్లాడి వస్తానని  వెళ్లి.. కొన్ని నిమిషాల్లోనే తిరిగివచ్చాడట. ‘బహుశా అవతల వ్యక్తి ఫోన్‌ లిఫ్ట్‌ చేయలేదేమో? తెలియదు. మేం చాలాసేపు మామూలుగా మాట్లాడుకున్నాం’ అని లూనీ చెప్పుకొచ్చాడు. ఆ రోజు రాత్రి డానీ.. సమీపంలోని పిజ్జాహట్‌లో డిన్నర్‌ చేశాడట. అందులోని వెయిట్రెస్‌ డానీని గుర్తుపట్టింది. రాత్రి 10 దాటాక కాసోలారో సమీపంలోని కన్వీనియెన్స్‌ స్టోర్‌లో కాఫీ కొనుక్కుని తాగాడట.

అదే అక్కడివారికి డానీ చివరిసారిగా సజీవంగా కనిపించింది. ఆ తర్వాత ఎవరికీ కనిపించలేదు. మరి ఆ రాత్రి ఏం జరిగింది? మరునాడు మధ్యాహ్నం వరకూ శవాన్ని ఎందుకు గుర్తించలేదు? ఇలా వేటికీ సమాధానాల్లేవు. మరోవైపు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేని ఒక ఆర్మీమన్‌.. డానీ అంత్యక్రియలకు హాజరయ్యాడట. డానీ శవపేటిక మీద గౌరవప్రదంగా ఒక పతకాన్ని ఉంచి అక్కడి నుంచి వెళ్లిపోయాడట. అసలు అతడు ఎవరు? ఎందుకు వచ్చాడు? అతడు నిజంగానే సైనికాధికారా? లేక డానీని చంపిన కిల్లరా? అనేది నేటికీ తేలలేదు.
 
1973లో లాభాపేక్షలేని సంస్థగా ఏర్పడిన ఇన్‌స్లా.. 1981లో లాభాపేక్షతో కూడిన అనుబంధసంస్థలను ఏర్పాటు చేసింది. ఆ తర్వాతే దాని ఆస్తులన్నీ కొత్త సంస్థలకు బదిలీ అయ్యాయి. డానీ మరణం తర్వాత.. ఇన్‌స్లా సంస్థ.. తన సాఫ్ట్‌వేర్‌ను దొంగిలించడానికి ప్రభుత్వమే కుట్ర పన్నిందని, దొంగిలించిన సాఫ్ట్‌వేర్‌ను.. విదేశీ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా గూఢచర్య కార్యకలాపాలకు వినియోగించిందని.. నాసాతో సహా సీ.ఐ.ఏ, డి.ఓ.జీలు ఈ సమాచారాన్ని ఉపయోగించుకున్నాయని.. హత్యల్లోనూ ప్రమేయం ఉందని ఇలా ఎన్నో ఆరోపణలు వచ్చాయి. కొన్ని ఆధారాలు దొరికాయి. కానీ.. 12 సంవత్సరాల సుదీర్ఘన్యాయ విచారణ తర్వాత ఫెడరల్‌ క్లెయిమ్స్‌ కోర్ట్‌ వాటన్నింటినీ కొట్టిపారేసింది. ఇక్కడ 1960 నుంచి 66 వరకూ బిల్‌ హామిల్టన్‌  ఆరేళ్ల పాటు నాసా ఉద్యోగిగా ఉండడం గమనార్హం. -సంహిత నిమ్మన

మరిన్ని వార్తలు