ఫస్ట్‌ ఉమన్‌.. క్లిష్ట పరిస్థితుల్లో గట్టి పోలిస్‌ ఆఫీసర్‌

18 Feb, 2022 00:44 IST|Sakshi
కళా రామ చంద్రన్‌

‘దేశం క్లిష్టపరిస్థితుల్లో ఉంది ఇప్పుడు’ అనేది మన తెలుగు సినిమా డైలాగైతే కావచ్చుగానీ హరియాణాలోని గుర్‌గ్రామ్‌కు వెళితే ‘సిటీ క్లిష్ట పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు’ అనే రియల్‌ డైలాగ్‌ లోకల్‌ లాంగ్వేజ్‌లో అప్పట్లో తరచు వినిపించేది. సిటీ పరిస్థితి క్లిష్టస్థితిలో పడడానికి శాంతిభద్రతల నుంచి ట్రాఫిక్‌ అస్తవ్యస్తతల వరకు రకరకాల సమస్యలు ఉన్నాయి. ఇలాంటి క్లిష్టసమయంలో గుర్‌గ్రామ్‌ తొలి మహిళా పోలిస్‌ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు కళారామచంద్రన్‌.

రెవారి, ఫతేహబాద్, పంచ్‌కుల జిల్లాల సూపరిండెంట్‌ ఆఫ్‌ పోలిస్‌గా పనిచేసినా, ఇంటెలిజెన్స్‌ బ్యూరోలో పనిచేసినా, మేఘాలయాలోని ఈశాన్య ప్రాంత పోలిస్‌ అకాడమీ హెడ్‌గా పనిచేసినా... కళా రామచంద్రన్‌ తనదైన ప్రత్యేకతను సృష్టించుకున్నారు. నిఖార్సయిన పోలిస్‌ ఆఫీసర్‌గా పేరు తెచ్చుకున్నారు.గుర్‌గ్రామ్‌లో చూడచక్కని రోడ్లు ఉన్నాయి.

కానీ ఏంలాభం?
‘వేగమే మా నైజం’ అన్నట్లుగా దూసుకుపోతుంటాయి వాహనాలు. దీనివల్ల యాక్సిడెంట్లు, మరణాలు. మరోవైపు డ్రంకెన్‌ డ్రైవింగ్‌. ఇంకోవైపు స్ట్రీట్‌క్రైమ్స్‌. సైబర్‌క్రైమ్, ఈవ్‌టీజింగ్‌ లాంటి సమస్యలు బోలెడన్ని ఉన్నాయి. ఈ నేపథ్యంలో పోలీసుల నిష్క్రియాపరత్వం మీద వేడివేడి విమర్శ లు కూడా వచ్చాయి.అలాంటి క్లిష్ట  సమయంలో బాధ్యత లు తీసుకున్న కళారామచంద్రన్‌ ‘నగరాన్ని ఏ మేరకు భద్రంగా ఉంచగలరు?’ అనే సందేహాలు రాకపోవడానికి కారణం ఆమెకు ఉన్న వృత్తి నిబద్ధత, మంచిపేరు.

‘క్షేత్రస్థాయి నుంచి పోలిసు పర్యవేక్షణను బలోపేతం చేసే కార్యాచరణకు శ్రీకారం చుట్టాం’ అంటున్నారు కళా రామ చంద్రన్‌. రకరకాల ప్రాంతాలలో పనిచేసిన అనుభవంతో పాటు, భర్త  ఇచ్చిన సూచనలు కూడా గుర్‌గ్రామ్‌ని ‘సేఫర్‌ అండ్‌ బెటర్‌’ సిటీగా మార్చడానికి ఉపయోగపడతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. కళారామచంద్రన్‌ భర్త నవదీప్‌సింగ్‌ సీనియర్‌ ఐపీయస్‌ అధికారి. గుర్‌గ్రామ్‌ పోలిస్‌ కమిషనర్‌గా పనిచేశారు.

మరిన్ని వార్తలు