డైనమిక్‌ ఐపీఎస్‌ ఆఫీసర్‌

3 Jan, 2021 03:59 IST|Sakshi

ఇరవై ఏళ్లలో నలభై బదిలీలు ఉమాభారతి మాజీ సీఎం, మాజీ మంత్రి. హుబ్లీలో ఆమెను అరెస్టు చేయవలసి వచ్చింది! ఎవరున్నారు అరెస్ట్‌ చెయ్యడానికి?! రూప, ఐపీఎస్‌! శశికళ శక్తిమంతురాలైన ఖైదీ. పరప్పన జైల్లో ఆమెను వీవీఐపీలా చూస్తున్నారు. ఈ విషయాన్ని ధైర్యంగా బయటపెట్టిందెవరు? రూప, ఐపీఎస్‌! బెంగళూరు ‘సేఫ్‌ సిటీ’.. వందల కోట్ల ప్రాజెక్ట్‌.

టెండర్‌లలో గోల్‌మాల్‌ జరుగుతోంది. ఆ అవినీతి గుట్టును రట్టు చేసిందెవరు? రూప, ఐపీఎస్‌. ఏం పోలీస్‌ ఆఫీసర్‌! ఎంత పవర్‌ఫుల్‌!! ఆ పవర్‌కు ప్రతిఫలం ఏంటో తెలుసా? ఇరవై ఏళ్లలో నలభై ట్రాన్స్‌ఫర్‌లు!! జనవరి ఒకటిన మళ్లీ ఇంకో బదిలీ. నేరస్థులకు హ్యాండ్‌కఫ్స్‌ వేయవలసిన రూప..‘హ్యాండ్లూమ్స్‌’ ఎండీ సీట్లో కూర్చున్నారు.

రూప 2000 బ్యాచ్‌ ఐపీఎస్‌ ఆఫీసర్‌. కర్ణాటక క్యాడర్‌. యూపీఎస్సీలో ఆలిండియాలో 5వ ర్యాంకు. హైదరాబాద్‌లోనే.. ‘సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ నేషల్‌పోలీస్‌ అకాడమీ’లో ట్రైనింగ్‌ తీసుకున్నారు. ఎం.ఎ. సైకాలజీ చేసి ఐపీఎస్‌ వైపు వచ్చారు. నేరాన్ని, అవినీతిని తేలిగ్గా పసిగట్టేయడం ఆమె సహజ నైజమేమో అనిపిస్తుంది. అందుకే సైబర్‌ క్రైమ్‌ డిపార్ట్‌మెంట్‌కి దేశంలోనే తొలి లేడీ బాస్‌ అయ్యారు రూప! యువతలో స్ఫూర్తిని నింపడానికి తరచు ‘టెడెక్స్‌’ టాక్స్‌ (టెక్నాలజీ, ఎంటర్‌టైన్‌మెంట్, డిజైన్‌) కూడా ఇస్తుంటారు.

ఇరవై ఏళ్ల క్రితమే ఆమె ఐపీఎస్‌ ఆఫీసర్‌ అయినా, ఇప్పటికీ కొత్తగా జాయిన్‌ అయిన ఆఫీసర్‌లానే చురుగ్గా, వేగంగా ఉంటారు. ఉండకూడదని కాదు. ఇరవై ఏళ్లల్లో నలభైసార్లు ఆమె బదిలీ అయ్యారు. ప్రమోషన్‌ మీద కొన్నిసార్లు, ప్రమోషన్‌ పేరుతో చాలాసార్లు. ఆమె తెగింపు కొన్నిసార్లు ప్రభుత్వానికి ఉపయోగపడింది. చాలాసార్లు తలనొప్పి అయింది. హుబ్లీ అల్లర్ల కేసులో విచారణ కోసం వచ్చిన ఉమాభారతిని అరెస్ట్‌ చేయడానికి ప్రభుత్వానికి రూప అవసరం అయ్యారు.

జైళ్ల శాఖ డీఐజీగా ఉన్నప్పుడు శశికళకు ప్రత్యేక సదుపాయాలు అందుతున్నాయని బయటపెట్టినందుకు మాత్రం ప్రభుత్వానికి ఆమె తలనొప్పి అయ్యారు. నెల తిరగ్గానే అక్కడి నుంచి ఆమెను ‘ట్రాఫిక్, రోడ్‌ సేఫ్టీ’ కమిషనర్‌గా బదిలీ చేశారు. తాజా ట్రాన్స్‌ఫర్‌ కూడా అటువంటిదే. నగర మహిళల భద్రత కోసం సౌకర్యాలు కల్పించే ‘సేఫ్‌ సిటీ ప్రాజెక్టు’ టెండర్‌లో ఒక ఏసీపీ డబ్బు మూట కట్టుకుంటున్నాడని ఆరోపించినందుకు అతడిపై ఎంక్వయరీ చెయ్యకుండా (అతడిపై సీబీఐ చార్జిషీటు ఉన్నప్పటికీ) ఆమెను హస్తకళల వస్తూత్పత్తి విక్రయ కేంద్రానికి ఎండీగా బదిలీ చేశారు! బదలీకి ముందు ఆమె కర్ణాటక రాష్ట్రానికి తొలి మహిళా హోంశాఖ కార్యదర్శి! అంతెత్తు నుంచి కిందికి తోసేశారు.

అయితే రూప ఎప్పుడూ హోదాలను ఉన్నత స్థానాలుగా భావించలేదు. ఎంత ఐపీఎస్‌ అయినా, ఐఏఎస్‌ అయినా మనిషిగా ఉండటం కన్నా పెద్ద డిజిగ్నేషన్‌ లేదంటారు ఆమె. ‘‘ప్రభుత్వం నియమించుకున్న ఒక ప్రజాసేవకురాలిని మాత్రమే నేను’ అంటారు. ఇరవై ఏళ్ల క్రితం ధార్వాడ్‌ జిల్లా ఎస్పీగా ప్రారంభమైన రూప కెరియర్‌ అనేక మలుపులు తిరుగుతూ, అనేక శాఖలను తాకుతూ ప్రస్తుతానికి కర్ణాటక హస్తకళాకేంద్రం ‘కావేరీ ఎంపోరియం’కి చేరుకుంది. ‘‘నేనేమీ చిన్నతనంగా భావించడం లేదు. బాధ్యత ఏదైనా బాధ్యతే. తక్కువ ఎక్కువ ఉండదు. కర్ణాటక హోయసల సాంస్కృతిక హస్త కళలకు దేశవ్యాప్త గుర్తింపు ఉంది. లక్షలాది మంది చందనశిల్ప, బిద్రీ లోహ కళాకారుల సంక్షేమం కోసం కృషి చేస్తాను’’ అంటున్నారు రూప.

అయితే మరొకసారి ఆమెను బదిలీ చేయవలసిన అనివార్యతల్ని ప్రభుత్వం ఎదుర్కొనేలా ఉంది! రెండుసార్లు రాష్ట్రపతి అవార్డు పొందిన ఈ పవర్‌ఫుల్‌ సీనియర్‌ పోలీస్‌ ఆఫీసర్‌ను కక్ష సాధింపుగా మాత్రమే ప్రాధాన్యంలేని పోస్టులోకి మార్చారన్న అసంతృప్తి కర్ణాటక ప్రజల్లోనే కాదు, దేశవ్యాప్తంగానూ వ్యక్తం అవుతూ ఉండటమే అందుకు కారణం. రూప, ఐపీఎస్‌ ఈ నెలలోనే తన పోలీస్‌ డ్యూటీలోకి తను మళ్లీ వెనక్కి వచ్చేయొచ్చు. ఈసారి మరింత శక్తిమంతంగా!

మ్యూజిక్‌ ఇష్టం
రూప తండ్రి దివాకర్‌ రిటైర్డ్‌ ఇంజినీర్‌. తల్లి హేమావతి గృహిణి. కర్ణాటకలోని దావణగెరె వారి స్వస్థలం. ఇద్దరే సంతానం. రూప, రోహిణి. ఆమె చెల్లెలు రోహిణి ఐఆర్‌ఎస్‌ ఆఫీసర్‌. రూప పెళ్లి 2003లో మునీష్‌ మౌద్గిల్‌తో జరిగింది. ఆయన ఐఎఎస్‌ ఆఫీసర్‌. ఇద్దరు పిల్లలు అనఘ, రోషిల్‌. రూపకు మ్యూజిక్‌ అంటే ఇష్టం. లలిత సంగీతంలో కొంత ప్రవేశం కూడా ఉంది. 2018లో మహిళా దినోత్సవం కోసం ఒక స్ఫూర్తిదాయకమైన మ్యూజిక్‌ వీడియోను కూడా రూపొందించారు. 2019 లో రిలీజ్‌ అయిన ‘బయలాతడ భీమన్న’ చిత్రంలో ‘కెంపానే సూర్య’ అనే పాట పాడారు.

రూప, ఐపీఎస్‌ : చేనేత అభివృద్ధి కార్పోరేషన్‌ ఎండీగా పదవీ స్వీకారం

మరిన్ని వార్తలు