IPS Officer Arti Singh: ఆర్తిసింగ్‌ ఐపీఎస్‌..ఎంటరైతే చాలు..కాకలు తీరిన క్రిమినల్స్‌ గజగజ వణకాల్సిందే

28 Dec, 2021 00:26 IST|Sakshi
మహిళా పోలీస్‌ కమిషనర్‌ ఆర్తి సింగ్‌

దేశంలో దాదాపు అన్ని పోలీస్‌ కమిషనరేట్‌లలో దాదాపు అందరూ మగ అధికారులే కమిషనర్‌లు. సినిమాల్లో కూడా హీరోయే పోలీస్‌ కమిషనర్‌. కాని ఆర్తి సింగ్‌ ఈ సన్నివేశాన్ని మార్చింది. మహారాష్ట్రలోని అమరావతికి కమిషనర్‌గా చార్జ్‌ తీసుకుంది. ప్రస్తుతం దేశంలో ఈమె ఒక్కతే మహిళా పోలీస్‌ కమిషనర్‌. రావడంతోటే స్ట్రీట్‌ క్రైమ్‌ను రూపుమాపాలనుకుంది. ఎస్‌.. నేను చేయగలను అంటున్న ఆర్తి సింగ్‌ పరిచయం.

2009. దేశానికి ఎలక్షన్లు. కీలకమైన సమయం. మరోవైపు మావోయిస్టులు తమ కదలికలను పెంచారు. మహారాష్ట్రలోని ‘రెడ్‌ కారిడార్‌’ అయిన గడ్చిరోలి ప్రాంతంలో జరిగిన దాడిలో 17 మంది పోలీసులు చనిపోయారు. ఆ సమయంలో అక్కడ గట్టి పోలీస్‌ ఆఫీసర్‌ అవసరం. మావోయిస్టుల దాడులను నిరోధించేందుకే కాదు ఎలక్షన్లు సజావుగా జరిగేందుకు కూడా చర్యలు తీసుకోవాలి. కాని చార్జ్‌ తీసుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఆ సమయంలో పై అధికారులకు తట్టిన ఒకే ఒక్క పేరు ఆర్తి సింగ్‌.

ఆమె 2006 బ్యాచ్‌ ఐపిఎస్‌ ఆఫీసర్‌. పెద్దగా అనుభవం లేదు. పైగా మహిళా ఆఫీసర్‌. ‘ఆమె ఏమి చేయగలదు’ అని గడ్చిరోలి ప్రాంతంలోని సబార్డినేట్‌ పోలీస్‌ ఆఫీసర్లు అనుకున్నారు. కాని ఆమె చార్జ్‌ తీసుకున్నాక వారంతా అవాక్కయ్యారు. ఎందుకంటే ఆ సమయంలో ఆమె మావోయిస్టుల కదలికలను నివారించడమే కాదు... ఎలక్షన్లను బహిష్కరించండి అన్న వారి పిలుపును గెలవనీకుండా గ్రామీణ ప్రాంతాలలో ఓటింగ్‌ జరిగేలా చూసింది.

అందుకే ఆమె పోలీసుల్లో ఫైర్‌ బ్రాండ్‌గా పేరు పొందింది. అందరూ మూడు నుంచి ఆరు నెలల కాలం చేసి ట్రాన్స్‌ఫర్‌ పెట్టుకుని వెళ్లిపోయే చోట ఆమె మూడు సంవత్సరాలు పని చేసింది. ‘నేను చేయగలను అనుకున్నాను. చేశాను’ అంటుంది ఆర్తి సింగ్‌. ఆమె ఆ కాలంలో చాలా ఆయుధాల డంప్‌ను స్వాధీనం చేసుకుంది. అందుకే ఆమె ట్రాన్స్‌ఫర్‌ అయి వెళుతుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సన్మానం చేసి అవార్డులు ఇచ్చి పంపాయి. అదీ ఆర్తి సింగ్‌ ఘనత.

ఆడపిల్ల పుడితే ఏంటి?
ఆర్తి సింగ్‌ది ఉత్తరప్రదేశ్‌లోని మిర్జాపూర్‌. ఆ ప్రాంతంలో ఆడపిల్లల్ని కనడం గురించి స్త్రీలు వివక్ష ఎదుర్కొంటున్నా ఆర్తి కుటుంబంలో అలాంటి వివక్ష ఏదీ ఉండేది కాదు. ఆర్తి ఎంత చదవాలన్నా చదువుకోనిచ్చారు. ‘మా నాన్న సపోర్ట్‌ చాలా ఉంది’ అంటుంది ఆర్తి. ఆమె బెనారస్‌ హిందూ యూనివర్సిటీలో మెడిసిన్‌ చేసి డ్యూటీ డాక్టర్‌గా పని చేస్తున్నప్పుడు గైనకాలజీ వార్డ్‌లో ఆమెకు తల్లులు అందరి నుంచి ఎదురయ్యే ఒకే ఒక ప్రశ్న ‘ఆడిపిల్లా? మగపిల్లాడా?’– ఆడపిల్ల పుడితే వాళ్ల ముఖాలు మాడిపోయేవి.

‘ఆ పరిస్థితి చాలా విషాదం. తల్లిదండ్రులు ఆడపిల్లలను కాకుండా మగపిల్లలను ఎందుకు కోరుకుంటారంటే వారిని రక్షించలేమేమోనన్న ఆందోళనే. అందుకు వారు ఎన్నుకునే ఉపాయం. పెళ్లి. పెళ్లి చేసేస్తే ఆడపిల్ల సేఫ్‌ అనుకుంటారు. దాంతో బాల్య వివాహాలు, అపరిపక్వ వివాహాలు జరిగిపోతాయి. నేను ఈ పరిస్థితిని మార్చాలంటే డాక్టర్‌గా ఉంటే కుదరదనిపించింది. ఐఏఎస్‌ కాని ఐపిఎస్‌ కాని చేయాలనుకున్నాను.

నేను పెద్ద ఆఫీసరయ్యి ఆడపిల్లల తల్లిదండ్రులకు సందేశం ఇవ్వాలనుకున్నాను’ అంటుంది ఆర్తి. అయితే బంగారంలాంటి డాక్టర్‌ చదువు చదివి ఉద్యోగం చేస్తూ కూడా యు.పి.ఎస్‌.సి పరీక్షలకు హాజరవ్వాలనుకోవడం రిస్క్‌. ‘కాని నేను చేయగలను అనుకున్నాను’ అంటుంది ఆర్తి సింగ్‌. ఆమెకు మొదటిసారి అవకాశం రాలేదు. రెండోసారి పంతంగా రాసి ఐ.పి.ఎస్‌ సాధించింది.

కోవిడ్‌ వారియర్‌
మహారాష్ట్రలో మాలేగావ్‌ సెన్సిటివ్‌ ఏరియా. ఏడున్నర లక్షల మంది ఉండే ఈ టెక్స్‌టైల్‌ టౌన్‌లో మత కలహాలు ఏ పచ్చగడ్డీ వేయకనే భగ్గుమంటాయి. దానికి తోడు అక్కడే గత సంవత్సరం కరోనా కేసులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగాయి. ఆ సమయంలో అధికారులకు మళ్లీ గుర్తొచ్చిన పేరు ఆర్తి సింగ్‌. అక్కడ చార్జ్‌ తీసుకోవడం అంటే ఏ క్షణమైనా కరోనా బారిన పడటమే. కాని ఆర్తి సింగ్‌ ధైర్యంగా చార్జ్‌ తీసుకుంది.

అంతేకాదు రెండు నెలల కాలంలో కరోనాను అదుపు చేసింది. ‘నేను డాక్టర్‌ని కనుక ఇల్లు కదలకుండా ఉండటం ఎంత అవసరమో ప్రజలకు సమర్థంగా చెప్పాను. మరోవైపు మా సిబ్బంది ఒక్కొక్కరు కరోనా బారిన పడుతుంటే ధైర్యంగా ఉండటం కష్టమయ్యేది. అయినా సరే పోరాడాను. అలాగే కలహాలకు కారణమయ్యే టిక్‌టాక్‌లు, వాట్సాప్‌ మెసేజ్‌లు కట్టడి చేశాను’ అంటుంది ఆర్తి సింగ్‌.

మహిళా కమిషనర్‌గా
దేశంలోని కమిషనరేట్‌లలో అందరూ మగ ఆఫీసర్‌లు ఉంటే మహారాష్ట్ర ప్రభుత్వం ఆర్తి సామర్థ్యాలను గుర్తించి విదర్భ ప్రాంతంలోని అమరావతి నగరానికి కమిషనర్‌గా వేసింది. ఆ నగరంలో స్ట్రీట్‌ క్రైం ఎక్కువ. రౌడీలు తిరగడం, చైన్‌ స్నాచింగ్‌లు, తన్నులాటలు, ఈవ్‌ టీజింగ్‌లు.. మోతాదు మించి ఉండేవి. ఆర్తి చార్జ్‌ తీసుకున్నదన్న వార్తకే అవి సగం కంట్రోల్‌ అయ్యాయి. మరి కొన్నాళ్లకు మిగిలిన సగం కూడా. ఒత్తిళ్లకు తలొగ్గకుండా పని చేయడం ఆర్తి తీరు. ఇద్దరు పిల్లల తల్లి అయిన ఆర్తి ‘నేను చేయగలను’ అనుకోగలిగితే స్త్రీలను చేయలేనిది ఏదీ లేదు అని నిరూపిస్తోంది.

మరిన్ని వార్తలు