ఆ శక్తి నీలోనే ఉంది!

6 May, 2022 17:26 IST|Sakshi

కొన్ని జీవితాలు కల్పన కంటే ‘చిత్ర’ంగా ఉంటాయి. ఇరాన్‌ కార్టూనిస్ట్‌ అలీ దురాని జీవితం కూడా అంతే. 21 సంవత్సరాల వయసులో దేశం దాటిన అలీ అనుకోని పరిస్థితులలో ఆస్ట్రేలియాలోని ఒక దీవిలో చిక్కుకుపోయాడు. అది మామూలు దీవి కాదు. ఖైదీలను నిర్బంధించే దీవి. నరకానికి నకలుగా నిలిచే దీవి. ఏ స్వేచ్ఛ కోసం అయితే తాను దేశం దాటాడో ఆ స్వేచ్ఛ అణువంత కూడా లేని చీకటి దీవిలో నాలుగు సంవత్సరాల పాటు చిక్కుకుపోయాడు. తన మానసిక పరిస్థితి అదుపు తప్పుతున్న పరిస్థితులలో ‘నన్ను నేను మళ్లీ వెలిగించుకోవాలి’ అనుకున్నాడు. అలా జరగాలంటే ప్రతి వ్యక్తి తనలోని శక్తులను వెదుక్కోవాలి.
అలీ దురానీలో ఉన్న శక్తి ఏమిటి? బొమ్మలు వేయడం.

తన వైట్‌ టీషర్ట్‌పై ఆస్ట్రేలియా పటం వేసి అందులో రెండు కన్నీటిచుక్కలు చిత్రించాడు. ‘ఐయామ్‌ వోన్లీ ఏ రెఫ్యూజీ’ అని రాశాడు. అలా మొదలైంది బొమ్మల ప్రయాణం. కొందరు అధికారులు కరుకుగా వ్యవహరించినా, కొందరు అధికారులు మాత్రం అలీపై సానుభూతి చూపేవారు. ‘బాధ పడకు. నీకు అంతా మంచే జరుగుతుంది’ అని ధైర్యం ఇచ్చేవారు. నరకప్రాయమైన తన జీవితంలో ఇంటర్నెట్‌ అనే అరుదైన అదృష్టం దూసుకువచ్చింది. ప్రతి ఖైదీ వారానికి ఒకసారి నలభై అయిదు నిమిషాల పాటు ఇంటర్నెట్‌ను ఉపయోగించుకునేలా ఆస్ట్రేలియా ప్రభుత్వం దయ తలిచింది.

అక్కడ బలహీనమైన ఇంటర్నెట్‌...అయినప్పటికీ అది అతడికి ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది. తాను గీసిన బొమ్మలను ఫేస్‌బుక్‌లాంటివాటిలో పోస్ట్‌ చేయడం మొదలుపెట్డాడు. సరిౖయెన సాంకేతిక సదుపాయాలు లేక ఈ పని కోసం ఎంత కష్టపడాల్సి వచ్చిందో! స్వేచ్ఛ కోసం తపించే అలీ బొమ్మలు నార్వేకు చెందిన ఇంటర్నేషనల్‌ సిటీస్‌ ఆఫ్‌ రెఫ్యూజీ నెట్‌వర్క్‌(ఐకార్న్‌) దృష్టిలో పడ్డాయి. ఆ సంస్థ చొరవతో ఎట్టకేలకు స్వేచ్ఛాప్రపంచంలోకి వచ్చాడు. వ్యక్తిత్వవికాస తరగతుల్లో అలీ దురాని జీవితం పాఠం అయింది. ప్రసంగం అయింది. ‘నువ్వు అత్యంత బలహీనంగా మారిన పరిస్థితులలో కూడా, నిన్ను బలవంతుడిని చేసే బలం ఎక్కడో కాదు నీలోనే ఉంటుంది. అది నిన్ను చిగురించేలా చేస్తుంది. శక్తిమంతుడిలా మారుస్తుంది’ అనే సందేశాన్ని అలీ జీవితం ఇస్తుంది.

మరిన్ని వార్తలు