పిల్లికూతల మధ్య పులి

12 Sep, 2020 08:30 IST|Sakshi
సెలూన్‌లో హెయిర్‌కట్‌ చేస్తున్న బార్బర్‌ జైనబ్‌

దక్షిణాది ఇరాక్‌లో పురుషులకు పని చేసే తొలి బార్బర్‌గా జైనబ్‌ వార్తలకెక్కింది. స్త్రీలు కొత్త ఉపాధి మార్గాల్లో పయనించడం తెలుసు. అయితే అవన్నీ దాదాపుగా సామాజిక అంగీకారం ఉన్న ఉపాధి మార్గాలే. పురుషులకే పరిమితం వంటి ఉపాధి మార్గాల్లో స్త్రీలు ప్రవేశించినప్పుడు వారికి వ్యతికరేకత రావడం సహజం. ఇక ఇరాక్‌ వంటి దేశంలో ముస్లిం స్త్రీలకు ఇది ఎక్కువ సవాలు కావచ్చని అనుకుంటాం. కాని జైనబ్‌ ఆ సవాళ్లను ఎదిరించి నిలుచుంది.ఇరాక్‌లోని బాబిలోన్‌ ప్రాంతంలో ఉండే ‘హిల్లా’ పట్టణంలో జైనబ్‌ ఒక సంచలనం సృష్టించినట్టే లెక్క. ఎందుకంటే ఆమె హిజాబ్‌ ధరించి ఆ పట్టణంలోని బార్బర్‌ షాప్‌లో పురుషులకు హెయిర్‌ కట్‌ చేస్తుంది. కోరిన వారికి ఫ్యాన్సీ పచ్చబొట్లను కూడా పొడుస్తుంది. ఇద్దరు పిల్లల తల్లి అయిన జైనబ్‌ ఇలాంటి పురుషుల ఉపాధిలోకి రావడం అక్కడి పురుషులకు మింగుడు పడలేదు.‘నేను షాపుకు నడిచినంత సేపు నా వెనుక పిల్లికూతలు కూసి హేళన చేసిన వారే అంతా’ అంది జైనబ్‌.కాని ఆమె అదంతా పట్టించుకోకుండా పని చేయడం మొదలెట్టింది. ‘నా స్నేహితురాళ్లకు ఇదే చెబుతుంటాను. మనం ఉన్నది ఇంట్లో కూచుని గుడ్లు పెట్టడానికి కాదు అని’ అంటుందామె.

జైనబ్‌ పని చేసే కొద్దీ ఆమెను గౌరవించి తల అప్పగించడానికి వచ్చే పురుషులు పెరిగారు. ‘నాకంటూ కొంతమంది కస్టమర్లు ఏర్పడ్డారు’ అంటుంది జైనబ్‌ సంతృప్తిగా. ఆమెకు సెలూన్‌ ఓనర్‌ గట్టి మద్దతుగా నిలిచాడు. ‘కొందరు మత పెద్దలు వచ్చి ఇందుకు అభ్యంతరం చెప్పారు. నేను పట్టించుకోలేదు. ఇరాక్‌ నవ నిర్మాణంలో స్త్రీలు కూడా ముఖ్య భూమిక పోషించేలా మనం వారిని ప్రోత్సహించాలి కదా’ అన్నాడతను.హిజాబ్‌ను ఒక అస్తిత్వంగా భావిస్తూ హిజాబ్‌తోనే ఉద్యోగ ఉపాధి రంగాల్లో కొనసాగాలనే స్త్రీలు భారతదేశంలో ఉన్నారు.

మరిన్ని వార్తలు