ఢిల్లీ ఐరన్‌పిల్లర్‌... తుప్పుపట్టని చరిత్ర

17 Apr, 2021 19:25 IST|Sakshi

ఇది ఢిల్లీ ఐరన్‌పిల్లర్‌...
ఎత్తు 23 అడుగుల ఎనిమిది అంగుళాలు.
వ్యాసం పదహారు అంగుళాలు.
బరువు మూడు టన్నులకు పైమాటే.
తుప్పుపట్టని భారత చరిత్రకు ప్రతీక.
భారతీయ శాస్త్రనైపుణ్యానికి ప్రతిబింబం.

దేశ రాజధానిలో ఇనుప స్తంభం... ఎక్కడ ఉంది? ఢిల్లీ నగరంలో మెహ్రౌలీలో ఉంది. అర్థమయ్యేలా చెప్పాలంటే కుతుబ్‌మినార్‌ ఆవరణలో ఉంది. ఎవరు నిలబెట్టారిక్కడ? తోమార్‌ రాజు అనంగ పాలుడు కావచ్చు, బానిస పాలకుడు ఇల్టుట్‌మిష్‌ కావచ్చు. ఈ కావచ్చుల వెనుక ఇంకా మరెన్నో కావచ్చులున్నాయి. దీనిని ఎవరు నిర్మించారనే ప్రశ్నకు సమాధానం ఈ స్తంభం మీదున్న శాసనాలే. సంస్కృత భాషలో బ్రాహ్మి లిపిలో ఉన్న ఈ శాసనాలను చదవడానికి అక్బర్‌ చేయని ప్రయత్నం లేదు. అయితే ఈ ప్రయత్నంలో సఫలమైంది బ్రిటిష్‌ పాలకులే. 

లండన్‌ ఆర్కియాలజిస్టుల మేధోతవ్వకం తర్వాత బయటపడిన వాస్తవం ఏమిటంటే... ఇది పదహారు వందల ఏళ్ల నాటి స్తంభం. గుప్తుల కాలం నాటిది. రెండవ చంద్రగుప్తుడు క్రీ.శ నాలుగవ శతాబ్దంలో మధ్యప్రదేశ్‌లోని విష్ణుపాద కొండల మీద స్థాపించాడని వెల్లడైంది. ఈ పిల్లర్‌ మీద పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు భారతదేశంలో గుప్తుల కాలం నాటికే లోహశాస్త్రం అత్యున్నత దశకు చేరి ఉండేదని సూత్రబద్ధంగా నిర్ధారించారు. అంత పెద్ద పుస్తకాలు చదివి అంత గొప్ప సైన్స్‌ను అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. అయినా ఏం ఫర్వాలేదు. ఈ పిల్లర్‌ని చూసి ఆ మేధోఘనులకు ఒక సెల్యూట్‌ చేసి, పిల్లర్‌ ముందు నిలండి ఫొటో తీసుకుంటే ఎప్పటికీ తుప్పు పట్టని ఓ మంచి జ్ఞాపకం మన ఆల్బమ్‌లో నిక్షిప్తమై ఉంటుంది.

నిజమో! కాదో!! కానీ...
ఈ పిల్లర్‌ చూడడానికి సన్నగా ఉన్నట్లే అనిపిస్తుంది. కానీ పిల్లర్‌ మన వీపుకి తగిలేటట్లు నిలబడి రెండు చేతుల్ని వెనక్కి చాచి పిల్లర్‌ని చుట్టడానికి ప్రయత్నిస్తే చేతులు అందవు. ఈ ప్రయత్నంలో రెండు అరచేతుల్ని పట్టుకోగలిగిన వాళ్లు గొప్ప వ్యక్తులవుతారని అక్కడ ఒక సరదా నమ్మకం ఉండేది. భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి చేతులు అందాయని కూడా చెప్పేవారు. పర్యాటకులందరూ ప్రయత్నించి విఫలమయ్యేవాళ్లు. ఇప్పుడు ఆ ప్రయత్నం చేయడానికి కూడా వీల్లేదు. పిల్లర్‌ చుట్టూ కంచె కట్టేశారు. దూరంగా నిలబడి చూసి ఆనందించాల్సిందే. 

మధ్యప్రదేశ్‌లోనే ఎందుకు?
కర్కాటక రేఖ మన దేశంలో గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, జార్ఖండ్, వెస్ట్‌ బెంగాల్, త్రిపుర, మిజోరామ్‌.. మొత్తం ఎనిమిది రాష్ట్రాల గుండా ప్రయాణిస్తుంది. ఎక్యునాక్స్‌డే (పగలు– రాత్రి సమంగా ఉండేరోజు) సూర్యుడి గమనం సాగే రేఖామార్గంలో మధ్యప్రదేశ్‌లో ఉన్న విష్ణుపాద కొండల మీద ఈ ఇనుపస్తంభాన్ని స్థాపించారు. ఇది ఈ ఇనుపస్తంభ స్థాపన వెనుక ఉన్న ఖగోళ విజ్ఞానం. అంతకు మించిన లోహశాస్త్ర విజ్ఞానం కూడా ఈ పిల్లర్‌లో నిక్షిప్తమై ఉంది.

బ్రిటిష్‌ కాలంలో ఆర్కియాలజిస్ట్‌ జేమ్స్‌ ప్రిన్సెప్‌ 1817లో ఈ పిల్లర్‌ మీద అధ్యయనం చేసి ప్రపంచానికి తెలియచేశాడు. మెటలర్జరిస్ట్‌ సర్‌ రాబర్ట్‌ హోడ్‌ఫీల్డ్‌ 1912లో రీసెర్చ్‌ మొదలు పెట్టాడు. అనేకమంది శాస్త్రవేత్తలు ఇందులోని శాస్త్రీయత మీద పరిశోధనలు చేసి రెండు వందల యాభైకి పైగా పేపర్‌లు, పుస్తకాలు వెలువరించారు.

ఇది ఒక మెటలర్జికల్‌ వండర్‌ అని తేల్చేశారంతా. ఈ ఐరన్‌ పిల్లర్‌ని తుప్పపట్టనివ్వని లోహపు పూత మందం మిల్లీమీటరులో ఇరవయ్యో వంతు. ఈ టెక్నాలజీ మీద ఇంకా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి.

– వాకా మంజులా రెడ్డి 

మరిన్ని వార్తలు