పహిల్వాన్‌  గర్వభంగం

25 Sep, 2020 11:45 IST|Sakshi

ఇస్లాం వెలుగు

పూర్వం ఒక ఊరిలో  పెద్ద పహిల్వాను ఉండేవాడు. గొప్ప బలశాలి. ఎంతటి మల్లయోధుడినైనా క్షణాల్లో మట్టికరిపించగల కండబలం, నైపుణ్యం అతని సొంతం. కొన్నాళ్ళపాటు అతను కుస్తీ ప్రపంచానికి రారాజుగా వెలిగిపొయ్యాడు. తనతో పోటీకి దిగిన ప్రతి ఒక్కరినీ ఓడించి విజేతగా నిలిచేవాడు. అతని పేరు వింటేనే పెద్దపెద్ద యోధులు వణికిపొయ్యేవారు. దూరతీరాల వరకూ అతని ఖ్యాతి మారుమోగి పోయింది. దీంతో అతడికి ఎక్కడలేని గర్వం తలకెక్కింది. ఎవరినీ ఖాతరు చేసేవాడుకాదు. ఒకసారి అతడు అహంకారపు అంచులు తాకుతూ, ప్రపంచంలోని బలవంతులనందరినీ ఓడించిన తనకు ఎదురే లేదన్న అహంకారంతో దైవం పట్లకూడా తలబిరుసు తనం ప్రదర్శించాడు. ‘నన్ను ఎదిరించేవాడు, నాతో తలపడి గెలిచి నిలిచే వాడు ప్రపంచంలో ఎవడూ లేడు. నాతో తలపడడానికి ఇక నీ దూతలను పంపు నేను వారిని కూడా ఓడించి భూమ్యాకాశాల విజేతగా నిలుస్తాను.’ అంటూ  పొగరుగా వికటాట్టహాసం చేశాడు.

అలా కొన్ని రోజులు గడిచాయి. సర్వశక్తిమంతుడైన దైవం అతని పొగరును, అహంకారాన్ని అణచాలని అనుకున్నాడు. తను ప్రసాదించిన శక్తిసామర్థ్యాలను చూసుకొని అతడు ఆ విధంగా విర్రవీగడం దైవానికి నచ్చలేదు. దాంతో దైవం అతని శక్తిని క్షీణింపజేశాడు. అతణ్ణి నిస్సహాయుడుగా మార్చాడు. ఒకరోజు అతడు ఓ ఎత్తైన కొండ ఎక్కి తన కళలన్నీ ప్రదర్శిస్తూ దిక్కులు పిక్కటిల్లేలా నినదించడం ప్రారంభించాడు. తనను ఢీ కొట్టగల శక్తి ఈ భూమండలం పైనే కాదు, గగన తలంపై కూడా లేదని విర్రవీగాడు. అలా కొద్ది సేపటి తరువాత అదే బండరాతిపై ఠీవిగా కూర్చున్నాడు. అంతలో అతనికేదో మైకం ఆవరించినట్లు అనిపించిది. తలాపున ఇటుకలాంటి ఓరాతి ముక్కను పెట్టుకొని అలానే ఓపక్కకు ఒరిగి పొయ్యాడు. అంతలో ఒక ఎలుక ఎటునుండి వచ్చిందో, అతని కాలి వేలును పట్టుకొని కొరక సాగింది.

అతను దాన్ని విదిలించుకోడానికి ప్రయత్నించాడు. కాని కాలు కుడా కదిలే పరిస్థితిలో లేదు. శరీరమంతా నిస్సత్తువ ఆవరించింది. కొద్దిసేపటి క్రితం వరకూ కొండల్ని సైతం పిండి చేయగల శక్తిసామర్థ్యాలు ప్రదర్శించి సత్తా చాటిన పర్వతమంత బలశాలి పహిల్వాన్‌ నిస్సహాయ స్ధితిలో పడి ఉన్నాడు. కొద్ది దూరంలో నిలబడి ఇదంతా గమనిస్తున్న కొందరు ఆ పహిల్వానుతో, ‘చూశావా.. అల్లాహ్‌ తన సైన్యంలో అత్యంత అల్పమైన ఒక సైనికుడిని నీ దగ్గరికి పంపాడు. ఎందుకంటే  ఆయన నీకు నీ స్థాయినీ, నీ అసలు బలాన్ని చూపించ దలచాడు.

అహంకారం నుండి నిన్ను మేల్కొలిపి, కళ్ళు తెరిపించాలనుకున్నాడు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. కళ్ళు తెరువు. అందరికంటే బలవంతుడు, భూమ్యాకాశాల సృష్టికర్త అహంకారాన్ని ఎంతమాత్రం సహించడు. ఆయన ముందు సాగిలపడు.. ఆయన సన్నిధిలో పశ్చాత్తాప పడు, క్షమాపణ కోరుకో.. ఇప్పటికైనా తప్పు తెలుసుకొని అహంకారం వీడితే సర్వశక్తివంతుడు, దయామయుడు అయిన అల్లాహ్‌ నిన్ను క్షమిస్తాడు. ఆయన అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు’. అని హితవు పలికారు. 
– ముహమ్మద్‌ ఉస్మాన్‌ ఖాన్‌   

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా