సప్త ఆకాశాల పర్యటన

23 Mar, 2021 06:52 IST|Sakshi

ముహమ్మద్‌ ప్రవక్త(స) వారి పావన జీవితంలో జరిగిన అనేక ముఖ్య సంఘటనల్లో సప్తాకాశాల పర్యటన ఒకటి. దైవాదేశం మేరకు హజ్రత్‌ జిబ్రీల్‌ అలైహిస్సలాం ప్రవక్తవారిని ఆకాశ పర్యటనకు తీసుకెళ్ళారు. ఈ పర్యటనలో ఒకచోట కొందరు వ్యక్తులు ఒక పంటను కోస్తున్నారు. అయితే ఆ పంట కోస్తున్న కొద్దీ పెరగడం చూసి,‘ఏమిటీవింత?’ అని జిబ్రీల్‌ను అడిగారు. ‘వీరుౖ దెవమార్గంలో తమ సర్వస్వాన్నీ త్యాగం చేసినవారు.’ అని చెప్పారు జిబ్రీల్‌. మరొకచోట కొందరు వ్యక్తులు అతుకుల బొంతలు ధరించి పశువుల్లాగా గడ్డిమేస్తున్నారు. ఇది చూసిన ప్రవక్త(స) వీరెవరని ప్రశ్నించారు. ‘వీరు తమ సంపద నుండి జకాత్‌ చెల్లించని వారు.’ అని చెప్పారు జిబ్రీల్‌ దూత.
ఇంకొకచోట కొందరి తలలను బండరాళ్ళతో చితగ్గొట్టడం చూసి, ‘మరి వీళ్ళెవరు?’ అని ప్రశ్నించారు ప్రవక్త. ‘వీరు నిద్రమత్తులో జోగుతూ దైవారాధనకు బద్దకించేవారు.’ అని చెప్పారు జిబ్రీల్‌.

మరొకచోట ఒకమనిషి కట్టెలమోపు లేపడానికి విఫలయత్నాలు చేస్తూ, అందులోంచి కొన్ని కట్టెలు తీసి తేలిక పరుచుకునే బదులు, అదనంగా మరికొన్ని కట్టెలు కలిపి మోపుకడుతున్నాడు. ప్రవక్త(స) ఈ వింతను చూసి, ‘ఈమూర్ఖుడెవరు?’ అని అడిగారు.  ‘ఈ వ్యక్తి, శక్తికి మించిన బాధ్యతలు మీద వేసుకొని కూడా, వాటిని తగ్గించుకునే బదులు మరికొన్ని బాధ్యతలు భుజాన వేసుకునేవాడు.’ బదులిచ్చారు జిబ్రీల్‌. మరొకచోట కొందరు వ్యక్తుల పెదవులు, నాలుకలు కత్తెర్లతో కత్తిరించబడుతున్నాయి. ఇది చూసిన ప్రవక్తవారు, ‘ఇదేమిటీ? ’ అని ప్రశ్నించారు. ‘వీరు  బాధ్యత మరచిన ఉపన్యాసకులు. బాధ్యతారహిత ప్రసంగాలతో ప్రజల్ని రెచ్చగొట్టి చిచ్చుపెట్టేవారు, కలహాలు రేకెత్తించేవారు.’ అన్నారు హజ్రత్‌ జిబ్రీల్‌. ఇదేవిధంగా ఇంకోచోట, బండరాయిలో ఒక సన్నని పగులు ఏర్పడి, అందులోంచి బాగా బలిసిన ఒక వృషభం బయటికొచ్చింది. అయితే అది మళ్ళీ ఆ సన్నని పగులులో దూరడానికి  విఫల యత్నం చేస్తోంది. దానికి జిబ్రీల్‌ దూత, ‘ఇది బాధ్యతారహితంగా, మాట్లాడి, సమాజంలో కల్లోలం రేకెత్తిన తరువాత పశ్చాత్తాపం చెందే వ్యక్తికి సంబంధించిన దృష్టాంతం. నోరు జారిన తరువాత ఇక అది సాధ్యం కాదు.’ అని చెప్పారు జిబ్రీల్‌.

మరోచోట, కొందరు స్వయంగా తమ శరీర భాగాలను కోసుకొని తింటున్నారు. ‘మరి వీరెవరూ?’ అని ప్రశ్నించారు ప్రవక్త(స).’ వీరు ఇతరులను ఎగతాళి చేసేవారు, అవమానించేవారు, తక్కువగా చూసేవారు.’ చెప్పారు హజ్రత్‌ జిబ్రీల్‌. అలాగే ఇంకా అనేక రకాల శిక్షలు అనుభవించేవారు కూడా కనిపించారు. ఇతరులపై నిందలు వేసేవారు తమ రాగిగోళ్ళతో ముఖాలపై, ఎదరొమ్ములపై రక్కుకుంటున్నారు. వడ్డీ తినేవారు, అనాథల సొమ్ము కాజేసేవారు, అవినీతి, అక్రమాలకు పాల్పడేవారు, జూదం, మద్యం, వ్యభిచారం లాంటి దుర్మార్గాల్లో కూరుకుపోయిన వారు రకరకాల శిక్షలు అనుభవిస్తూ కనిపించారు. ఎవరైతే దైవాదేశాలకనుగుణంగా ప్రవక్త చూపిన బాటలో నడుచుకుంటూ, సత్కర్మలు ఆచరిస్తారో అలాంటివాళ్ళే ఈ భయంకరమైన శిక్షలనుండి సురక్షితంగా ఉండగలుగుతారు. 
    – ముహమ్మద్‌ ఉస్మాన్‌ ఖాన్‌  

మరిన్ని వార్తలు