ఎవరు బుద్ధిహీనుడు?

3 Jul, 2021 08:32 IST|Sakshi

ఇస్లాం వెలుగు

పూర్వం ఒక రాజు ఉండేవాడు. అతను అప్పుడప్పుడూ రకరకాల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ఇస్తూ ఉండేవాడు. ఒకసారి రాజుగారికి బుద్ధిహీనుల పోటీ నిర్వహించాలనే ఓ వింత ఆలోచన వచ్చింది. వెంటనే ‘ఫలానా రోజు ఫలానా సమయాన ఫలానా ప్రదేశంలో బుద్ధిహీనుల పోటీ నిర్వహించబడుతుంది. ఉత్తమ బుద్ధిహీనుడికి విలువైన బహుమతి ప్రదానం చేయబడుతుంది’ అని ప్రకటన జారీచేయించాడు. ఆ రోజు రానే వచ్చింది. రాజ్యంలోని బుద్ధిహీనులందరూ పోటీలో పాల్గొన్నారు. అందరూ తమ తమ ప్రావీణ్యాన్ని, కళను ప్రదర్శించారు. వారిలో ఓ వ్యక్తి తన బుద్ధిహీనతను అత్యుత్తమంగా ప్రదర్శించి విజేతగా నిలిచాడు.

రాజుగారు విజేతగా నిలిచిన ఆ వ్యక్తిని ప్రశంసిస్తూ, తన మెడలో ఉన్న విలువైన హారాన్ని అతని మెడలో వేసి సత్కరించాడు. సభముగిసింది. అందరూ వెళ్ళిపోయారు. ఇది జరిగిన కొద్దిరోజులకే రాజుగారికి సుస్తీ చేసింది. అందరూ వెళ్ళి రాజుగారిని పరామర్శించి వస్తున్నారు. ఒకరోజు బుద్ధిహీనుడు కూడా రాజు గారిని చూడడానికి వెళ్ళాడు. ‘‘రాజుగారూ.. ఏమిటీ పరిస్థితి.. ఇలా అయిపోయారు.. ఎలా ఉంది ఆరోగ్యం..’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు. రాజు ఓపికగా ‘‘నా ఆరోగ్యం క్షీణించింది. బహుశా ఇక నేను ఎక్కువ కాలం ఇక్కడ ఉండకపోవచ్చు’’ అన్నాడు.

 ‘‘అవునా.. వేరే చోటికి వెళుతున్నారా?’’ సంభ్రమంగా ప్రశ్నించాడు బుద్ధిహీనుడు. 
‘‘అవును.. అంటే.. ఈ ప్రపంచం వదిలేసి మరోప్రపంచానికి ప్రస్థానం..’’ అన్నాడు రాజు వేదాంత ధోరణిలో..
‘‘అవునా.. వేరే చోటికి వెళుతున్నారా? రాజుగారూ.. మీదగ్గర చాలా సంపద ఉందిగదా.. అదంతా అక్కడికి కూడా పంపించారా?’’ అడిగాడు బుద్ధిహీనుడు.
‘‘లేదు.. పంపలేదు..’’ 
‘‘ఇక్కడ ఇంత పెద్ద అద్భుతమైన భవనంలో ఉంటున్నారు కదా.. మరి అక్కడ కూడా పెద్ద భవంతి కట్టించారా?’’
‘‘లేదు.. అక్కడ పూరి గుడిసె కూడా నిర్మించలేదు’’ 
‘‘ఇక్కడ మీకింతమంది సేవకులు, నౌకర్లు, రకరకాల సేవలు చేసేదాస దాసీలు ఉన్నారు కదా.. అక్కడ కూడా వీళ్ళంతా ఉన్నారా.. అక్కడ మీకెవరు సేవలు అందిస్తారు?’ ప్రశ్నించాడు బుద్ధిహీనుడు.

రాజుకి బుద్ధిహీనుడి మాటల్లోని మర్మం అంతుచిక్కడం లేదు.. కాని బుద్ధి హీనుడి మాటల్లో ఎక్కడో జ్ఞానోదయ బోధ ఉన్నట్లు అనిపించ సాగింది.. అప్రయత్నంగానే ‘‘అక్కడ ఎవరూ నౌకర్లు లేరు. సేవకులు లేరు.. అక్కడికేమీ పంపలేదు కూడా..’ అన్నాడు.
‘‘మహారాజా.. ఇక్కడ మీరు సమస్త సంపదనూ సంపాదించుకున్నారు. సకల భోగభాగ్యాలూ, సమస్త విలాసాలూ అనుభవించారు. మరి అక్కడికి ఏమీ పంపుకోకుండానే వెళ్ళిపోతే అక్కడి పరిస్థితి ఏమిటి? ఆ జీవితం ఎలా గడుస్తుంది? బుద్ధిమంతులెవరైనా రేపటికోసం ఆలోచిస్తారు గదా! బుద్ధిహీనుడు ఎవరో ఇప్పుడు మీరే తేల్చుకోండి’’ అంటూ తన మెడలోని ఆ విలువైన హారాన్ని తీసి రాజు గారి మెడలో వేసి అక్కడినుండి బిరబిరా వెళ్ళిపోయాడు బుద్ధిహీనుడు.
రాజుగారు ఆలోచనలో పడిపోయారు. 

అవును...  ఈ ప్రపంచమే శాశ్వతమని, ఈ జీవితమే సర్వస్వమని రేపటి భవిష్యత్తును, రేపటి జీవితాన్ని పట్టించుకోకుండా ప్రాపంచిక వ్యామోహంలో మునిగి పోవడమే నిజమైన బుద్ధిహీనత. ఇహలోకంలో పరలోకం కోసం పాటుపడేవారు, రేపటి పరలోక జీవితానికి కావలసిన సత్కార్యాలు చేసుకునేవారే వివేకవంతులని పవిత్ర ఖురాన్‌ కూడా చెబుతోంది. దైవం మనందరినీ సన్మార్గపథంలో నడిపించుగాక!
 – ముహమ్మద్‌ ఉస్మాన్‌ ఖాన్‌ 

మరిన్ని వార్తలు