‘అసలు జాకీకి ఒంట్లో భయమే లేదా’

7 Apr, 2021 04:14 IST|Sakshi

నేడు జాకీ చాన్‌ జన్మదినం

జాకీచాన్‌ అసలు పేరు చాన్‌ కాంగ్‌–సాంగ్‌. ‘లిటిల్‌ జాక్‌’ అనే నిక్‌నేమ్‌ ఉండేది. అది కాస్తా ‘జాకీ’గా మారింది. ఆతరువాత ‘చాన్‌’ వచ్చి చేరి ‘జాకీ చాన్‌’ అయింది. జాకీ చాన్‌ ఫైటర్‌ మాత్రమే కాదు... చక్కని గాయకుడు కూడా. ‘ఒపేరా అకాడమీ’ లో కుంగ్‌ఫూతోపాటు సంగీత పాఠాలు కూడా నేర్చుకున్నాడు. 11 మ్యూజిక్‌ ఆల్బమ్‌లను విడుదల చేశాడు. ‘బెస్ట్‌ సింగర్‌’ అవార్డ్‌ కూడా అందుకున్నాడు.
సీఫూ(గురువు) చెప్పేదానికి ప్రకారం మార్షల్‌ ఆర్ట్స్‌లో జాకీకి అసాధారణమైన ప్రతిభ ఏమీలేదు. కానీ చిలిపితనం, నవ్వించే గుణం ఎక్కువ. గంభీరమైన మార్షల్‌ ఆర్ట్స్‌కు కడుపుబ్బా నవ్వించే కామెడీని జత చేసి వెండితెరపై తనదైన శైలిని సృష్టించుకున్నాడు.
బ్రూస్‌లీ లెవెల్‌కు తీసుకువెళదామనే ఉద్దేశ్యంతో ఒక హాంకాంగ్‌ నిర్మాత జాకీకి ‘బికమ్‌ ది డ్రాగన్‌’ అనే స్క్రీన్‌నేమ్‌ తగిలించాడు. అయితే అది అట్టే కాలం నిలవలేదు.
‘డ్రాగన్‌ లార్డ్‌’లో ఒక సీన్‌ కోసం ఏకంగా 2,500 టేక్‌లు తీసుకున్నాడట! ఇది అనధికార గిన్నిస్‌ రికార్డ్‌. ఇక నిజమైన రికార్డ్‌ విషయానికి వస్తే ‘చైనీస్‌ జోడియాక్‌’ అనే సినిమా కోసం దర్శకత్వం, నిర్మాణం, నటన,సంగీతం, ఆర్ట్‌ డైరెక్టర్, యూనిట్‌ ప్రొడక్షన్‌ మేనేజర్, ఫైట్‌ కొరియోగ్రఫీ, సినిమాటోగ్రాఫర్‌. కేటరింగ్‌... ఇలా పదిహేను విభాగాల్లో పనిచేసి గిన్నిస్‌బుక్‌ రికార్డ్‌ సృష్టించాడు.
‘అసలు ఇతడి ఒంట్లో భయమే లేదా’ అనుకునే జాకీకి రెండు భయాలు ఉన్నాయి. ఒకటి సూదులు, రెండోది జనాల మధ్య మాట్లాడడం.
జీవితంలో తాను పశ్చాత్తాప పడే ప్రధాన విషయం...తాను సరిగా చదువుకోకపోవడం అంటాడు. పిల్లలకు ‘రోల్‌ మోడల్‌’గా ఉండాలనేది కల. ఒకప్పుడు తన రోల్‌ మోడల్‌ చార్లీ చాప్లిన్‌. 

మరిన్ని వార్తలు