ఎండర్‌ఫుల్‌ కుకీస్‌

21 Aug, 2021 00:10 IST|Sakshi

డాక్టర్‌ మినాల్‌ కబ్రా, మహారాష్ట్రలోని జల్నా నగరంలో డెంటిస్ట్‌. తన దగ్గరకు వచ్చే పేషెంట్‌లను పరీక్ష చేస్తున్నప్పుడు ఆమెకో సంగతి తెలిసింది. ముఖ్యంగా పిల్లలను పరీక్ష చేస్తున్నప్పుడు ‘ఇది వ్యక్తిగత అనారోగ్యం కాదు, సామాజిక అనారోగ్యం’ అని తెలిసింది.

సమస్య మనుషుల్లో కాదు, వారు తింటున్న ఆహారంలో అని నిర్ధారణ అయింది. పిల్లలు తింటున్న చాక్లెట్లు పిల్లల దంతాలను తినేస్తున్నాయని అర్థమైంది. దాంతో పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే వారు తినాల్సిన చిరుతిండ్ల మీద కూడా దృష్టి పెట్టాలి. తన దగ్గరకు వచ్చిన పేషెంట్‌లకు మాటల్లో చెప్పడం ద్వారా పరిష్కారం అయ్యే సమస్య కాదిది. సమస్య మూలాన్ని మార్చేయాల్సిందే. అందుకే రాగి, జొన్న, ఓట్, అవిసె గింజలు, కొబ్బరి, తోటకూర గింజలు, మునగ ఆకు, గోధుమ పిండి, బెల్లం, అల్లం, నిమ్మరసం వంటి ఆరోగ్యకరమైన దినుసులతో పిల్లలు ఇష్టపడే కుకీ బిస్కెట్‌లు తయారు చేయిస్తోంది డాక్టర్‌ మినాల్‌ కబ్రా. మినాల్‌ పిల్లల ఆరోగ్యం గురించి మాత్రమే కాదు, పర్యావరణ హితాన్ని కూడా అదే స్థాయిలో కోరుకుంటోంది. అదేంటంటే... ఆమె తయారు చేయిస్తున్న కుకీస్‌ ఏవీ అగ్నిపక్వాలు కాదు మొత్తం అర్కపక్వాలే. అంటే సూర్యకిరణాల వేడితో తయారవుతాయన్న మాట.

వందకు చేరాలి
డాక్టర్‌ మినాల్‌ కబ్రా రెండేళ్ల కిందట ‘కివు’ పేరుతో చేసిన ప్రయోగం విజయవంతమైంది. ‘‘మా జల్నాలో ఏడాదిలో మూడు వందల రోజులు మంచి ఎండ ఉంటుంది. ప్రకతి ఇచ్చిన వనరును ఉపయోగించుకోవడంకంటే మించిన ఆలోచన ఏముంటుంది? అందుకే సోలార్‌ ఎనర్జీతో పని చేసే కుకీ మేకింగ్‌ యూనిట్‌ డిజైన్‌ చేయించుకున్నాను. మామూలుగా అయితే ప్రతి కుకీ తయారీలో ఐదు గ్రాముల కార్బన్‌ డయాకై ్సడ్‌ విడుదలై పర్యావరణంలో కలుస్తుంది. సోలార్‌ ఎనర్జీ ఉపయోగించడం వల్ల ఈ మేరకు నివారించవచ్చు. 2016 నుంచి ఏడాది పాటు సొంతంగా ప్రయోగం చేశాను.
 

రెండేళ్ల కిందట పరిసర గ్రామాల్లో గ్రామానికి ఇద్దరు చొప్పున మహిళలను గుర్తించి వారికి శిక్షణ ఇచ్చి సోలార్‌ బేకింగ్‌ యూనిట్‌లను ఇచ్చాను. ఇందులో నేను ఎంటర్‌ప్రెన్యూర్‌ని కాదు, వాళ్లు నా ఉద్యోగులూ కాదు. ఎవరి యూనిట్‌కి వాళ్లే యజమానులు. నేను కేవలం ‘ఏం చేయాలి, ఎలా చేయాలి’ అనే సూచనలు మాత్రమే ఇస్తాను. మార్కెట్‌ చేయడానికి ఒక వేదికను కల్పించానంతే. ఈ ఉత్పత్తులు ఇప్పటి వరకు పదిహేడు పట్టణాల్లో మొత్తం 72 స్టోర్‌లకు చేరాయి. వీటిని వంద క్లస్టర్‌లకు చేర్చాలనేది నా లక్ష్యం.

ఇప్పటి వరకు 825 కిలోల కర్బన కాలుష్యాలను నివారించగలిగాం. మరోసారి చెబుతున్నాను నేను ఎంటర్‌ప్రెన్యూర్‌ని కాదు. ఒక సమాజహితమైన పని చేయడమే నా ఉద్దేశం. ఈ ప్రాక్టీస్‌ దేశమంతటా విస్తరింపచేయడం, కొనసాగింపచేయడం కోసం పని చేస్తాను. డెంటిస్ట్‌గా నా ప్రాక్టీస్‌ కొనసాగుతుంది’’ అన్నారు డాక్టర్‌ మినాల్‌.

డాక్టర్‌ మినాల్‌ చేసిన ప్రయత్నం గ్రామీణ మహిళలకు మంచి ఉపాధి మార్గంగానూ మారింది. ఖర్చులు పోగా రోజుకు నాలుగు వందల యాభై రూపాయలు మిగులుతున్నాయని చెప్పింది మినాల్‌ దగ్గర శిక్షణ తీసుకుని కుకీలు చేస్తున్న స్వప్న.

మరిన్ని వార్తలు