Magnetic Hill: వావ్‌.. పద్నాలుగు వేల అడుగుల ఎత్తులో..

28 Aug, 2021 19:22 IST|Sakshi

కొండొకచో ఓ వింత.. మాగ్నటిక్‌ హిల్‌

జమ్ము–కశ్మీర్‌ అంటేనే ప్రకృతి వైవిధ్యాలకు నిలయం. ఈ ప్రకృతి విచిత్రం కూడా అక్కడిదే. కశ్మీర్, లధాక్‌ రీజియన్‌లో ఉంది. లేహ్‌ నుంచి కార్గిల్‌కు వెళ్లే దారిలో కారులో ముందుకు ప్రయాణిస్తున్నప్పుడు ఎటు చూసినా మనం ఎత్తులోకి ప్రయాణిస్తున్నట్లే అనిపిస్తుంది. రోడ్డు ఎంతో దూరం కనిపించదు. పైకి వెళ్తుంటే మన ముందు ఉన్న రోడ్డు కూడా ఆకాశాన్ని తాకుతున్నట్లు కనిపించాలి కదా.

కానీ ఓ వంద అడుగుల దూరం కంటే కనిపించదు. మన వాహనం ముందుకు వెళ్తుంటే మరో వంద అడుగులు మేర రోడ్డు కనిపిస్తుంటుంది. మనం పైకి వెళ్తున్నామా, కిందకు వెళ్తున్నామా అనే సందేహ నివృత్తి కోసం కారాపి గమనిస్తే కారు దానంతట అదే మెల్లగా ముందుకు సాగిపోతుంటుంది. అంటే మనం ప్రయాణిస్తున్నది కిందకే అన్నమాట. పద్నాలుగు వేల అడుగుల ఎత్తులో ప్రకృతి విన్యాసం ఇది.

విశ్వాసం!!
ఈ విచిత్రం పర్యాటకులకు మంచి వినోదం. అయితే స్థానికులు మాత్రం ‘ఇది ఒకప్పుడు ఇది స్వర్గానికి వెళ్లే దారి’ అంటూ అందమైన కథనం చెప్తారు. ఇక్కడ మార్కింగ్‌ పాయింట్‌గా ఒక పసుపు రంగు బాక్స్‌ ఉంటుంది. వాహనాన్ని అక్కడ ఆపి ఈ ఫీల్‌ని ఆస్వాదించవచ్చు. ఈ విచిత్రం మనదేశానికే పరిమితమా లేక ప్రపంచంలో మరెక్కడైనా ఉందా? అనే సందేహం రావడం సహజమే. ఆర్మీనియాలోని మౌంట్‌ అరాగాట్‌ కూడా ఇలాంటి విచిత్రాన్ని సొంతం చేసుకున్న పర్యాటక ప్రదేశం.

సమీపంలో సింధునది
మాగ్నటిక్‌ కొండకు పక్కనే సింధు నది ప్రవహిస్తోంది. ఇక్కడ పర్యటించడానికి జూలై నుంచి అక్టోబర్‌ వరకు అనువుగా ఉంటుంది. మాగ్నటిక్‌ హిల్‌ టూర్‌ను లధాక్‌ పర్యటనలో భాగంగా చేర్చుకోవచ్చు. ఈ ట్రిప్‌లో లధాక్, నుబ్ర, పాంగాంగ్‌ వంటి ప్రదేశాలను కూడా కవర్‌ చేయవచ్చు.

బస: లేహ్‌లో హోటళ్లు ఉంటాయి. హోమ్‌స్టేలో కూడా బస చేయవచ్చు. డ్రైవింగ్‌ ఇష్టపడే వాళ్లు కారు అద్దెకు తీసుకుని మాగ్నటిక్‌ హిల్‌కు స్వయంగా నడుపుకోవచ్చు.
ఆహారం: ఈ రూట్‌లో రెస్టారెంట్‌లలో చాయ్‌ మాత్రమే దొరుకుతుంది. కాబట్టి ఆహారం లేహ్‌ లోనే ప్యాక్‌ చేయించుకుని వెళ్లడం మంచిది.  
-వాకా మంజులారెడ్డి

మరిన్ని వార్తలు