గురువాణి: అమ్మ ప్రేమకన్నా...

15 Aug, 2022 00:29 IST|Sakshi

పసిపిల్లలకు లోకంలో తల్లికన్నా ప్రియమైనది ఏదీ ఉండదు. అమ్మతో మాట్లాడడం, అమ్మని ముట్టుకోవడం, అమ్మతో ఆడుకోవడం, అమ్మ పాట వినడం, అమ్మ స్పర్శ... వీటికన్నా ప్రియమైనవి లోకంలో ఉండవు. సమస్త జీవకోటినీ సష్టించే పరబ్రహ్మ స్వరూపం అమ్మే.

ఈ లోకంలోకి రాగానే పాలిచ్చి, ఆహారమిచ్చి పోషించే మొట్టమొదటి విష్ణు స్వరూపం అమ్మయే. అన్ని ప్రాణులను తన వెచ్చటి స్పర్శతో నిద్రపుచ్చే ప్రేమైకమూర్తి అయిన హర స్వరూపం కూడా అమ్మయే. అందుకే అమ్మ సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త  సమాహార స్వరూపం. అటువంటి అమ్మకన్నా ప్రియమైనది ప్రపంచంలో మరేముంటుంది? అయితే ఒకటి గమనించాలి. అమ్మకడుపులోంచి వచ్చిన వాడు మళ్లీ అమ్మ కడుపులోకి పోలేడు.

కానీ ఈ దేశం మట్టిలో పుట్టి... మళ్ళీ చిట్ట చివర ఈదేశం మట్టిలో కలిసిపోతాం. అందువల్ల జన్మభూమి తల్లికన్నా గొప్పది. తల్లికన్నా ప్రియమైనది. అందునా భారత దేశం. ఇంత గొప్పదేశంలో పుట్టినవాళ్ళం...భరతమాత బిడ్డలం. ఇది సామాన్యమైన భూమినా..!!! ఇది వేదభూమి, ఇది కర్మ భూమి(వేద సంబంధమైన క్రతువులు జరుపుకోవడానికి అర్హమైన భూమి)... ఎన్ని పుణ్యనదులు ప్రవహిస్తున్నాయో ఇక్కడ 

ఈ భావనలతో ఉప్పొంగిన ఓ మహాకవి పరవశించిపోయి ........

జయ జయ జయ ప్రియ భారత
జనయిత్రి దివ్య ధాత్రి
జయ జయ జయ శత సహస్ర
నర నారీ హృదయ నేత్రి
జయ జయ సశ్యామల
సు శ్యామచలా చేలాంచల

జయ వసంత
కుసుమలతా చరిత
లలిత చూర్ణ కుంతల
జయ మదీయ హృదయాశ్రయ
లాక్షారుణ పద యుగళా

జయ దిశాంత గత శకుంత
దివ్యగాన పరితోషణ
జయ గాయక వైతాళిక గళ
విశాల పద విహరణ
జయ మదీయ మధుర గేయ
చుంబిత సుందర చరణ....

... ఇలా అల్లి ఓ పాట రాసేసాడు. ఆయనే దేవులపల్లి కృష్ణ శాస్త్రి.. ఈ అమ్మకు పుట్టిన బిడ్డలు అనంతం. వారందరికీ అమ్మ పోలికలే వచ్చాయట... ఏమిటా పోలికలు... త్యాగం, పదిమందికీ పెట్టడం, పరోపకారం, కృతజ్ఞత, ఆతిథ్యం...ఉపకారం చేసినవాడికి ఉపకారం చేయడమే కాదు, అపకారికి కూడా ఉపకారం చేయగల విశాల హృదయం... వీటన్నింటికీ మించి ఓర్పు... ఓర్పును మించిన ధర్మం, ఓర్పును మించిన సత్యం, ఓర్పును మించిన యజ్ఞం ఉండవు... అంత గొప్ప ఓర్పు కలిగి ఉండడం, అరిషడ్వర్గాలను జయించడం, తనలో ఉన్న పరబ్రహ్మాన్ని తెలుసుకోవడం.. అమ్మకున్న ఈ లక్షణాలన్నీ బిడ్డలకొచ్చాయి.

అందుకే వారి హృదయాలలో ఆమె ఎప్పుడూ పచ్చని చీర కట్టుకుని వెలిగిపోతూ కన్పిస్తూంటుంది. పరమ పవిత్రమైన ఆమె పాదాలు.. ఈ సృష్టిలో ఆమె పాదాలను ముద్దాడడం పసిపిల్లవాడి పారవశ్యం. కవిగా దేవులపల్లి ఎంత పరవశించిపోయారంటే ‘‘అక్షరమక్షరం నా మనసు కరిగితే ఈ పాటయిందమ్మా..’’.అని చెప్పుకుని ఆమె పాదపద్మాలకు సమర్పించుకున్నారు.

అత్యంత పవిత్రమైన ఈ అమృతోత్సవాల సందర్భంగా ఇంత మధురమైన దేశభక్తి గేయాన్ని రాసిన దేవులపల్లి కృష్ణశాస్త్రిగారిని స్మరించుకుంటే... మనం కూడా ఆయనలా చిన్నపిల్లలమై ఆమె పాదాలను ముద్దాడే అనుభూతిని పొందుదాం.

బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు
 

మరిన్ని వార్తలు