ఆసక్తే అతడి శక్తి! అదే టాప్‌ డిజిటల్‌ స్టార్‌గా మార్చింది!

27 Oct, 2023 10:14 IST|Sakshi

తెలుసుకోవాలనే ఆసక్తి ఆ తరువాత శక్తిగా మారుతుంది. శక్తిమంతులు ఊరకే ఉంటారా! కొత్త ద్వారాలు తెరుస్తారు. గర్వ పడేలా ఘన విజయాలు సాధిస్తారు. ఢిల్లీకి చెందిన జే కపూర్‌ టెక్నో యూనివర్శిటీలలో చదువుకోలేదు. ‘ఎందుకు? ఏమిటి? ఎలా?’ అంటూ గ్యాడ్జెట్‌ల పుట్టుపుర్వోత్తరాల గురించి ఆసక్తి చూపించేవాడు.  ఆ ఆసక్తి అంతులేని శక్తిని ఇచ్చింది. ‘డిజిటల్‌ స్టార్‌’ హోదాలో హుందాగా కూర్చోబెట్టింది. తాజాగా... ఫోర్బ్స్‌ ఇండియా ‘టాప్‌ డిజిటల్‌ స్టార్స్‌’ జాబితాలో చోటు సంపాదించాడు జే కపూర్‌...

మొబైల్, ల్యాప్‌టాప్, కంప్యూటర్‌లకు సంబంధించి సాంకేతిక సమస్య తలెత్తితే జే కపూర్‌ను వెదుక్కుంటూ వచ్చే వాళ్లు ఫ్రెండ్స్‌. నిమిషాల వ్యవధిలోనే వాళ్లు పట్టుకొచ్చిన సమస్యకు పరిష్కారం చూపేవాడు కపూర్‌. కొంతకాలం తరువాత సుపరిచితులే కాదు అపరిచితులు కూడా కపూర్‌ను వెదుక్కుంటూ రావడం మొదలైంది. ఈ నేపథ్యంలోనే ‘తరచుగా ఎదురయ్యే కొన్ని సాంకేతిక సమస్యలకు పరిష్కారాలు’ పేరుతో ఒక వీడియో చేసి యూట్యూబ్‌లో పెట్టాడు. అలా డిజిటల్‌ ప్రపంచంలో తొలి అడుగు వేశాడు.

2011లో తన పేరుతోనే యూట్యూబ్‌ చానల్‌ ప్రారంభించాడు. అయితే చాలామంది యూట్యూబర్‌లకు ఎదురైనట్లే ఖరీదైన కెమెరా ఎక్విప్‌మెంట్స్‌ కొనడానికి ఆర్థిక సమస్యలు ఎదురయ్యాయి. అయినా సరే వెనక్కి తగ్గలేదు. ఎలాగో కష్టపడి తనకు కావాల్సిన సాంకేతిక పరికరాలు సమకూర్చుకున్నాడు. లేటెస్ట్‌ టిప్స్, ట్రిక్స్, ట్యుటోరియల్స్, ట్రెండింగ్‌ టాపిక్స్‌తో తన యూట్యూబ్‌ చానల్‌ దూసుకుపోయింది. సక్సెస్‌కు ‘ఐడియా అండ్‌ రిసెర్చ్‌’ ముఖ్యమైనవి అంటాడు కపూర్‌.

ట్విట్టర్‌ నుంచి దినపత్రికలలో వచ్చే ఆర్టికల్స్‌ వరకు ఎక్కడో ఒక చోట తనకు ఐడియా దొరుకుతుంది. ఆ తరువాత అన్ని కోణాల్లో దాని మీద రీసెర్చి మొదలుపెడతాడు. ‘కొన్నిసార్లు మూడు గంటల్లో చేసిన వీడియోలకు లక్షలాది వ్యూస్‌ వస్తాయి. కొన్నిసార్లు రోజుల తరబడి చేసిన వీడియోలు ఫ్లాప్‌ అవుతుంటాయి’ నవ్వుతూ అంటాడు కపూర్‌. 19 సంవత్సరాల వయసులోనే మన దేశంలోని ‘టాప్‌ 6 టెక్‌ యూట్యూబర్స్‌’లో ఒకరిగా నిలిచిన జే కపూర్‌ ఆండ్రాయిడ్‌ డెవలపర్‌ కూడా. ‘ఫ్లాష్‌ సేల్‌ హెల్పర్‌’ అతడి తొలి యాప్‌. ఆ తరువాత స్మార్ట్‌ఫోన్‌ యూజర్‌లకు ఉపయోగపడే ‘వోల్ట్‌ చెకర్‌’ యాప్‌ క్రియేట్‌ చేశాడు.

‘విజయం సాధించాలనే దృష్టితో పెద్ద వాళ్ళ ఇంటర్వ్యూలు అదేపనిగా చదవడం నుంచి కాన్ఫరెన్స్‌లకు హాజరు కావడం వరకు ఎన్నో చేస్తుంటాం. అయితే మన జయాపజయాలను నిర్ణయించేది మాత్రం మన కష్టమే’ అంటాడు జే కపూర్‌. టెక్‌ ఇన్‌ఫ్లూయెన్సర్‌గా సుపరిచితుడైన కపూర్‌ ‘మనీ మిసెక్ట్స్‌’ పేరుతో చేసే వీడియోలతో ఫైనాన్స్‌ ఇన్‌ఫ్లూయెన్సర్‌గా కూడా మంచి మార్కులు కొట్టేశాడు. కష్టం కనిపిస్తేనే విజయం కనిపిస్తుంది. స్ఫూర్తి అనేది ఎక్కడి నుంచి, ఎవరి నుంచి అయినా తీసుకోవచ్చు. స్ఫూర్తి తీసుకోవడానికి పెద్దగా కష్టం అక్కర్లేదు. అయితే ఆ స్ఫూర్తిని మన విజయంగా మలుచుకోవడానికి మాత్రం బాగా కష్టపడాలి. కష్టం కనబడని చోట విజయం కూడా కనిపించదు.
– జే కపూర్‌ 

(చదవండి: వాటర్‌ విమెన్‌! ఆమె నదిలో నీళ్లు కాదు కన్నీళ్లని చూస్తోంది!)

మరిన్ని వార్తలు