ఆమె అమితాబ్‌ను హీరో చేసింది.. హీరోయిన్‌గానూ మానుకుంది

9 Apr, 2021 00:16 IST|Sakshi
అమితాబ్, జయబాధురి

జయభాదురి @ 74

అమితాబ్‌ను ఆమె హీరో చేసింది. అమితాబ్‌ కోసం తాను హీరోయిన్‌గా మానుకుని ఉండిపోయింది. గొప్ప నటి. చేసిన నాలుగు పాత్రలతోనే నేటికీ కోట్లాది అభిమానులను మూటగట్టుకుని ఉంది. చాలామందికి ఆమె గాడ్‌ మదర్‌. కొందరికి ఫ్రెండ్‌. కొందరికి ఇన్‌స్పిరేషన్‌. జయభాదురి ప్రమేయం బాలీవుడ్‌లో ఎన్నో మార్పులకు చరిత్ర చేర్పులకి కారణమైంది. 73 ఏళ్లు నిండి 74వ పుట్టినరోజు జరుపుకుంటున్న ఆమెపై స్పెషల్‌ కామెంట్‌...

‘అభిమాన్‌’ సినిమాలో అమితాబ్, జయభాదురి భార్యాభర్తలు. అమితాబ్‌ గాయకుడు. జయభాదురి కూడా గాయని అవుతుంది. జయ భాదురిని అమితాబ్‌ ప్రోత్సహిస్తుంటే ఒక పెద్దమనిషి గమనించి ‘ఇతను ఈ పని ఎందుకు చేస్తున్నాడు. ఆమె అతని కంటే మంచి గాయని. ఈ కాపురం నిలువదు. ఇగో వచ్చేస్తుంది’ అంటాడు. అలాగే జరుగుతుంది. గాయనిగా జయ భాదురికి వచ్చే పేరు చూసి అమితాబ్‌ తట్టుకోలేకపోతాడు. నిజ జీవితంలో ఈ ప్రమాదంలో ఇరువురూ పడలేదు. కాకుంటే జయ భాదురి ఎంత సమర్థురాలైన నటో అమితాబ్‌ కూడా అంతే సమర్థుడైన నటుడు. వారి కెరీర్‌లకు సంబంధించి టాలెంట్‌ పరంగా ఇగో వచ్చే అవకాశం లేదు కాని ఆమె కూడా అతనంత బిజీగా ఉండి ఉండేది. అయితే పెళ్లయ్యాక జయ ఇంటి కోసం ఉండిపోతే అమితాబ్‌ ఆమె ఉందన్న ధైర్యంతో ముందుకు పోయాడు.

అమితాబ్‌ను తయారు చేసింది జయ అని అంటారు. సినిమాల్లో ‘లంబు’గా అందరి వెక్కిరింతను మొదటగా ఎదుర్కొన్న అమితాబ్‌ అదిలో అన్నీ ఫ్లాప్స్‌ చూశాడు. అప్పటికే అతని తో ప్రేమలో ఉన్న జయ ‘జంజీర్‌’ సినిమాకు అమితాబ్‌ను రికమండ్‌ చేసింది. ఆ సినిమా చాలామంది హీరోలు కాదనుకోవడం వల్ల అమితాబ్‌కు దక్కింది. ‘జంజీర్‌’ నాటికి జయ సూపర్‌స్టార్‌. అయినా సరే అమితాబ్‌ పక్కన చేసి అతణ్ణి నిలబెట్టింది. ఆ సినిమా తర్వాత వాళ్లు పెళ్లి చేసుకున్నారు. అమితాబ్‌ను అమితాబ్‌ ఎంత నమ్ముకున్నాడో తెలియదు కాని జయ బాగా నమ్మింది. పెద్ద స్టార్‌ అవుతాడని అనుకుంది. ‘షోలే’లో అతనికి ఆ పాత్ర దక్కడానికి ఆమె కూడా తన వంతు కృషి చేసింది. జయ అమితాబ్‌ సమర్థత తో పాటు స్టార్‌డమ్‌ను కూడా భరించింది. అతని ఆకర్షణలు, స్త్రీలతో పరిచయాలు, న్యూస్‌లో నలిగిన అమితాబ్‌–రేఖల కథ ఇవన్నీ తట్టుకుని ఇల్లు కాపాడుకుని అమితాబ్‌ను తనని కాపాడుకునేలా చేసింది. 

జయ భాదురి సంజీవ్‌ కుమార్‌తో మంచి సినిమాలు చేసింది. ‘కోషిష్‌’, ‘అనామిక’ వాటి లో ముఖ్యమైనవి. హృషికేశ్‌ ముఖర్జీ దర్శకత్వం లో తొలి సినిమా ‘గుడ్డీ’తో మొదలు ‘బావర్చీ’, ‘అభిమాన్‌’, ‘చుప్కే చుప్కే’... అన్నీ సూపర్‌హిట్స్‌. జయ హిందీలో సహజమైన నటనను తీసుకు వచ్చిందని అంటారు. ఆమె క్షణాల్లో గంభీరమైన నటిగా మారగలదు. అంతే వేగంగా అల్లరి పిల్లగా కూడా మారగలదు. ‘అభిమాన్‌’లో ‘తేరి నిందియారే’ పాడేటప్పుడు జయా, ‘అనామికా’లో ‘బాహోంమే చలే ఆవో’ పాడే జయా... ఇరువురూ ఒక్కరే. కాని ఎంత తేడా ఆ నటనలో. జయ రణ్‌ధీర్‌ కపూర్‌తో ‘జవానీ దివానీ’ చేసి తాను గ్లామరస్‌ రోల్స్‌ కూడా చేయగలనని నిరూపించింది. అందులోని ‘జానే జా ఢూండ్‌తా ఫిర్‌ రహా’ పాట పెద్ద హిట్‌. 

‘పియా కా ఘర్‌’, ‘పరిచయ్‌’, ‘అన్నదాత’, ‘మిలి’.. ఇవన్నీ జయ నటనకు పతాకలు. యశ్‌చోప్రా ‘సిల్‌ సిలా’ చేయమంటే రేఖా ఉన్నప్పటికీ చేసింది. ఇదొక అరుదైన విషయమే. సినిమాల నుంచి సుదీర్ఘ విరామం తర్వాత ఆమె చేసిన ‘హజార్‌ చౌరాసి కి మా’ అంతే పెద్ద స్థాయిలో ఆమెకు పేరు తెచ్చి పెట్టింది. వజ్రం కిరీటంలో ఉన్నా వస్త్రంలో చుట్టి పెట్టినా వజ్రమే కదా.

జయ ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో చదివేటప్పుడు విలన్‌ డేనీ ఆమె క్లాస్‌మేట్‌. అతని నిజం పేరు పొడుగ్గా ఉందని జయా బచ్చనే ‘డేనీ’ అని పెట్టింది. అదే అతనికి స్క్రీన్‌ నేమ్‌ అయ్యింది. రాజీవ్‌ గాంధీ కుటుంబం నుంచి విడిపోవాల్సి వచ్చాక అమితాబ్‌ సమాజ్‌వాదీ పార్టీలో అమర్‌ సింగ్‌ సపోర్ట్‌తో నిలదొక్కుకోవాల్సి వచ్చినప్పుడు జయ కూడా ఆ పార్టీకి సపోర్ట్‌ చేసి ఆ పార్టీలో కొనసాగింది. జయ భాదురి, అమితాబ్‌ ల సరదా నటనను మీరు ‘చుప్కే చుప్కే’లో చూడొచ్చు. నేడు ఆమె జన్మదినం సందర్భంగా ఆ సినిమాను ప్లే చేయండి.   – సాక్షి ఫ్యామిలీ 

మరిన్ని వార్తలు