‘ప్రకృతి’కి పట్టుగొమ్మ జీవామృతం

1 Sep, 2020 08:23 IST|Sakshi
 పొలం గట్టు మీదే ప్లాస్టిక్‌ కవర్లలో జీవామృతం తయారీ , పొలం వద్దే  200 లీటర్ల ప్లాస్టిక్‌ డ్రమ్ములో జీవామృతం తయారీ

ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పంటలను రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడకుండా సాగు చేయటం ద్వారా మనుషుల ఆరోగ్యంతోపాటు భూమి, పర్యావరణం, పశుపక్ష్యాదుల ఆరోగ్యం కూడా కుదుట పడుతుందని ఇప్పటికే రుజువైన విషయం. స్థానికంగా గ్రామాల్లో అందుబాటులో ఉండే ప్రకృతి వనరులతోనే స్థానిక ప్రజలకు అవసరమైన చక్కని ఆరోగ్యదాయకమైన పంట ఉత్పత్తులను పండించుకోవటం కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఎంతో ఆవశ్యకమైన అంశంగా అందరి గ్రహింపునకు వస్తుండటం విశేషం. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ప్రకృతి వ్యవసాయ విభాగం జీవామృతాన్ని అందుబాటులో ఉన్న వనరులతోనే తయారు చేసుకోవటంతోపాటు, పంటలకు జీవామృతాన్ని వాడుకునే పద్ధతులను రైతులకు సూచిస్తోంది.

జీవామృతం తయారు చేసుకునే విధానం, కావలసిన పదార్ధాలు:
1. దేశీ ఆవుపేడ – 10 కేజీలు 
2. దేశీ ఆవు మూత్రం – 5 నుండి 10 లీటర్లు 
3. బెల్లం – 2 కేజీలు (నల్ల బెల్లం అయితే మరీ మంచిది) లేదా చెరుకు రసం 2 లీటర్లు 
4. పప్పుల (ద్విదళాల) పిండి – 2 కేజీలు (శనగ, ఉలవ, పెసర, మినుము ఏదైనా వాడవచ్చు. వేరుశనగ, సోయా పిండి మాత్రం వాడకూడదు)
5). బావి/బోరు/నది నీరు – 200 లీటర్లు 
6). పుట్ట మన్ను లేదా పొలంగట్టు మన్ను దోసెడు


పెద్ద సిమెంటు తొట్లలో జీవామృతం తయారీ

జీవామృతాన్ని తయారు చేసే విధానం:
తొట్టిలో గానీ, డ్రమ్ములో గానీ 200 లీటర్ల నీటిలో ఈ పదార్థాలన్నింటినీ కలిపి నీడలో 48 గంటల పాటు ఉంచాలి. ప్రతి రోజూ రెండు, మూడు సార్లు కర్రతో కుడి వైపునకు తిప్పాలి. 200 లీటర్ల జీవామృతం ఎకరానికి సరిపోతుంది. ఇలా కలిపిన జీవామృతం 48 గంటల తర్వాత వాడకానికి సిద్ధమవుతుంది, అప్పట్నుంచి 9 నుంచి 12 రోజుల మధ్య సూక్ష్మజీవుల వృద్ధి అధికంగా ఉంటుంది. కాబట్టి ఆ రోజుల్లో వాడుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. జీవామృతం ద్వారా భూమిలో సూక్ష్మజీవులు, వానపాములు అధికంగా వృద్ధి చెందుతాయి. నిద్రావస్థలో ఉన్న సూక్ష్మజీవులు, వానపాములు చైతన్యవంతం అవుతాయి. తద్వారా భూసారం పెరగడానికి దోహదపడుతుంది.

రైతులు వరి, మొక్కజొన్న, వేరుసెనగ, కూరగాయలు, పండ్ల తోటల దగ్గరే జీవామృతం తయారు చేసుకునే ఏర్పాట్లు చేసుకోవాలి. ప్లాస్టిక్‌ డ్రమ్ములు, శాశ్వత సిమెంట్‌ వరలతో లేదా ఇటుకలతో నిర్మించే సిమెంటు తొట్లు, అవేవీ లేకపోతే ప్లాస్టిక్‌ కవర్లను మూడు ఊత కర్రల సాయంతో నిలబెట్టి అందులో కూడా ద్రవ జీవామృతాన్ని తయారు చేసుకోవచ్చు. పంటలకు నీటి ద్వారా పారించవచ్చు. లేదా పిచికారీ చేయవచ్చు. 

పొలం గట్లపైనే జీవామృతం సిద్ధం చేసుకునే పద్ధతులు
1. 200 లీటర్ల ప్లాస్టిక్‌ డ్రమ్ము
ఎక్కువ మంది రైతులు జీవామృతం తయారీ కోసం 200 లీటర్లు పట్టే ప్లాస్టిక్‌ డ్రమ్ములను ఉపయోగిస్తుంటారు. ఈ డ్రమ్ము ఖరీదు సుమారుగా రూ. 800 వరకు ఉంటుంది. కొందరు రైతులు 100 లీటర్ల సామర్ధ్యం గల చిన్న ప్లాస్టిక్‌ డ్రమ్ములను ఉపయోగిస్తుంటారు. ఈ ప్లాస్టిక్‌ డ్రమ్ములను రైతులు పొలం గట్ల పైన లేదా పాకలు / షెడ్లలో పెట్టుకొని జీవామృతాన్ని తయారు చేసుకుంటూ వాడుతూ ఉంటారు. ప్లాస్టిక్‌ డ్రమ్ములతో సులువుగా పంటలకు కావలసిన జీవామృతాన్ని అందించగలుగుతున్నారు.

2. ప్లాస్టిక్‌ కవర్‌ పిట్‌ 
డ్రమ్ములు కొనలేని చిన్న, సన్నకారు రైతులు, కౌలు రైతులు 100 లీటర్ల ప్లాస్టిక్‌ కవర్‌లను జీవామృతం తయారీ కోసం ఉపయోగిస్తున్నారు. ఈ కవరు ఖరీదు రూ. 20 వరకు ఉంటుంది. మూడు ఊత కర్రలను భూమి లోపలికి దిగేసి నిలబెట్టి, వాటి మధ్య ఈ ప్లాస్టిక్‌ కవర్‌ను ఉంచి పొలం గట్ల పైన లేదా పాకలలో జీవామృతం తయారు చేసుకొని వాడుతున్నారు. 

3. సిమెంట్‌ వరలతో జీవామృతం పిట్‌ 
సిమెంటు వరల (నందల)తో పిట్‌లను నిర్మించుకొని కొందరు రైతులు జీవామృతాన్ని ఉపయోగిస్తున్నారు. ఇవి శాశ్వతంగా ఉండిపోతాయి. సిమెంట్‌ వరల పిట్‌ ఏర్పాటుకు సుమారు రూ. 500ల నుంచి రూ.750 వరకు ఖర్చవుతుంది. పండ్ల తోటల రైతులు వీటిని ఎక్కువగా నిర్మించుకొని ఏడాది పొడవునా జీవామృతం తయారీకి ఉపయోగిస్తున్నారు. 

4. పెద్ద సైజు సిమెంటు తొట్లు 
సొంత భూముల్లో వ్యవసాయం చేసే రైతులు, పండ్ల తోటల రైతులు పొలంలోనే సిమెంటుతో పెద్ద తొట్లు నిర్మించుకొని, వాటిలో జీవామృతం తయారు చేసుకోవటమే కాకుండా ఫిల్టర్‌ చేసుకునే ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు.  

జీవామృతం పంటలకు వాడే పద్ధతులు :
నీటి తడులతో పారించటం 
వరి, మొక్కజొన్న, చెరకు తదితర పంటలకు నీటి తడులను అందించేటప్పుడు నీటితో పాటుగా జీవామృతాన్ని ఎకరాకు ఒక దఫా 200 లీటర్లు చొప్పున అందిస్తున్నారు. పంటల వివిధ దశల్లో 3 నుండి 4 సార్లు నీటితోపాటు పారిస్తున్నారు 

జీవామృతం పిచికారీ పద్ధతి
వరి, మొక్కజొన్న, కూరగాయలు తదితర పంటలకు జీవామృతాన్ని బాగా వడగట్టి, నీటితో పాటుగా ఎకరాకు ఒక దఫాకు 200 లీటర్లు పంటల వివిధ దశల్లో 3 నుంచి 4 సార్లు రైతులు పొలాల్లో పిచికారీ చేస్తున్నారు.

డ్రిప్, స్ప్రింక్లర్ల ద్వారా జీవామృతం పారించటం
పండ్ల తోటలు, కూరగాయ తోటలకు కొన్ని చోట్ల ఆరుతడి వరికి సైతం జీవామృతాన్ని జాగ్రత్తగా వడకట్టి డ్రిప్‌ ద్వారా లేదా స్ప్రింక్లర్ల ద్వారా రైతులు అందిస్తున్నారు. 

పైపాటుగా పంటలపై పోయటం 
చిన్న, సన్నకారు రైతులు, కౌలు రైతులు లేదా పెరట్లో కూరగాయలు పండించుకునే వారు పంటలపై జీవామృతాన్ని చెంబులు, మగ్గులతో విరజిమ్ముతున్నారు. 
(మరిన్ని వివరాలకు.. ప్రకృతి వ్యవసాయ విభాగం విజయనగరం జిల్లా మేనేజర్‌ ప్రకాశ్‌ (91211 47885)ను సంప్రదింవచ్చు)

ఏ యే పంటలకు ఎంత జీవామృతం?
వరి, మొక్కజొన్న, వేరుసెనగ, కూరగాయ పంటలకు నీరు పారించే సమయంలో నీటితో కలిపి పారేలా చేసి పొలం మొత్తానికి జీవామృతం అందేలా చేయాలి. ప్రతి 15 రోజులకు ఒకసారి 200 లీటర్ల జీవామృతాన్ని నీటితోపాటు భూమికి అందించాలి. అలాగే పండ్ల తోటల్లో ఒక సంవత్సరం వయసున్న మొక్కకు అర లీటరు చొప్పున, రెండు సంవత్సరం మొక్కలకు ఒక లీటరు చొప్పున.. ప్రతి 15 రోజులకు ఒకసారి నేలకు అందించాలి. తద్వారా భూమిలో సుక్ష్మజీవరాశి పెంపొంది, నేల ఆరోగ్యవంతమవుతుంది. ఆరోగ్యవంతమైన భూమి మొక్కలకు సకల పోషకాలను అందిస్తుంది.

మరిన్ని వార్తలు