అవమానాల్లోనూ ఫలించిన కొమ్మ 

24 Mar, 2021 06:44 IST|Sakshi

‘మనుషుల్ని భూకంపాలు చంపవు, భూకంపానికి కూలే భవనాలు చంపుతాయి’ అంటారు శాస్త్రవేత్తలు. గొప్పగా నిర్మించుకున్న మన జీవితాలనే భవనాలు అనూహ్యపు తుఫానులు, భూప్రకంపనలకు తట్టుకోలేక పేకమేడల్లా కూలితే అదే పెనువిషాదం!! అనుకోకుండా ఎదురయ్యే ఆత్మీయ భూకంపాల్లోనే విశ్వాసి జీవితపు పునాదుల ‘పటిష్టత’, అతని దైవిక విలువల ‘నిబద్ధత’ నిగ్గుతేలుతుంది. యాకోబు కుమారుడైన యోసేపు జీవితం 17 ఏళ్ళ నవయవ్వన ప్రాయంలోనే భయంకరమైన ఆత్మీయ భూకంపానికి గురయ్యింది. యోసేపు చాలా భక్తిపరుడన్న అసూయతో సోదరులే అతన్ని నిర్దాక్షిణ్యంగా ఈజిప్ట్‌ వర్తకులకు బానిసగా అమ్మేశారు.

ఈజిప్తులో తన యజమాని భార్య కుట్రతో జైలుపాలై యోసేపు ఇంకా కృంగిపోయాడు. ఇలా వరుస భూకంపాలకు అతని జీవితం నిజానికి సమసిపోవాలి. కాని అతని పునాదుల పటిష్టత, దేవుని పట్ల చెరగని అతని నిబద్ధత, ముఖ్యంగా ఎడబాయని ‘దైవకృప’ లక్షలాదిమందిని భయంకరమైన కరువు కోరలనుండి కాపాడే ఆశీర్వాద స్థాయికి అతన్ని చేర్చింది. సునామీలో కుప్పకూలవలసిన ఒక జీవితం, లక్షలాదిమంది అభాగ్యులను తెప్పరిల్ల చెయ్యడం, దేవుడే చేసిన ఒక మహాద్భుతం.

ఈ లోకంలో దైవభయం లేక స్వార్ధంతో సమస్యలు కొనితెచ్చుకునేవాళ్ళుంటారు. దైవభయం వల్ల ఉన్నతవిలువలకు కట్టుబడి సమస్యల్లో పడేవాళ్ళుంటారు. మరికొంతమందైతే అతి తెలివితేటలతో  గొప్ప ‘ప్లానింగ్‌’ చేయబోయి బోర్లా పడుతుంటారు. కాని అనూహ్యమైన ప్రతికూలతల్లోనే వారి వారి ‘పునాదుల’ పటిష్టత రుజువవుతుంది. దేవుని మాటలు విని బండ మీద ఇళ్ళు కట్టుకునేవాళ్ళు, దేవుని పక్కనబెట్టి ఇసుక మీద ఇళ్ళు కట్టుకునేవాళ్ళు అనే రెండు తెగల విశ్వాసులుంటారని యేసుప్రభువే తన కొండమీది ప్రసంగంలో పేర్కొన్నాడు (మత్తయి 7:24–27). దేవుని హృదయపూర్తిగా నమ్మినవాడు తాత్కాలికంగా చితికినా దీర్ఘకాలంలో దీవెనలు పొందుతాడు. వేషధారులు, స్వార్థ్ధపరులు, డబ్బు మనుషులు బాగున్నట్టే కనిపిస్తూ అకస్మాత్తుగా, శాశ్వతంగా దెబ్బ తింటారు. దేవుని కోసం నిలబడి నలిగినవాళ్ళు మాత్రం, దేవుని సాధనాలుగా మారి మానవాళి కి ఆశీర్వాదకారకులవుతారంటోంది బైబిల్‌.

యోబు, మోషే, పేతురు, గిద్యోను, పౌలు, రూతు ఇలా ఎంతోమంది జీవితాల్లో కృంగి, కూలిపోయిన అనుభవాల్లోనే ‘దేవుని కృప’ అద్భుతంగా పరిమళించి, వారికి ఆశీర్వాదాల ద్వారాలు తెరిచింది. చరిత్రలో పాప విశృంఖలత్వానికి, హేయమైన అనేక సంస్కృతులకు పుట్టినిల్లయిన ఈజిప్తు దేశంలోకి, నిష్ఠ కలిగిన యూదు వంశానికి చెందిన యోసేపు ఒక బానిసగా అడుగుపెట్టాడు. అయితే ఉగ్గుపాలతో తల్లిదండ్రులు నేర్పిన దైవిక పాఠాల ‘బైబిల్‌’ను గుండెల్లో భద్రంగా దాచుకొని యోసేపు తన వెంట తెచ్చుకున్నాడు. చుట్టూ బురదలోనూ తామరలాగా ఆ బలంతోనే అవిశ్వాసుల మధ్య విశ్వాసిగా రాజీపడకుండా బతికాడు. పెనువిషాదాల్లోనూ అదే అతన్ని కాపాడి గమ్యాన్నిచ్చింది. ‘దేవుని ప్రేమ మనల్ని విడువదు, ఎడబాయదు’ అని, ‘పర్వతాలు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా నా కృప నిన్ను విడిచిపోదు’ అని బైబిల్‌ చెబుతోంది (ద్వితీ 31:8), (యెషయా 54:10). యోసేపు జీవితంలో ఈ వాగ్దానాలు అక్షరాలా నెరవేరాయి.

కాని ఇలా అందరి జీవితాల్లోనూ ఎందుకు జరగడం లేదు? ఎందుకంటే, ఈ వాగ్దానాలకు, ‘నీ పూర్ణహృదయంతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణశక్తితో అద్వితీయుడైన నీ దేవుని ప్రేమించాలి’ అన్న ఒక ముందస్తు షరతు ఉంది (మత్తయి 22:37–39). అంటే, బైబిల్‌ నమ్మే, చదివే వాళ్లందరికీ కాదు, దేవుని సంపూర్ణంగా, బేషరతుగా ప్రేమించేవారికి మాత్రమే దేవుని వాగ్దానాలు వర్తిస్తాయి. అందువల్ల, దేవుని వాగ్దానాలు నెరవేరనపుడు దేవుని ప్రేమించడంలో మనం ఎక్కడ వెనకపడ్డాము? అని ప్రశ్నించుకోవాలి. సగం లోకం లో, సగం దేవునిలో ఉంటే మనం సునామీకి సమీపంలో అన్నామని అర్థం.

ఐగుప్తులో ఒక బానిసగా కాలు పెట్టింది మొదలు, యోసేపు చేసిన ఒకే ఒక పని, తాను విశ్వసించిన దేవుని సంపూర్ణంగా హత్తుకొని జీవించడమే!! అందుకే సునామీలు, భూకంపాల్లోనూ దేవుని కృప యోసేపును విడువలేదు, ఎడబాయలేదు. అతన్ని కష్టపెట్టిన అన్నలే కాదు, అన్నం లేని అనేక దేశాల లక్షలాది ప్రజలు యోసేపు ముందు తలవంచే స్థితిని దేవుడు కల్పించాడు. ‘నీటి ఊటలు, ఫలాలసమృద్ధితో గోడదాటి విస్తరించిన కొమ్మ యోసేపు’, అంటూ అతని తండ్రి యాకోబు ఇచ్చిన దీవెన అలా అక్షరసత్యమైంది!! (ఆది 49:22).
– రెవ.డా. టి.ఎ.ప్రభుకిరణ్‌

మరిన్ని వార్తలు