ఈ పిల్లలు మన పిల్లలు కాదా?

6 Mar, 2022 00:45 IST|Sakshi

మన పిల్లలు స్కూళ్లకు వెళతారు. ఆపై ఉద్యోగాలకు వెళతారు. ఆపై జీవితాల్లో స్థిరపడతారు. కాని సమాజం ఒక కుటుంబం అనుకుంటే ఇవన్నీ దక్కని పిల్లలున్న భారతదేశం ఒకటి ఉంది. అది మురికివాడల భారతదేశం. ‘వాళ్లూ మన పిల్లలే. వాళ్లను ఇలాగే వదిలేస్తామా?’ అంటాడు అమితాబ్‌ ‘ఝండ్‌’లో. వ్యసనాలతో బాధ పడుతూ నేరాలు చేస్తూ జైళ్ల పాలవుతూ వీరు పడే సలపరింతకు సమాజానిదే బాధ్యత.
వారి కోసం పట్టించుకుందాం అని గట్టిగా చెప్పిన ఝండ్‌ ఈవారం సండే సినిమా.

‘ప్రపంచ మురికివాడల సాకర్‌ కప్‌’కి ఇండియా టీమ్‌కు ఆహ్వానం అందుతుంది. ఆ టీమ్‌లో ఉన్నది ఎవరు? చెత్త ఏరుకుని జీవించే మురికివాడల పిల్లలు, తల్లిదండ్రులు నిరక్షరాస్యులు కావడం వల్ల చదువుకోలేకపోయిన ఆడపిల్లలు, కుటుంబ కష్టాల్లో ఉన్న మైనారిటీలు, రైళ్లలో బొగ్గు దొంగతనం చేసే దొంగలు, సారాయి బానిసలు, వైటనర్‌ను పీల్చే వ్యసనపరులు... వీళ్లంతా మహా అయితే 20 ఏళ్ల లోపు వారు. ఒక రకంగా వారి జీవితం నాశనమైపోయింది. కాని వారికి ఒక్క చాన్స్‌ ఇవ్వదలిస్తే? ఆ ఒక్క చాన్సే ‘వరల్డ్‌ హోమ్‌లెస్‌ సాకర్‌ కప్‌’లో పాల్గొనడమే అయితే... ఆహ్వానం అందింది కాని మరి అందుకు పాస్‌పోర్ట్‌లు?

పాస్‌పోర్ట్‌ పొందడం ఈ దేశంలో కొంతమందికి ఎంత కష్టమో దర్శకుడు ఈ సినిమా లో వివరంగా చూపిస్తాడు. కొందరి దగ్గర పాస్‌పోర్ట్‌కు అప్లై చేయడానికి ఏ కాగితమూ ఉండదు. ఒకడికి పాస్‌పోర్ట్‌ ఇవ్వడానికి వాడి మీద ఉండే పోలీస్‌కేసు అడ్డంకిగా మారుతుంది. ఆ వంకతో వాడికి పాస్‌పోర్ట్‌ ఇవ్వడం మానేస్తే వాడు సమాజం మీద మరింత ద్వేషం పెంచుకుంటాడు. తనను తాను మరింతగా ధ్వంసం చేసుకుంటాడు. అందుకే వాడికి పా‹స్‌పోర్ట్‌ ఇప్పించేందుకు తానే జడ్జి ముందు మొరపెట్టుకుంటాడు ఫుట్‌బాల్‌ కోచ్‌ అయిన అమితాబ్‌.

‘మన కళ్లెదురుగా ఉన్నదే మనకు తెలిసిన భారతదేశం కాదు. మనం చూడని భారతదేశం ఒకటి ఉంది. దానిని చూడకుండా మన కళ్లకు అడ్డుగా ఒక పెద్ద గోడ ఉంది. ఆ గోడ అవతల ఎంతోమంది బాల బాలికలు దీనమైన బతుకులు బతుకుతున్నారు. సమాజం పట్టించుకోకపోవడం వల్ల అరాచకంగా మారి సమాజం దృష్టిలో మరింత చెడ్డ అవుతున్నారు. ఈ పిల్లలు అద్భుతంగా ఫుట్‌బాల్‌ ఆడుతున్నారు. వీరు ఇలాంటి ఆటల్లో పడితే, వ్యసనాల నుంచి బయటపడి ఒక అర్థవంతమైన బతుకు బతుకుతారు’ అంటాడు అమితాబ్‌.

ఝండ్‌ (గొడ్ల గుంపు. స్లమ్‌ పిల్లల ఫుట్‌బాల్‌ టీమ్‌ను కనీసం టీమ్‌ అనైనా పిలవకుండా గొడ్లగుంపు అని పిలుస్తారు డబ్బున్నవాళ్లు ఈ సినిమాలో) మార్చి 4న విడుదలైంది. అమితాబ్‌ ప్రధాన పాత్రలో నటించాడు. మిగిలిన వాళ్లలో చాలామంది స్లమ్‌ కుర్రాళ్లు నటించారు. మరాఠీలో ‘సైరాట్‌’ తీసి భారీ పేరు గడించిన దర్శకుడు నాగరాజ్‌ మంజులే ఈ సినిమాతో కూడా ప్రశంస లు అందుకుంటున్నాడు. ఈ సినిమాను నాగ్‌పూర్‌కు చెందిన విజయ్‌ బర్సే అనే టీచర్‌ జీవితం ఆధారంగా తీశారు. ఆ పాత్రనే అమితాబ్‌ పోషించాడు. నాగ్‌పూర్‌లో ఒక కాలేజ్‌ లో ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌గా పని చేసిన విజయ్‌ బర్సే ఆ పక్కనే ఉండే మురికివాడల్లోని పిల్లలు అద్భుతంగా ఫుట్‌బాల్‌ ఆడటం చూసి వారికోసం ‘స్లమ్‌ సాకర్‌ క్లబ్‌’లను స్థాపించాడు. వారికి కొత్త జీవితం ప్రసాదించాడు. అందుకు తగ్గట్టుగా ‘ఝండ్‌’ మొత్తం సినిమాను నాగ్‌పూర్‌లో తీశారు.

అయితే ఈ సినిమా చూస్తున్నంతసేపూ ఇది నాగ్‌పూర్‌కు చెందినది మాత్రమే కాదని, దేశంలో ఉన్న ఏ మురికివాడకు చెందిన కథేనేమోనని అనిపిస్తుంది. ముఖ్యంగా పాత్రలను మురికివాడల నుంచే తీసుకోవడం వల్ల వారి బతుకు తీవ్రమైన వేదన కలిగిస్తుంది. మర్యాదకరమైన జీవితాన్ని అనుభవిస్తున్న మధ్యతరగతి, ధనిక వర్గాలతో పోలిస్తే వారి జీవితంఘోరంగా ఉంటుంది. సమాజపు ఫలాలకు వారూ హక్కుదారులే. వారూ దేశం బిడ్డలే. వారూ అందరిలాంటి పిల్లలే. వారి కోసం ఎందుకు సమాజం ఆలోచించదు? ఎందుకు వారిని ఈసడించుకుని పదే పదే వారిని మరింత నిరాశలోకి తిరుగుబాటులోకి నెడుతుంది అనిపిస్తుంది.

ఈ కథలో నాగ్‌పూర్‌లోని ఒక మధ్యతరగతి కాలనీని ఆనుకుని ఉండే మురికివాడలోని పిల్లలకు ఆ మధ్యతరగతి కాలనీలో నివసించే అమితాబ్‌ దగ్గర అవుతాడు. అప్పటికే వాళ్లు అరాచకంగా ఉంటారు. వారికి జీవితం మీద ఏ ఆశా లేదు. వారికి ఫుట్‌బాల్‌ ఆడితే  డబ్బు ఇస్తూ ఆ ఆట మీద మోజు కలిగిస్తాడు. మెల్లమెల్లగా వారికి ఆ ఆట నిజమైన నషాగా మారుతుంది. అందరూ ఆటగాళ్లు అవుతారు. అప్పుడు అమితాబ్‌ తన కాలేజీలో దేశంలోని అన్ని మురికివాడల టీమ్‌లను పిలిపించి జాతీయ టోర్నమెంట్‌ ఆడిస్తాడు. ఆ తర్వాత ఈ టీమ్‌లన్నింటి నుంచి ఒక టీమ్‌ తయారు చేసి వరల్డ్‌కప్‌కు తీసుకువెళతాడు. అయితే ఆ మొదలు నుంచి ఈ చివరకు మధ్య ఎన్నో బరువెక్కే సన్నివేశాలు. కన్నీటి గాధలు. నిస్సహాయ క్షణాలు.

సామాజిక చైతన్యం కలిగించే ఇటువంటి కథలకు హిందీలో పెద్ద పెద్ద స్టార్లు మద్దతు ఇస్తున్నారు. రణ్‌వీర్‌ సింగ్‌ ‘గల్లీ బాయ్‌’ చేశాడు. అమితాబ్‌ ‘ఝండ్‌’ చేశాడు. దక్షిణాదిలో కూడా ఇలాంటి ప్రయత్నాలు జరగాలి.

మనం రోడ్డు మీద వెళుతున్నప్పుడు ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ దగ్గర పిల్లలు బిచ్చమెత్తుతూ కనిపిస్తే తప్పక ‘ఝండ్‌’ సినిమా గుర్తుకొస్తుంది. ఎందుకంటే అది చూపే ప్రభావం అలా ఉంటుంది. చూడండి.

మరిన్ని వార్తలు