Cyber Crime: ఫ్రెండ్‌ అని నమ్మి.. అక్కాచెల్లెళ్లు రూ. 8 లక్షలు ఇచ్చారు.. చివరికి

23 Sep, 2021 10:16 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఇలా చేస్తే ఉద్యోగం వస్తుందా..?!

ఇటీవలే బి.టెక్‌ పూర్తి చేసిన చంద్రిక (పేరు మార్చడమైనది) ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఓ రోజు ఫేస్‌బుక్‌లో ఆనంద్‌(పేరుమార్చడమైనది) అనే పేరుతో ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ వచ్చింది. అతని ప్రొఫైల్‌ నచ్చి చంద్రిక యాక్సెప్ట్‌ చేసింది. తన పోస్టులకు స్పందించడంతో పాటు, మెసెంజర్‌ ద్వారా సరైన సూచనలు చేయడం, సంభాషణ నచ్చడంతో కొన్ని రోజుల్లోనే చంద్రికకు ఆనంద్‌తో స్నేహం కుదిరింది. ఆనంద్‌ ఫోన్‌లోనూ చంద్రికతో మాట్లాడుతుండేవాడు. ఇద్దరి స్నేహం వ్యక్తిగత విషయాలు పంచుకునేంతగా ఎదిగింది.

డబ్బు ఇస్తే సులువా?
సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నట్టు చెప్పింది చంద్రిక. ‘నాకు ప్రముఖ కంపెనీలలో స్నేహితులున్నారు. నేను చెబితే నీకు ఉద్యోగం సులువుగా వచ్చేస్తుంది. కాకపోతే కొంత డబ్బు ఖర్చవుతుంది’ అని చెప్పాడు ఆనంద్‌. అతను చెప్పిన విషయాలు చంద్రికకు బాగా నచ్చాయి. ఆ ఖర్చు భరిస్తానని చెప్పింది. అంతేకాదు, తన అక్క లహరి (పేరు మార్చడమైనది)కి కూడా జాబ్‌ చూడమని, కరోనా కారణంగా జాబ్‌ పోయిందని చెప్పింది. ఆనంద్‌ సరేనన్నాడు. రెండు రోజుల్లో తను ఏయే కంపెనీలవారితో మాట్లాడిందీ చెప్పి, రూ.4 లక్షల వరకు ఖర్చవుతుంద’న్నాడు. ఆనంద్‌ చెప్పిన అమౌంట్‌ను అతని అకౌంట్‌కు బదిలీ చేశారు అక్కాచెల్లెళ్లు.

ఫోన్‌ ఇంటర్వ్యూతో బురిడీ
రెండు రోజుల తర్వాత ఓ పేరున్న కంపెనీ నుంచి అంటూ చంద్రికకు ఫోన్‌ వచ్చింది. హెచ్‌ఆర్‌గా పరిచయం చేసుకున్న వ్యక్తి వెరిఫికేషన్‌ అంటూ సర్టిఫికెట్‌ పేపర్లు ఆన్‌లైన్‌ ద్వారా తీసుకున్నాడు. వెరిఫికేషన్, ఇంటర్వ్యూ అంటూ వారం రోజులు ఫోన్‌లోనే సంభాషణలు జరిగాయి. కంపెనీలో జాబ్‌ కన్ఫర్మ్‌ కావాలంటే ఏయే దశల్లో ఎంత మొత్తం చెల్లించాలో కూడా ఆ వ్యక్తి చెప్పాడు. దీంతో దఫ దఫాలుగా అక్కాచెల్లెల్లిద్దరూ రూ.8 లక్షల వరకు నగదు మొత్తాన్ని బదిలీ చేశారు.

అందుకు లహరి తను గతంలో ఉద్యోగం ద్వారా సంపాదించిన మొత్తం, తల్లిదండ్రుల నుంచి తీసుకున్న డబ్బును బదిలీ చేశారు. కరోనా సమయం కాబట్టి, కొన్ని రోజులు ఎదురు చూడాల్సి ఉంటుందని, మెయిల్‌ ద్వారా కంపెనీ నుంచి జాయినింగ్‌ లెటర్‌ వస్తుందని సదరు వ్యక్తి చెప్పాడు. చంద్రిక, లహరి సరే అన్నారు. నెల రోజులైనా కంపెనీ నుంచి ఎలాంటి మెయిల్, ఫోన్‌ కాల్‌ రాలేదు. తాము డబ్బు చెల్లించిన వ్యక్తికి ఫోన్‌ చేస్తే స్విచ్డాఫ్‌ వస్తోంది. ఫేస్‌బుక్‌లో పరిచయమైన ఆనంద్‌కు ఎన్ని మెసేజ్‌లు చేసినా రిప్లై లేదు. ఆ తర్వాత అతని ఫేస్‌బుక్‌ అకౌంట్‌ కూడా కనిపించలేదు. మోసపోయామని గుర్తించేలోపు పెద్ద మొత్తంలో డబ్బు కోల్పోయారు. 
∙∙ 
స్కామ్‌లను ఇలా గుర్తించవచ్చు..

  • సంభాషణల్లోనే ఇంటర్వ్యూ అంటూ, ఆ వెంటనే ఉద్యోగం వస్తుందని త్వరపెడతారు. 
  • మెసేజ్‌ల ద్వారా ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూలు చేస్తారు. ∙నిజానికి ఏ కంపెనీలు ఉద్యోగం పేరిట డబ్బు అడగవు.సెక్యూరిటీ డిపాజిట్‌ లేదా సర్వీస్‌ ఫీజు చెల్లించమని కోరవు. 
  • అనేక స్కామ్‌ ఇ–మెయిల్‌లు నిజమైన కంపెనీల నుండి వచ్చినట్లు కనిపిస్తాయి. కానీ, అవి వృత్తి పరమైనవి కావు. 
  • వారి అధికారిక డొమైన్‌ ఇ–మెయిల్‌లకు బదులు గూగుల్‌/యాహూ ఖాతాల నుండి మెయిల్స్‌ వస్తాయి. 
  • ఉదాహరణకు: jobs@bankofamerica.comకు బదులు ఇలా  jobs@bankof-america.com ఏదో ఒక లెటర్‌ తేడాతో ఇ–మెయిల్‌ ఉంటుంది. విరామచిహ్నాలు, కామాలు, పుల్‌స్టాప్‌లు, పేరాలు, వ్యాకరణ దోషాలు.. వంటివి ఉంటాయి.  ఇ–మెయిల్‌ ఐడీ కూడా నకిలీది ఇవ్వచ్చు.  
  • తనిఖీ సాకుతో మన వ్యక్తిగత సమాచారాన్ని (ఆధార్, పాన్, పాస్‌పోర్ట్‌ కాపీలు) ఇవ్వమని అడిగితే, చట్టబద్ధమైన ఇ–మెయిల్‌ ఐడికి మాత్రమే పంపించామా లేదా అనేది నిర్ధారించుకోవాలి. కొన్ని ఆన్‌లైన్‌ జాబ్‌ స్కామ్‌లు
  • అర్హత లేకపోయినా అధికారిక ఇంటర్వ్యూ ప్రక్రియ ద్వారానే ఉద్యోగం పొందవచ్చని చెబుతారు.
  • సులభమైన ఆఫీసు పనిని ఇంటి నుంచే చేయవచ్చని ఆఫర్‌ చేస్తారు. 
  • పెనాల్టీ క్లాజ్‌ ఉన్న సాధారణ డేటా ఎంట్రీ ఉద్యోగం చేయడానికి ఒప్పంద పత్రంపై సంతకం చేయమని, ఇరకాటంలో పెడతారు.
  • కొన్ని సాధారణ పనుల ద్వారానే (ఫాలో, లైక్, షేర్, కామెంట్‌..) ఆదాయం పొందవచ్చనే ఆఫర్‌ ద్వారా ఆకర్షణకు లోనుచేస్తారు. 
  • విదేశాలలో విద్య/ఉద్యోగం.. వీసా గ్యారెంటీతో భారీగా ఛార్జీలు వసూలు చేస్తారు. 

జాబ్‌ స్కామ్‌లో  చిక్కుకోకుండా ఉండాలంటే.. 
ఫీజు కోసం అంటూ ముందస్తుగా డబ్బు చెల్లించవద్దు. ఇంటి నుంచి ఆన్‌లైన్‌ వర్క్‌ చేయడానికి మీరు డబ్బు చెల్లించని పనిని తీసుకోండి. మీ వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ పంపించవద్దు. ఒక చిన్న పని కోసం కంపెనీ పెద్ద మొత్తంలో డబ్బు ఆఫర్‌ చేస్తుందంటే, అస్సలు నమ్మద్దు. ఉద్యోగం కోసం ఏదైనా కంపెనీకి ఒరిజినల్‌ సర్టిఫికెట్లను ఇవ్వద్దు. అలా ఇచ్చే సందర్భాలలో ఆ కంపెనీలలో పని చేసే, మీతో పాటు చదువుకున్న స్నేహితుల సూచనలు తీసుకోవడం మంచిది. 
– అనీల్‌ రాచమల్ల, డిజిటల్‌ వెల్‌బీయింగ్‌ ఎక్స్‌పర్ట్, ఎండ్‌ నౌ ఫౌండేషన్‌ 
చదవండి: Cyber Crime: తల్లికి తన గురించి చెప్పిందని.. పొరుగింటి కుర్రాడే గృహిణిపై

మరిన్ని వార్తలు