నిన్ను నిలిపే దేవుడు ఉన్నాడు!

11 Jul, 2021 09:12 IST|Sakshi

సువార్త 

ఎత్తయిన స్థలములమీద ఆయన నన్ను నిలుపుతున్నాడు (కీర్తన 18:33). నిత్య జీవితంలో అనుదినం మనలో ప్రతి ఒక్కరం ఏదో పనిలో నిమగ్నమై ఉంటాము. అహర్నిశలు పని చేయడం కొందరికి ఆనందం, మరికొందరికి బాధ్యత. ఇష్టమైన పనిని ఎంత కష్టమైనా, ఎన్ని అవాంతరాలు ఎదురైనా చేసేస్తాం. ఇష్టం కాకపోతే సునాయాసం గా చేయగల పనులను కూడా వాయిదాలు వేస్తుంటాం. మనకు మనస్కరించని పనులకు ఏవేవో సాకులు చెబుతూ వాటిని పక్కనపెడుతుంటాం.

సకల చరాచర సృష్టిని తన మహత్తయిన మాట ద్వారా సృష్టించిన దేవుడు కూడా తన సంకల్పాలను నెరవేర్చడానికి పనిచేస్తూనే ఉన్నాడు, ఉంటాడు కూడ. ఆయనకు పనిచేయడం ఇష్టం. బలీయమైన తన నిర్ణయాల నుండి ఎవ్వరూ ఆయన్ను పక్కకు తీసుకెళ్ళలేరు. తనను నమ్మినవారి యెడల తన ఉద్దేశాలను నెరవేర్చడం దేవునికి మహా ఇష్టం. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములేగాని హానికరమైనవి కావు (యిర్మీ 29:11) వ్యతిరేక శక్తులు, ప్రతిబంధకాలు ఆయన్ను ఇసుమంతైనా నిలువరించలేవు.

విశ్వాసంలో బలిష్టులను ఉన్నతస్థలాల్లో నిలబెట్టడం దేవునికున్న మహాశయం. చరిత్రలో ఎన్నో ఉదాహరణలు మనలో స్ఫూర్తిని రగిలిస్తాయి. పెంటకుప్పల నుండి దీనులను పైకి లేవనెత్తి వారిని తన ప్రతినిధులుగా ప్రపంచానికి పరిచయం చేయడం దేవుని అలవాటు. బెత్లేహేము పొలాల్లో గొర్రెలు కాసుకుంటున్న దావీదును ఇశ్రాయేలు రాజ్యానికి తిరుగులేని రాజుగా నిలబెట్టాడు. ఇప్పుడు పదుల సంఖ్యలో గొర్రెలను కాస్తుంటే... భవిష్యత్తులో వందల సంఖ్యలో కాచే అవకాశం ఉండచ్చు అని అందరూ అనుకొని ఉండవచ్చు. మానవ అంచనాలను పటాపంచలు చేసే శక్తి దేవునిది. ఊహలకు అందని మేళ్లు చేసే మహాఘనుడు మన దేవుడు. గొర్రెలు కాసుకొనే దావీదును ఇశ్రాయేలు రాజ్యాన్ని నలభై సంవత్సరాలు అద్భుతరీతిలో పాలించగలిగే రాజుగా నిలబెట్టాడు.

రాజ్యాన్ని అప్పగించిన దేవుడు దావీదు ద్వారా ఎన్నో ప్రజోపకరమైన గొప్ప కార్యాలను నెరవేర్చాడు. ఎందరినో నిలబెట్టిన దేవుడు నిన్నెందుకు నిలువబెట్టడు? విశ్వచరిత్రలో కృంగిపోయినవారిని లేవనెత్తిన దేవుడు నిన్నెందుకు లేవనెత్తడు? నిరాశా నిస్పృహలో కూరుకొని ఏడుస్తున్నావా? పట్టించుకొనే వారెవరు లేరని దుఃఖిస్తున్నావా? పడిపోయిన మనిషిని నిలబెట్టడమే దేవుని పరిచర్య. ఎందుకంటే దేవుడు అందరిని అమితంగా ప్రేమిస్తున్నాడు. పాపమనే అగాథ స్థలములలో చిక్కుకుపోయిన మానవునికి తన కరుణ  హస్తాన్ని అందించి వారిని ఉన్నత స్థలాలలో నిలబెట్టి తన ఔన్నత్యాన్ని ఋజువుపరచాలనే యేసుక్రీస్తు ఈ భువికేతించారు. నీవైపు తన చేతులు చాపి అన్ని విషయాల్లో నిన్ను నిలబెట్టాలని ఆశిస్తున్న దేవునికి నీ చేతిని విశ్వాసం తో అందిస్తే చాలు. ఉన్నతమైన అనుభవాలతో, ఆశయాలతో, ఆశీర్వాదాలతో నిన్ను నిలిపి అనేకులకు ఆశీర్వాదకరంగా నిన్ను చేస్తాడు. ఆమేన్‌!
– డా.జాన్‌ వెస్లీ,  క్రైస్ట్‌ వర్షిప్‌ సెంటర్‌

మరిన్ని వార్తలు