ట్రెండ్‌ సెట్టర్‌

20 Mar, 2022 02:59 IST|Sakshi
మహారాష్ట్ర గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోషియార్‌ చేతుల మీదుగా అవార్డు అందుకుంటున్న జ్యోతి అధవ్‌.

డిజిటల్‌ మీడియా అందుబాటులోకి వచ్చాక మరుగున పడిన, మారుమూల ప్రాంతాల్లోని ఎంతోమంది ప్రతిభ వెలుగులోకి వస్తోంది. వినూత్న నైపుణ్యాలతో తామేంటో నిరూపించుకుంటూ ట్రెండ్‌సెట్టర్‌లుగా నిలుస్తున్నవారు ఎందరో. ఈ కోవకు చెందిన వారే జ్యోతి అధవ్‌. కార్పొరేట్‌ రంగంలోనేగాక, సామాజిక సేవారంగంలోనూ విశేషమైన సేవలందించి 2022 సంవత్సరానికి గానూ టైమ్స్‌ ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచింది. మహిళలు బలహీనులు కాదు, మనసుపెట్టి పనిచేస్తే ఒకచేత్తో ఎన్నో పనులు చక్కదిద్దగలుగుతారు అని నిరూపిస్తోంది జ్యోతి అధవ్‌.  

 పూనేకు చెందిన జ్యోతి క్రియేటివ్‌ ఆర్టిస్టేగాక, విజయవంతంగా రాణిస్తోన్న వ్యాపారవేత్త. ఒక పక్క నైరూప్య చిత్రకారిణిగా రాణిస్తూనే, బిజినెస్‌ ఉమెన్‌గా దూసుకుపోతూ, ఎన్జీవోని నడుపుతున్నారు. జ్యోఆర్ట్స్‌ అండ్‌ డెకార్స్‌కు వ్యవస్థాపక డైరెక్టర్‌గానూ పనిచేస్తోంది. తన చిత్రకళా నైపుణ్యంతో అల్ట్రా మోడ్రన్‌ ఆర్ట్‌ స్టూడియోను నిర్వహిస్తూ...చిత్రకళానైపుణ్యంతో స్పష్టమైన, ప్రత్యేకమైన డెకరేటింగ్‌ ఉత్పత్తులను తయారు చేసి విక్రయిస్తోంది. పూనే కేంద్రంగా నడుస్తోన్న మసాలా కంపెనీ ‘సాఫ్రో’కు ఒక డైరెక్టర్‌గా పనిచేస్తోంది. గత కొన్నేళ్లుగా తన ఉత్పత్తులను దేశ, విదేశాల్లో విక్రయిస్తూ మంచి లాభాలను ఆర్జిస్తోంది. ఇలా అనేక వ్యాపారాలను ఎంతో నైపుణ్యంతో చూసుకుంటూ అభివృద్ధి పథంలో నడిపించడం విశేషం.  
 
వసుమతి వెల్ఫేర్‌
 మంచి కళాకారిణిగానేగాక విజయవంతమైన వ్యాపారవేత్తగా రాణిస్తోన్న జ్యోతికి మానవత్వ గుణాలు కాస్త ఎక్కువే. సమాజానికి తిరిగిచ్చేయాలన్న ఉద్దేశ్యంతో భర్త విజయ్‌ అధవ్‌ సహకారంతో వసుమతి వెల్ఫేర్‌ ఫౌండేషన్‌ను స్థాపించింది. ఈ ఫౌండేషన్‌ ద్వారా ఆసరా కోల్పోయిన వారు, నిరుపేదలకు సాయం చేస్తోంది.

పేదల ఆకలి తీర్చడం, అనారోగ్యంగా ఉన్నవారికి  వైద్యసదుపాయాలను అందిస్తోంది. అంతేగాక మహిళ అభ్యున్నతికి కృషిచేస్తోంది. ఆడపిల్లల విద్యను ప్రోత్సహిస్తూ వారి విద్యకయ్యే ఖర్చునూ భరిస్తోంది. నాలుగో తరగతి నుంచి పదో తరగతి వరకు అయ్యే ఖర్చును ఈ ఫౌండేషన్‌ అందిస్తోంది. కరోనా సమయంలోనూ రోగులకు వైద్య సదుపాయం, ఆహారం, నీటిప్యాకెట్లు, వంట సరుకులను ఉచితంగా పంపిణీ చేసింది.


 చిత్రకళాకారిణిగా, వ్యాపార వేత్తగా, మానవతా వాదిగా అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తోన్న జ్యోతి అధవ్‌ ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తుండడం వల్లే ఆమె  2022 సంవత్సరానికి గాను ‘టైమ్స్‌ అప్‌లోడ్స్‌ ట్రెండ్‌ సెట్టర్‌’గా నిలిచింది. కష్టపడేతత్వం, ఓర్పు సహనం ఉండాలేగానీ నాలుగైదు పనులు ఒక్కసారే చేయవచ్చు అని నిరూపిస్తోంది జ్యోతి. ప్రతి మనిషికీ ఉండేది 24 గంటల సమయమే. కానీ జ్యోతి అధవ్‌ లాంటి వాళ్లు ఆ ఇరవై నాలుగు గంటల్లోనే ఎన్నో పనులు చేసి ట్రెండ్‌ సెట్‌ చేస్తున్నారు.
 
చిత్రకళాకారిణిగా, వ్యాపార వేత్తగా, మానవతా వాదిగా అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తోన్న జ్యోతి అధవ్‌ ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తుండడం వల్లే ఆమె  2022 సంవత్సరానికి గాను ‘టైమ్స్‌ అప్‌లోడ్స్‌ ట్రెండ్‌ సెట్టర్‌’గా నిలిచింది.

మరిన్ని వార్తలు