దిగులు తాడు

5 Oct, 2020 00:50 IST|Sakshi

కవిత

ఏదీ నన్ను వంచలేదు
తుంగ తీసువాణ్ణి గదా
తొలి బోధకుణ్ణి గదా
బహుశా
తొలి కార్మికుణ్ణి కూడా
అనంత కరుణామూర్తిని
ఏదీ నన్ను చంపలేదు
చచ్చిన ప్రతిసారి బతుకుతున్నవాణ్ణి
ఈ పక్క నుంచి చనిపోతున్నా
ఆ పక్క నుంచి బతుకుతున్నవాణ్ణి
పదంతస్తుల భవనాలకు
కిందకీ పైకీ దిగుతూ ఎక్కుతూ
రంగులేసేవాణ్ణి
సున్నం రాసేవాణ్ణి
చూసేవాళ్లనుకుంటారు
ప్రాణాధారమైన తాడు              
    వేళాడుతున్న తాడు తెగితే
తెగితే
పవన మాలికల మీద ఊగుతాను
ఒంటికి ఇంటికి పద్యానికి రంగులేసేవాణ్ణి
పాచిపట్టిన మనుషులకు
లోన బయటా సున్నం వేసేవాణ్ణి
రేపటి నుంచి కొత్త రూపం       
    సరికొత్త స్వరూపం
మొదటి రూపం ఒక రకంగా
తుది రూపం ఒక రకంగా
సున్నం బక్కెట్‌ పొడుగాటి కుంచె కర్ర అంతే
వెదురువనాలు వూగుతాయి
ఏటిఒడ్లు కదులుతాయి
తెల్లవారటంలోనే పొద్దుగూకటం
పొద్దుగూకటంలోనే తెల్లవారటం
ఎవరో పొద్దున్నే తూర్పుదిక్కుకు 
జేగురు రంగు పూసాడు
నాతోపాటూ
సూర్యుడూ ఎక్కుతాడు దిగుతాడు
కాని
దిగులు తాడు ఒక్కటి         
    వేళాడుతుంటుంది అన్ని వేళలా–
- కె.శివారెడ్డి

మరిన్ని వార్తలు